Saturday, August 7, 2010

క్షమాపణా ... మన్నించు ...

భావం భాషను వెతకడం నేరం
అక్షరాలకు ఆలోచన లేకపోవడం పాపం

కంటికి ద్రోహం చేసేవి రెప్పలే
శిక్ష విధించే చట్టం లిఖిస్తాను

ఆశను నిరాశ ఎందుకు ఓడించాలి
రిఫరీ లేని ఆట

గింజలేరుకునే పిట్టలు కాన్వాసు మీద చిత్రమైనప్పుడు
పొలం ఎవరిని నిందించాలి

నీరూ నిప్పూ చెలిమికి
ఆమోద ముద్రలు ఎక్కడివి

ప్రాయశ్చిత్తం ప్రాధేయ పడడమేంటి
ప్రశ్నకు ఒకే జవాబా

ఆ దృశ్యం అదృశ్యం
వెనుక అదృశ్య శక్తి నువ్వేనా

క్షమాపణా మన్నించు
చీకటిలో ... ఎవరూ చూడకుండా ...

ఖాళీ

శూన్యం చూడాలి
ఖాళీ ఉన్న చోటు
కలను మింగేసే కలత కనాలి
రెప్పలకు ఎప్పుడూ నిద్ర లేమి

పుట్టుకతోనే వాడు ప్రయోజకుడు అయ్యుండాలి
నొప్పులు లేని సుఖ ప్రసవం
విశాల హృదయంలో
మిల్లీ మీటర్ జాగా కోసం

చిన్ని బుర్రలో నుంచి ఆలోచనలు జారిపోతున్నై
శవం ముందు పేలాలు ఏరుకుంటున్నారు
అనంత చీకటి చిరు దీపాన్ని తరిమేసింది
వెన్నెల రాజుతో చిరకాల వైరం