Tuesday, February 22, 2011

మ్యాచ్ ఫిక్సింగ్

ఏ మ్యాచ్ ?
ఎవరు ఫిక్స్ చేసారు ?
అసలు ఎక్కడ జరుగుతోంది ?

విశ్వాసం లేని చోట అవిశ్వాస తీర్మానం
రచ్చ చేసేందుకు వచ్చి చర్చ జరగలేదని వగచడం
జెండాలు వేరైనా ఎజెండాలు ఒకటే
ఇది రసాభాస సభాపర్వం

నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం
ఇప్పుడు దిసమొలతో నిలుచుంది ప్రజాస్వామ్యం
మాటల్లో సిగ్గులజ్జలు, చీమూనెత్తురులు
మీకున్నాయా?

Saturday, February 12, 2011

నాకో షుగర్ లెస్సూ...

చీకట్లను చీల్చుకుంటూ
వెలుతురు దారి
చెమటలు కక్కుకుంటూ
అలుపెరగని ఓ బాటసారి


యూజ్ అండ్ త్రోలు
కొన్ని మరకలు
మరికొన్ని గురుతులు
చిందర వందరగా వ్యర్ధాలు


మార్నింగ్ వెరీ ఫ్రెస్షూ
ఈవెనింగ్ వెరీ స్ట్రెస్షూ
ఉరుకు పరుగుల జీవితం
ఆశే ఆసాంతం

పేరు మధురం
తీరు దుర్భరం
ప్రతి మనిషికి విరోధి
అది ఓ వ్యాధి

చక్కెర.. షుగర్ ..డయాబెటిక్ ..
ఎలా పిలుచుకున్నా
తీయగా పలుకుతుంది
ఆనక విషం చిమ్ముతుంది


ఆకలికి తీర్చే అన్నం విషమై
తనువెల్లా తూట్లు పొడుస్తుంటే
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన
ప్రియురాలు గొంతు నులిమేస్తున్నట్లుంది

నిరంతరం చావు భయంతో
తింటూ .. బతుకుతూ
తీయనైన రోగాన్ని హాయిగా జయించాలనే
ఈ వేకువ పోరాటం

నీడ కూడా జాడ చూపని వేళలో
జీవితాన్ని కాచి వడపోసిన వాడిలా
ఖరీం భాయి చాయ్
నాకో షుగర్లెస్సూ...
(ప్రస్తుతానికి చక్కెర వ్యాధితో నాకు తీయనైన బంధం ముడిపడలేదు. చాయ్ బంకులు, టీస్టాల్స్ వద్ద ఉదయాన్నే వినిపించే పిలుపులకు స్పందించి)

శ్రిచమన్- 9490638222





























Wednesday, February 9, 2011

మరణ వాంగ్మూలం



మరణ వాంగ్మూలం

నింగీ నేల
మన్నూ మిన్నూ మధ్య
మెతుకు కోసం .. బతుకు కోసం
ఆశ చావని నేను
రాస్తున్నా మరణ వాంగ్మూలం

నేను అన్న దాతను కాను
నా తల రాత కూడా రాసుకోలేని నిరక్షరాస్యుడిని

నాదో వ్యాపారం
అన్నీ కొంటాను ..
చివరికి అమ్ముకున్దామనుకుంటాను
విత్తనాలు చల్లి రూపాయలేరుకున్దామనే ..


నీరు నిప్పైయ్యింది
పురుగు పోటు.. కరువు కాటు
అన్నింటినీ తట్టుకుంటే
దళారీకి ఫలహారం

ఎప్పుడూ
చీడ పీడల కలలు
వానగాలుల భయాలు
వడగాడ్పుల పలవరింతలు

చేను మేసిన కంచె
చెరువును కొట్టేసిన గట్టు
శ్వాస ఆపిన ఆశ
మందునూ తినేసిన పురుగులు

అదిగో క్రిమిసంహారక మందు
ఇదిగో దాని రసీదు
ఇదే నా శవ పంచనామా
నా చావుకు ఎవరూ కారణం కాదు

యుద్ధభూమిలో నేలకొరిగిన సైనికుడిలా
జల్విలయానికి బురద కరిచిన పంట చేల నుంచి ..
ప్రత్యక్ష ప్రసారం ...

మీరిప్పుడు చూస్తున్నవిజువల్స్
ఆత్మహత్య చేసుకున్న
కౌలురైతు ఇంటినుంచి
మన చానల్కే ప్రత్యేకం

రోజూ చచ్చేవాడిని
ఎవడో పరామర్సిస్తున్నాడక్కడ
దేశంలో ఎక్కడా లేని చావు ప్యాకేజి
వ్యవసాయం దండగని ఎవడన్నాడు .. పండగ చేసుకో ..


శ్రిచమన్- 9490638222
07-02-11SriChaman ద్వారా





Tuesday, February 8, 2011

యాతరెల్లిపోదాం..

అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఐదేళ్ళకో, మధ్యన్తరానికో ప్రజలపై దయ, ప్రేమ కలిగి ఉండే వాళ్ళు. పరామర్సలకు నిర్దిష్ట కాలాలున్డేవి. ఇప్పుడు ఏ కాలం వచ్చినా జనాలకి మాత్రం పోయేకాలంగానే మారింది . ఇప్పుడు రోజూ ఎక్కడో ఓ చోట ఏదో ఓ స్థాయి పరామర్సో .. ఖండనో మున్దనో చేయాల్సిన ఖర్మ నాయకులకు ఏర్పడింది. ఆంగ్ల కొత్త సంవత్సరం ఏ పార్టీ నాయకుడికి కంటి మీద కునుకు లేకుండా చేసి ఇంటి పట్టున ఉండనీయడం లేదు . పెజలంటే ఓటర్లనే స్థిరమైన అభిప్రాయం ఉన్న నేతలు నిరంతరం వారి మధ్యనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. మేడారం జాతర, పోలిపిల్లి పైడితల్లమ్మ జాతర, సంబర యాత్ర, కోటప్పకొండ తిరుణాలను జనాలు నిర్వహించుకోనేవారు. రోజులు మారాయి. సర్కారు దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షుగా మారింది. ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి. నేను పెజల మనిషినంటూ ఒకరు, నేనోస్తేనే మీకు న్యాయం అంటూ మరొకరు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జనం కోసం పాటు పడేది మేమేనంటూ మొక్కు చెల్లించుకునేందుకు నాయకులే యాతరెల్లిపోదామే.. జాతరో.. జాతరో.. వూల్లమీద పడ్డారు.

Monday, February 7, 2011

పదవులే లక్ష్యం ..విలీనమే మార్గం

సారీ చేప్పొద్దు.. నువ్వు ఇంకొకరిని వంచించు. వాడిని మరో ముగ్గురిని మోసం చెయ్యమను. అప్పుడు సామాజిక న్యాయం జరుగుద్ది. అప్పటికీ జరగకపోతే ఒక రాజకీయ పార్టీ పెట్టు. టికెట్లు అమ్మకానికి పెట్టు. రికార్డు స్థాయి కలెక్షన్లు రాకపోతే ఒట్టు. సినిమా రాజకీయాలు ఒక్కటైనా ప్రదేశంలో. అభిమానం అంగడి వస్తువయ్యింది. సామాజిక వర్గాల కూడిక తీసివేతల్లో సామాజిక న్యాయం డిమాండ్ సప్లై సూత్రమైంది. ఇప్పుడు శత్రువులు లేరు. అందలమేక్కే వేళ అందరూ మిత్రులే. ఒక్కడిగా వచ్చాడు. తెరపై నాయకుడయ్యాడు. బంధుమిత్ర సపరివారమంతా తెరంగ్రేటం చేసారు. కళా మతల్లి సేవ ముగిసింది. బుల్లితెర వెండితెరను కమ్మేసింది. దాచినదంతా దోచిపెట్టాల్సి వస్తుందనుకున్నారో ఏమో? ప్రజా సేవకు తెర తీసారు. ఫస్ట్ ఆఫ్కే సీను సితారయ్యింది. సెకండ్ ఆఫ్లో పదవులే లక్ష్యం .. విలీనమే మార్గంగా తోచి సామాజిక న్యాయంపై బెంగ పట్టుకుంది.