Sunday, December 5, 2010

నవ్వుల పాలైపో..

నవ్వడమే యోగం. నవ్వలేకపోవడం ఒక రోగం. ఆగు. పడీ.. పడీ నవ్వీకు. ఇంకోటి కూడా సెప్పాలి. నవ్వు నలబై విధాల చేటు. ఎక్కడ నవ్వాల. ఎక్కడ నవ్వ కూడదు. జోకోచ్చినా.. దోకొచ్చినా.. ఆగదు. ఐనా ఆపుకోవాల .. తిథీ నక్షత్రం చూసుకోవాల .. రాశి ఫలాలు బేరీజు వేయాలా . రాజపూజ్యం ..అవమానం లేక్కగట్టాల. అసమదీయులుంటారు. తసందీయులుంటారు. అన్జనమేయాల. ఇప్పుడు నవ్వు .. నవ్వించు .. నవ్వుల.. పాలైపో...

Thursday, November 25, 2010

తీరం చేరిన అల

తూరుపు తీరం
చేరని అల

కల్లోలం
నిశ్శబ్దం

భావాలు నిక్షిప్తం
అలజడి ఏదీ

ఒడ్డున చేరిన
అల్ప సంతోషం

మరుక్షణమే
సాగర గర్భములో మమేకం

నిష్ఫలం
అయినా ఆగని యత్నం

అల
అలా ... అలా..

Saturday, November 13, 2010

తాగితే మరిచిపోలేను

తాగితే మరిచిపోగలను
ఎలా మరిచి పోగలను
గాయం ..మద్యం ఒకటే
బాధ పెడుతూనే ఉంటుంది

తాగుబోతు
తిరుగుబోతు
తేడా లేదు
పేదోడైతే ఈ బిరుదులు

తాగు .. తిరుగు
ఏమైనా చెయ్
జేబులో క్రెడిట్ కార్డో
పచ్చ నోటో ఉండాలి

తాగింది మిగలదు
కక్కినది దక్కదు
మందూ చేదే
బతుకూ వీదే


దేవుడ్ని పూజించు
పూజ సామాన్ల వ్యాపారి బతుకు

తాడు
మద్యాన్ని సేవించు
రోశయ్య పదవిని కాపాడు

ఏది న్యాయం ?

చూసిందా
విన్నదా
కన్నదా
న్యాయమేప్పుడూ
అన్యాయం వైపు మొగ్గుతుంది

నల్లనిదేప్పుడూ
అక్రమాన్ని
నిరసనను
తెలియజేస్తుంది

నిరసన
నటన
అన్యాయం
నిజం

Saturday, August 7, 2010

క్షమాపణా ... మన్నించు ...

భావం భాషను వెతకడం నేరం
అక్షరాలకు ఆలోచన లేకపోవడం పాపం

కంటికి ద్రోహం చేసేవి రెప్పలే
శిక్ష విధించే చట్టం లిఖిస్తాను

ఆశను నిరాశ ఎందుకు ఓడించాలి
రిఫరీ లేని ఆట

గింజలేరుకునే పిట్టలు కాన్వాసు మీద చిత్రమైనప్పుడు
పొలం ఎవరిని నిందించాలి

నీరూ నిప్పూ చెలిమికి
ఆమోద ముద్రలు ఎక్కడివి

ప్రాయశ్చిత్తం ప్రాధేయ పడడమేంటి
ప్రశ్నకు ఒకే జవాబా

ఆ దృశ్యం అదృశ్యం
వెనుక అదృశ్య శక్తి నువ్వేనా

క్షమాపణా మన్నించు
చీకటిలో ... ఎవరూ చూడకుండా ...

ఖాళీ

శూన్యం చూడాలి
ఖాళీ ఉన్న చోటు
కలను మింగేసే కలత కనాలి
రెప్పలకు ఎప్పుడూ నిద్ర లేమి

పుట్టుకతోనే వాడు ప్రయోజకుడు అయ్యుండాలి
నొప్పులు లేని సుఖ ప్రసవం
విశాల హృదయంలో
మిల్లీ మీటర్ జాగా కోసం

చిన్ని బుర్రలో నుంచి ఆలోచనలు జారిపోతున్నై
శవం ముందు పేలాలు ఏరుకుంటున్నారు
అనంత చీకటి చిరు దీపాన్ని తరిమేసింది
వెన్నెల రాజుతో చిరకాల వైరం


Sunday, July 25, 2010

నీ మట్టిని అమ్మేందుకు నువ్వే ఓ దళారీ...

ఆ మట్టిలోనే పుట్టాడు ... పెరిగాడు
తల్లి, చెల్లిని మరిచినప్పుడే ..
దళారీ లక్షణాలు కనిపించాయి..
దేనినైనా ఎలాగైనా అమ్మడం అలవాటైంది
కొనేవాడు ఎవడైతే నాకేంటి
అమ్ముకునేది అమ్మ అయినా కమిషన్ ఇవ్వాల్సిందే
ఇప్పుడు వాడికి కనిపిస్తున్నది బువ్వ పెట్టే భూమి కాదు
ఊరిపై బుగ్గి పోసే ధర్మల్ భూమ్



Wednesday, July 21, 2010

నడక

నేనో బాటసారి
అది ఓ రహదారి
చూపే తోవ ఒకే వైపు
నడక ఎందుకో యాంత్రికమైంది

కాళ్ళకు బుద్ధిలేదు
కళ్లకూ దూర దృష్టి లేదు
ఒకటే గమ్యం
అటు వైపే పయనం

రాళ్ళూ ...ముళ్లేనా ...
తారు మారయ్యిందా
వెనుక వస్తున్నవారికీ అదే తోవ
ఎదురుపడుతున్నవారూ అదే కోవ

ఎన్నాళ్ళీ నడక
ఇదే దారిలో ఎంత వరకు వెళతావ్
దివికేగినట్టే కనిపిస్తూ
భువిని వీడదు






Friday, July 16, 2010

గుండెతో గుండును అడ్డుకుంటారా?

అల్లరి మూకలు
బతుకు భయంతో
ఆకలనే ఆయుధంతో
దాడులకు తెగబడ్డారు

ప్రజాస్వామ్య బంధువులు
ప్రభువుల సంరక్షణకు బందూకులతో
ఆత్మ రక్షణ నెపంతో
వారిని నిలువరించారు

ఆ వెలుగులు ఎవరివి
ఈ రక్తం ఏ గ్రూపుదో ?
తుపాకీకి చట్టమేంటి
ఉపాధినిచ్చే ధర్మమైన ప్లాంట్ పై రాల్లేసింది ఎవర్రా ?

గుండెతో గుండును అడ్డుకుంటారా
తాటాకు చప్పుళ్ళకు తూటా బెదరదు
ప్రాణానికి లక్షణమైన ఖరీదు
అవసరమైతే ఓ (అ) న్యాయ విచారణ

గాయం కోరేది పరామర్శ కాదు
త్యాగం కోరేది పరిహారం కాదు ...

...శ్రిచమన్.... 9490638222



గుండు ..గుండె

ఆ గుండు గురి
ఎప్పుడూ ఈ గుండెలపైనే
నీరింకని బీల
ఇప్పుడు నెత్తురోడుతోంది

అది ధర్మ భూమి
ధర్మానదీ కాదు
ధర్మల్ కు చెందదు
మా భూమిని మరుభూమిగా మార్చింది ఎవరు ?

బీలపై బేల చూపులే మీకు కనిపిస్తున్నాయ్
నీరు తేలి నెత్తురింకిన నేల అది
మీరు పూడ్చేసిన ఒక నినాదం
వేల గొంతులై ....






Monday, July 12, 2010

పారిపోదాం...

మార్నింగ్ వాక్ లు
రౌండ్ ది క్లాక్
ఉరుకు పరుగులు
నిద్రలోనూ పయనమే ..

పదండి ముందుకు
పదండి తోసుకు
తొక్కుకుంటూ .. ఎక్కుకుంటూ
ఆగకుండా నడిచే వాడే మొనగాడు

తెలియని గమ్యం
అలుపెరుగని పయనం
పడిపోతే పోయేదేం లేదు
లేచి నిలబడడం తప్పా ..

పారిపోదాం ..
నింగిలోకి ..
నీళ్ళలోకి ..
గాలిలోకి
srichaman ...

Saturday, July 10, 2010

అమ్ముకుంటే పాపమా?

ఇదీ పాపమేనా?
ముల్లకంచెల్లోవదిలేయలేదే
పందులో ... కుక్కలకో ఆహారం కాలేదే

కన్నది ఒకరైతే
కొనుక్కున్నది మరొకరు
పేదరికం దాతృత్వం ఐతే
వేరొకరికి మాతృత్వం ...

లక్షలు పోస్తే
లక్షణమైన బిడ్డనిచ్చే
సంతాన సాఫల్య కేంద్రానికి లైసెన్సు
ఆకలితో బిడ్డను అమ్ముకుంటే న్యూసెన్సు

చావూ నేరము
పుట్టుకా నేరం
చెబుతోంది చట్టం

అక్షరం ముక్క రాకపోఇనా
రాజ్యాంగం సెక్షన్లకు అనుగుణంగా
కనడమైనా... కొనడమైనా... జరగాల్సిందే
లేదంటే చట్టం తన పని చేసుకు పోతుంది




Thursday, July 8, 2010

వాన ..

చినుకు నేలను ముద్దాడింది
మట్టి వాసనేదీ ?

నై.. రుతి పవనం
ఈశాన్యానికి వాస్తు దోషం

వానకు కాలంలేదు
మేఘాలతో చెలిమి లేదు

నిషా, ఖైముఖ్, ఓగ్ని, ఐలా, లైలా ...
ఇప్పుడు చినుకంటే వణుకు

ప్రలయమో... విలయమో...
కన్నీటి సంద్రమో ...

వానలో తడవాలని ఉంది ...

Monday, July 5, 2010

వాడ్ని చంపెయ్యండి ...

వాడే .. బలవంతుడు ...
వాడికి కొనుగోలు శక్తి పెరిగినది
అందుకే ధరలు పెంచాము

వాడే .. బలహీనుడు ..
బతకలేక పోతున్నాడు ...
వాడికి ఏమీ అందకుండా బందు చేస్తున్నాము

చుక్కలు తాగి లెక్క కక్కేది వాడే
రోగాలతో కునారిల్లి ఆస్పత్రికి డబ్బు పోసేదీ
ఆకలే ఆస్తిగా అందరి అంతస్తులు పెంచేదీ వాడే

వాడు పేదోడు ..
సిండికేట్లకు పెద్దోడు ..
రక్తాన్ని చెమటగా మార్చే వాడు

వాడు చెమటను ఖర్చు చేస్తాడు
వీడు రక్తముగా మార్చి పొదుపు చేస్తాడు
వాడు batakaali ... ledu వాడ్ని చంపెయ్యండి


Sunday, July 4, 2010

నాకు దేవుడు కనిపించాడు

కొండకు ఎల్తున్నాను
బస్సులో కనిపించాడు
కండక్టర్ దేవుడు
నన్ను చూసి విసుక్కుంటూ

రైలెక్కాను
జెనరల్ టిక్కెట్టుతో రిజర్వేషన్లో ...
ఎదురయ్యాడు టిటి భగవంతుడు
సమర్పించుకున్నాను దక్షిణ

కొండ కాడ
గుండు కాడ
లడ్డు ఉండ కాడ
కనిపించారు సాములోరు

ఏడేడు కొండల దారిలో
గర్భ గుడిలో
కనిపించిన పెతి జీవుడు
నాకు దేవుడి లెక్కే కనిపిస్తున్నాడు

ఇంత మంది దేవుళ్ళను చూసిన నేనే వీఇపి ..
నేను డబ్బిచ్చిన ప్రతి చోటా హుండీ కేననుకున్న
నాకు దేవుడు కనిపించాడు బ్రేక్ దర్సనములో ....

తుపాకి మాట

వారి నోటి నిండా తూటాలే
ఆ తుపాకుల నుంచి వచ్చేవి మాటలే
ఎన్కౌంటర్ .. ఎదురు కాల్పులు
మృత దేహాన్ని గుర్తించారు

వారికి కావాల్సిన మనిషే అతడు
ఇన్నాళ్ళూ అజ్ఞాతంలో ఉన్నాడు
ఇప్పుడు చిక్కాడు
ఎ కాకి కబురు అందించిందో

Wednesday, June 30, 2010

రాయ లేఖ ..

రాయాలని ఉంది ..
రాయలేనని అనిపిస్తోంది
అన్యాయాలను రాసేందుకు అక్షరాలూ కరువు
దురాగతాలను వర్ణించేందుకు మాటలు కరువు

వాదం మింగేస్తుందో
సిద్దాంతం కాటేస్తుందో
వివాదం ముసురుతుందో
రాద్ధాంతం జరుగుతుందో

నా మటుకు జీవితం
నెలకు ఓ సారి వచ్చే జీతం
ఇది నా గతం .. పునరావృతం
ఇదే నా తరతరాల చరితం
...శ్రీచమన్

Thursday, June 24, 2010

రీచార్జి నాలుక

బాబూ ...మాటాడు ...
మొబైలులో బాలెన్సు లేదమ్మా..

ఆ ఇంటి వంట గది రారాజు
ఏ పిజ్జా కార్నర్లో ఇరుక్కున్నాడో

బిడ్డ సెల్ లో ఉన్నాడు
మాటలు ఖర్చు ఐపోతున్నై

చార్జింగ్ ఉంటేనే
నాలుక పని చేస్తోంది

ఇప్పుడు మాట చాలా విలువైనది
ప్రీపైడ్ గానో , పోస్ట్ పైడ్ తోనో , లైఫ్ టైం వ్యాలిడిటీ ...

కొనుక్కున్న మాటలు
అమ్ముకోవడా నికే..

సెకన్ల బిల్లింగ్
నిమిషాల ఆఫర్
నైట్ బాలన్సు
అన్ లిమిటెడ్ టాక్ టైం

మనసుకు మాటలు రావు
మనిషితో మాటాడాలంటే
ఏదో ఓ నెట్వర్క్లో ఉండాలి
ఏ ప్యాకేజీలో ఉన్నావో చెప్పాలి

ఒక్కోసారి లైన్లన్నీ బిజీగా ..
మరోసారి కాల్ వేఇటింగ్
స్విచాఫ్ ..లేదా ఔటాఫ్ కవరేజీ ...

-శ్రీచమన్











Tuesday, June 15, 2010

చావు లేదు

ఛీ.. ఛీ.. చీర్స్ కాదు
వాసన..దుర్వాసన
మృతదేహం వద్ద ఉన్నట్టుంది

అందమైన పలు వరుస
లోపలంతా ఖడ్గమృగం కోరలు
నవ్వు ప్రాణం తీసేలా ఉంది

విశాల నయనాలు
చీకటి ఆవరించిన అద్దాల్లోంచి చూపు
చుట్టూ నల్లని వలయాలు

రెప్పలను కన్నులు నమ్మడము లేదు
కనుల వెనుక ఏవో కుట్రలు దాగినట్లు
నిద్ర నటిస్తూ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నా ...

దయ లేని హృదయం
బరువెక్కింది
కార్పొరేటు చెల్లించి చికిత్సకెల్లింది

నిలువెల్లా మర్మం
దాచిపెట్టుకున్న చర్మం

మందంగా తయారైంది

ఊపిరి ఆగింది
తనను వీడి
తనువూ చాలించింది

చనిపోయాడు... మహానుభావుడు ..
ఎప్పుడు .. అసలెప్పుడు బతికున్నాడని...
రోజూ చచ్చి ..బతికి .. ఈ రోజు గతిన్చారా?









Sunday, June 13, 2010

పోనీ... పోనీ... భో(పా)పాల్...

ఆ శ్వాసలు గాలిలో కలిసిన
ఎన్నేల్లకో ఈ (అ)న్యాయం

ప్రజాస్వామ్యమా వర్ధిల్లు
మరణించీ మూయని కనుపాప సాక్షిగా

విష వాయువు
వారి ప్రాణ వాయువు

పురుగులను చంపలేని మందు
జనాలకు చావు విందు

బానిసత్వం సంకెళ్ళు తెగినా
దొరపై గౌరవం తగ్గలే

భోపాపాల భైరవులను
రక్షించిన కౌరవులూ

పొతే పోనీ భోపాల్ పాపాల్
రానీ రానీ కోపాల్ శాపాల్




Saturday, June 12, 2010

జీవశ్చవాలు


ఎటు చూసినా
జీవశ్చవాలు
మద్యం తాగేందుకే
బతికి ఉన్నాయి

మీకు అన్నం పెట్టేందుకే
మీ జేబుకు కన్నం పెడుతున్నారు
నీ బాగోగులు చూసేందుకే
నిన్ను బ్రష్ట్టు పట్టిస్తున్నారు

చెమట చిందించు
రూపాయి సంపాదించు
సిండికేటు గల్లా పెట్టెకు అందించు
చేరుతావు మృత్యువు అంచు

Tuesday, June 8, 2010

తూరుపు

తూరుపు
ఉదయం కోసమే..
ఎరుపు ఉద్యమంలా..

కొండోలని అంటాడు ఒకడు
కూలోలని పిలుచుకుంటాడు ఇంకొకడు
సికాకులమని ఏలాకోలం సేస్తాడో నటుడు

అమ్మని వదులుకుని
మాయ మాటల్ని నమ్ముకుని
సినీ మాయలోల్లకు అమ్ముకుని ...

బుర్ర తక్కువోలని రాసాడు
ఎర్రిబాగులోలని కూశాడు
అక్షరాలను అమ్ముకున్న విటుడు

విప్లవమై పాట పుట్టింది ఇక్కడ
అన్యాయమంటూ మాట నినదించింది ఇక్కడ
నేల నాదంటూ చైతన్యం గజ్జే కట్టింది ఇక్కడ


అది తూరుపు..
నీకు ఉదయమైనా
జ్ఞానోదయమైనా
అక్కడనుంచే కావాలి
...శ్రీచమన్



Thursday, May 13, 2010

కంటి పాపం

తడారిన కళ్ళు
చుట్టూ నల్లని వలయాలు
కుదురుగా లేని మనస్సు
యవ్వనాన్ని కాటేసిన వయస్సు

జీతం కోసం
అమ్మేసిన జీవితం
కంటి మీద కునుకునూ కొనేసిన కాలం
అమ్మేసుకున్నది ఏంటో తెలియని లోకం




Sunday, May 9, 2010

చీమూ...నెత్తురూ..

ఆస్తి పంజరములా బతకడము
హాయిగా ఉంది
స్పర్శ లేని చోట
స్పందన కూడా ఉండక్కర్ల
విలువలను వలువల్ల
విసిరేసినట్టుంది
ఒక్క బంధం
తెమ్పేయ్
వేనవేల సంబంధాలు
తెగిపోతై
చీమూ నెత్తురూ
లేకపోతె ఎంత ఆరోగ్యం


Thursday, April 29, 2010

కన్నీరు ఉందిగా..

వూరు ఎడారి ..
గొంతు తడారి ..
కనిపించదు దారి ..
ఆడుకునే వారేరీ?

దొరకదు చుక్క నీరు..
ఘోల్లుమంటోంది వూరు..
ఇది ఎడతెగని పోరు ..
దాహార్తి తీర్చేందుకు మిగిలింది కన్నీరు

Tuesday, April 27, 2010

ఎవరు గెలిచారు?

ఐపిఎల్ -౩ ముగిసింది
కాసుల జాతరకు తెర పడింది
ఎవరు వోడారో
ఎవరు గెలిచారో?

రూపాయల కనికట్టు
కనిపెట్టింది ఎవడో తెలుసా?
సిల్లీ పాయింట్..

గల్లీలో జేబు చిరిగిన పిల్లాడిని అడుగు
పనీపాటా మానేసి బెట్టింగ్ ముఠా మాయలో
చిక్కి బిక్క చూపులు చూస్తున్న కుర్రాడిని అడుగు
పేదోళ్ళ డబ్బు పెద్దోళ్ళు ఎలా దోచుకున్టున్నారో?

ఏలూరులో కూలిన కుటుంబాలు
విజయవాడలో ఓడిన జీవితాలు
భాగ్యనగరిలో అభాగ్యులు
విశాఖోప శాఖలుగా మోసాలు

భారత్ వెలిగి..పోతోంది
క్రీనీడలు కమ్ముకున్నై
వాడే కేడి
వాడే లలిత్ మోడి
మాఫియ వాడికి జోడీ










Sunday, April 25, 2010

ఆ(స)హా జీవనం

వాడు భార్యాబిడ్డలను వదిలి
ఇంకొకరితో కలిసుంటే
సహ జీవనమనే బంధం
వీడిది మాత్రం
వివాహేతర సంబంధం

అందమైనదే మీ బంధం
ఏమైందో మీ రక్త సంబంధం

మూడు ముళ్ళ బంధమని
నిర్వచించి ..
దాంపత్య జీవితములో
ఏముందని
ప్రవచించి ..
నీ కోసమే నువ్వు
ఆ(స)హా జీవనం



Saturday, April 24, 2010

అవి.. నీతి కబుర్లు

అవినీతి కబుర్లు
ఆ.. అవే నీతి కబుర్లు
చెప్పేందుకే ఆ విసుర్లు
శ్రీరంగ..రంగ..

నీతి మాలిన చోట
నేతి బీరను నిందించి ఏం లాభం
నీ నిలువెల్లా ఊసరవెల్లి లక్షణం
రంగులు మారుస్తూనే ఉంటావు అనుక్షణం

గురువిన్దదే అందం
కింద నలుపు మనిషి చందం
వీరందరికీ తోలు మందం
ఇదే నీతి.... అవినీతి మధ్య బంధం

Friday, April 23, 2010

తొండి ఆట

ఏమీ లేని చోట
జరుగుతోంది పెద్ద ఆట
దీనికో వేలం పాట
పనిలేని వారికో వెర్రి ముచ్చట

అవుట్ ఎవడో
నాటౌట్ ఎవడో
అంతా నాటకం
గెలుపు ఓటములు భూటకం

పేదా సాదా దగ్గర రూపాయలు దోచుకునే మంత్రం
ఇదే ఇపేఎల్ తంత్రం
పెద్దలు చేస్తారు ఫిక్సింగ్
పేదలు కాస్తారు బెట్టింగ్
చెప్పండి జనానికి ఈ మాట
తొండి ఆట ..
రావద్దు మా పేటకు అని...



సినీ మాయలోబడ్జేట్

తాత నుంచి మనవడి వరకూ ...
అబ్బల నుంచి బాబుల వరకూ ..
తెరలు చింపి ...
కాసులు పిండి...
కళా మతల్లిని
కళా విహీనం చేసి..
ఇప్పుడు వగచి
కళ్ళు తెరచి
ఏడ్చి ఎం ప్రయోజనం

Monday, April 12, 2010

ఏటీ పెళ్లి లొల్లి ..

ప్రపంచమే ఓ కూడలి
ఎటు చూసిన ఘోర కలి
ఎక్కడ చూసిన ఆకలి
చూపించరా జాలి

సానియాకే జరుగుతోందా పెళ్లి
ఎందుకు మీడియాలో ఈ లొల్లి
మీర్జా ఆడింది అందరితో ఆట
ఇప్పుడు వినిపిస్తోంది పెళ్లి పాట

పేదింట్లో పూసిన మల్లి
ఓ చిట్టి తల్లి
ఓ అన్న ముద్దుల చెల్లి
చేస్తున్నారా పెళ్లి

అడవి

అడవి .. కాకులు దూరని కారడవి
ఖాకీలు దూరే అడవి
తుపాకీలు మోగే అడవి
అక్కడి మరణాలు కాన్చడు రవి

క్రూర మృగాలపై సంధించే బాణాలు
తీస్తున్నాయి ప్రాణాలు
ఇంకెన్నాళ్లీ మరణాలు

కొందరిది పోరాటం
మరికొందరిది ఆరాటం
మధ్యనున్న వారికి చెలగాటం

నీ కోసమే అ యుద్ధం
మీకోసమే రణరంగం సిద్ధం
కాదు.. కాదు... అంతా అబద్దం
నీ మనుగడే అక్కడ నిషిద్ధం


.....శ్రీచమన్

Wednesday, April 7, 2010

చల్లని సాయంత్రం

ఓ చల్లని సాయంత్రం
ఓ అందమైన తీరం
మరో ఆహ్లాదకర సందర్భం
అన్నీ కలిసిన సన్నివేశం