Thursday, August 7, 2014

నాకో షుగర్ లెస్సూ...

చీకట్లను చీల్చుకుంటూ
వెలుతురు దారి
చెమటలు కక్కుకుంటూ
అలుపెరగని ఓ బాటసారి
అన్నీ వాడి పారేసేవే
కొన్ని మరకలు
మరికొన్ని గురుతులు
చిందర వందరగా వ్యర్ధాలు
మార్నింగ్ వెరీ ఫ్రెస్సూ
ఈవెనింగ్ వెరీ స్ట్రెస్సూ
ఉరుకు పరుగుల జీవితం
ఆశే ఆసాంతం
పేరు మధురం
తీరు దుర్భరం
మనిషికి విరోధి
అదే ఈ వ్యాధి
చక్కెర వ్యాధి
షుగర్ జబ్బు
డయాబెటిక్ ..
ఎలా పిలిచినా
తీయగా పలుకుతుంది
చేవను మింగేసి
చేదును మిగిలిస్తుంది
ఆకలిని తీర్చే అన్నం విషమై
తనువెల్లా తూట్లు పొడుస్తుంటే
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన
ప్రియురాలు గొంతు నులిమేస్తున్నట్లుంది
నిరంతరం చావు భయంతో
తింటూ .. బతుకుతూ
తీయనైన రోగాన్ని
హాయిగా జయించాలనే
ఈ వేకువ పోరాటం
నీడ కూడా జాడ చూపని వేళలో
జీవితాన్ని కాచి వడపోసిన వాడిలా
నరకాన్ని అధిగమించేందుకు
డయాబెటిక్ ఎడారిలో
నడక దారి
కంకర అడవుల్లో వాకింగ్
కింగ్ లను సేదదీర్చేందుకు
దారి పక్క చెట్టు కింద
అభివృద్ధి మింగేయకుండా
వదిలేసిన గుర్తులా
ఖరీం భాయి చాయ్ డబ్బా
నాకో షుగర్లెస్సూ...
అంటూ ఆర్డర్లు ..


శ్రీచమన్... 9490638222