Wednesday, December 31, 2014

కళా మతల్లీ

తల్లి పాల కొద్దీ 
రొమ్ము గుద్ది
టెట్రా ప్యాక్ 
సొగసులద్ది
సొమ్ముకు
అమ్ముకుంటున్న
బిడ్డలారా
కు.ని. చేయించుకున్న
కళా మతల్లికి
పుట్టిన ముద్దు బిడ్డలారా
గొడ్రాలి కడుపున
పడ్డ కణితులార
బిడ్డని భ్రమ పడుతున్న తల్లి
కడుపులో పెరుగుతున్న
క్యాన్సర్ గడ్డలారా
వెండి తెరపై వాలిన గద్దలారా
చాలించండి మీ కపట నాటకాలు
(సినిమా ఒక కళ .. మతల్లీ అంతే శ్రేష్టమైనదని అర్థం. కళా మతల్లీ అంటే కళలో శ్రేష్టమైనది. అంతే కానీ సినీ పరిశ్రమ ఒక తల్లీ కాదు .. ఈ బాబులు.. వాల్లబ్బలు ఈ తల్లికి పుట్టిన పిల్లలూ కారు. ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్ లో ప్రగల్భాలు, మోసకారి మాటలు, నక్క సిగ్గు పడే నటనలు, వినలేక/.. అన్నింటికంటే చెత్త సినిమాలు చూడలేక.. )
(శ్రీచమన్)
.... 9490638222

............. బిడ్డ "సెల్"లో ఉన్నాడు ...............


కనిపెంచిన అమ్మైనా
కన్న తండ్రైనా 
మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ 
ఓన్లీ వాట్సాప్
ఫీలింగ్స్ అయినా
షేరింగ్స్ కానీ
చావైనా పుట్టుకైనా
ఓన్లీ టైమ్ లైన్
మా ఇంటి మహా రాజు
మాయమయ్యాడు
వంట గది రారాజు
ఆ దిక్కే మరిచాడు
నా కోసం ఏం వండావమ్మా
అని అడగడమే మానేశాడు
పిజ్జా హట్ లో స్పూన్ ముద్దలు
కే ఎఫ్ సీ లో ఫోర్క్ తో కుస్తీలు
అమ్మ అని పిలిపించుకుని
ఎన్ని రోజులైంది
టచ్ స్క్రీన్ చేతికిచ్చి
మాతృ స్పర్శకు దూరమయ్యాడు
బాబూ ...మాటాడు ...
మాటలు ఖర్చు అయిపోతున్నాయి
మొబైలులో బాలెన్సు లేదమ్మా
ఫ్రీ టాక్ టైమ్ ఎప్పుడొస్తుందో
.
బిడ్డ సెల్ లో ఉన్నాడు
బెయిల్ రాని జైలులో
జీవిత ఖైదీ
క్షమాభిక్ష ఎప్పుడో
చార్జింగ్ తోనే నాలుకకు సిగ్నల్
మెమరీ కార్డుంటే అమ్మ వాల్ పేపర్
అప్పుడప్పుడూ స్క్రీన్ పై
వచ్చి పోతుంది
ఇప్పుడు మాట చాలా విలువైనది
కొనుక్కున్న మాటలు
అమ్ముకోవడానికే
ప్రీ పెయిడ్ గానో.. పోస్ట్ పెయిడ్ తోనో
మానవ సంబంధాలకు
సెకన్ల బిల్లింగ్ ..నిమిషాల ఆఫర్
నైట్ బేలన్స్.. అన్ లిమిటెడ్ టాక్ టైం
లైఫ్ టైం వ్యాలిడిటీ ...
మనసుకు మాటలు రావు
మనిషితో మాటాడాలంటే
ఏదో ఒక నెట్ వర్క్ లో ఉండాలి
ఏ ప్యాకేజీలో ఉన్నావో చెప్పాలి
ఒక్కోసారి లైన్లన్నీ బిజీ..
మరోసారి కాల్ వెయిటింగ్
స్విచాఫ్ ..లేదా ఔటాఫ్ కవరేజీ
మీరు డయల్ చేసిన నంబర్ ఒక సారి సరి చూసుకోండి
శ్రీచమన్ .. 30-12-2014 (9490638222)

Wednesday, December 10, 2014

సినిమా సూపిత్త ..

నవ్వుల వెనుక 
నిశీధిలో విషాదం
లైట్స్ ఆన్
అందం లోపలి పొరల్లో
ఎన్ని ముడతలు
స్టార్ట్ యాక్షన్
వాగులు వంకలను
కలిపే కన్నీటి చారిక
అందుబాటులో గ్లిజరిన్
కళ్ల కింద నీటి సంచుల్లో
ఉప్పునీటి సంద్రం
ఈ దాహం తీరనిది
వెండితెరపై వెలుగులు
వన్నె తగ్గని అందాలు
ప్రతిసృష్టికర్త మేకప్ మెన్
కురుల మెరుపులు
వాలు జడ వయ్యారం
సిగ్గు వదిలిన విగ్గు
ఎద సిరుల విరుపులు
అరవైలో ఇరవై
సిలికాన్ సిత్ర్రాలు
పెదాల పదాలు
పాదాల నృత్యాలు
కృష్ణానగర్ ప్రొడక్షన్స్
ఎడతెగని పోరాటం
రెమ్యూనరేషన్ కోసం
స్టంట్ మాస్టర్ ఆరాటం
సకల కళల ఆకారులు
ఏదో ఒక యూనియన్
సభ్యత్వం
మేకప్ లేకపోతే ప్రేక్షకులతోపాటు
కుటుంబసభ్యులూ కూడా
గుర్తు పట్టలేకపోతున్నారు
పచరంగుల సాంఘిక
చిత్రంలో విశ్రాంతి లేదు
శుభం కార్డు.. బోర్డు తిరగబడింది
..........శ్రీచమన్ ....... 09. 12. 14