Sunday, January 29, 2012

ఆ(వి)గ్రహావేశాలు ..

నిలువెత్తు విగ్రహాలు
ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు
ఎవరిపైన ఈ కోపం
రాతి బొమ్మలేమి చేసాయి పాపం

బాపు భారత జాతి మదిలో
పదిలం నీ రూపు
నవ భారత రాజ్యాంగ నిర్మాత
జన హృదయ విజేత

ప్రతి మదిలో కొలువైన
మహాత్ములకేల ప్రతిమలు
ఆశతో మీ విగ్రహాల ఏర్పాటు
అతిరధులకు గ్రహపాటు

ఆకలి ఉంది
దాహం ఉంది
అనారోగ్యం ఉంది
అసమానతలు ఉన్నాయ్

అడగని వారికి విగ్రహాలెందుకు
అడిగేవారిపై ఆగ్రహమెందుకు
బొమ్మకు ప్రాణం ఎందుకు
సాయం అందించి సాటి మనిషితో సాగు ముందుకు

గాంధీని స్మరించు
సత్యం ధర్మం వెలిగించు
బాబా సాహెబ్ మాట
భావి భారత బాట

మహాత్ముల ఆశయాలే
నిలువెత్తు విగ్రహాలు
వారి త్యాగనిరతే
జన జాగృతి

రోడ్లకు అడ్డంగా
నిరాదరణకు నిదర్శనంగా
ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు
మహానుభావుల ఆశయాలకు తూట్లు


ఆకతాయి రాయితో
తాగుబోతు చేతులతో
ద్వంశం చేయలేడు
నా హృదయంలో విగ్రహాన్ని

అభిమానులూ
కుల సంఘాల సారదులూ
దీన జనోద్దారకులూ
మీకు విగ్రహాలు చేస్తున్న చిన్న విన్నపం

మీ కులం నిరుపేదకు చదువు చెప్పించండి
మీ మతం నిరాశ్రయుడికి నీడనివ్వండి
మీ ప్రాంతం వాడి కేకలు విని ఆకలి తీర్చండి
ఎవరికీ ఏమీ కాని రోగికి ప్రాణ భిక్ష పెట్టండి

-------ఇట్లు
విగ్రహాలు

Tuesday, January 24, 2012

ఒక సెలవ్ ..

ఒక విరామం
మరొక విశ్రాంతి
హాయిగా నిదుర పోతున్న కల
ఒంటరితనం ఉప్పొంగుతోంది

అలలు నావలై
సంద్రాన్ని ఈడుతున్నై
ఆటు పోట్లతో
తీరానికి తీరని వేదన

అందమైన శూన్యం
కోరికలేవీ లేనితనం
మాటలు రాని మౌనం
స్పందనలేని హృదయం


మరిచిపోయిన జ్ఞాపకంలా
విఫల ప్రేమలా
తిరిగి రాని యవ్వనంలా
శూన్యమైన ఖాళీలో ఒక సెలవ్....