Saturday, February 6, 2016

టాప్‌గేర్‌లో కారు


కారు నీకు ఎదురొచ్చినా...నువ్వు కారుకు ఎదురెళ్లినా యాక్సిడెంటైపోవ‌డం ఖాయం.
గులాబీ రెప‌రెప‌ల‌కు మినిమ‌మ్ మ‌రో ప‌దేళ్ల‌పాటు తిరుగులేద‌ని తేలిపోయింది. హోరుగాలికి ఎదురెళ్లినా ఎగిరిపోతారు. జోరు మీదున్న కారుకు అడ్డంప‌డినా యాక్సిడెంటైపోతారు. పోవ‌డం ఖాయ‌మ‌నుకున్న‌ప్పుడు దారివ్వ‌డ‌మే మేల‌న్న‌ది తెలంగాణ‌లో అన్ని పార్టీలు గుర్తెరిగాయి. కానీ కొద్ది మందికి అంటే ఆర్కేలాంటి వాళ్ల‌కు ఏ మూలో భ్ర‌మ ఉండేది. వ‌రంగ‌ల్ ఎన్నిక‌తో ఆ ముచ్చ‌ట తీర్చేశారు కేసీఆర్ సారు. ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు ముందే చిత్రం ``ది పిక్చ‌ర్ వెరీ క్లియ‌ర్‌``. లోట‌స్‌పాండ్ బాస్ త‌న‌ది హైద‌రాబాద్ తాత్కాలిక చిరునామాయేన‌ని త‌ప్పించుకున్నారు. బాబు జాగ్ర‌త్త‌గా ఒక‌టిరెండు స‌భ‌ల‌కు స‌రిపెట్టి సైడైపోయారు. ప‌వ‌న్ సైలైంట‌య్యారు. ఇది పూర్తిగా ప‌రువు పోకుండా కాపాడ‌గ‌లిగింది. అయితే గెలిచిన ఇద్ద‌రు ముగ్గురు గులాబీ గూటికి చేర‌కుండా కాపాడుకునే శ‌క్తి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ల‌కు ఆ భ‌గ‌వంతుడివ్వాల‌ని ప్రార్థించ‌డం త‌ప్పించి ఏం చేయ‌లేం. ఇక ఎంఐఎం అంటే టీఆర్ ఎస్ మిత్రులేన‌ని గులాబీ ద‌ళ‌ప‌తి ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌క‌టించారు. అంటే పంచాయ‌తీ నుంచి మండ‌లాలు, జిల్లా ప‌రిష‌త్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్‌లు, శాస‌న‌స‌భ వ‌ర‌కూ టీఆర్ ఎస్ చేసింది చ‌ట్టం, పాస్ చేసిందే బిల్లు. ఈ అప్ర‌తిహ‌త జైత్ర‌యాత్ర ఎన్నేళ్లంటే ..మ‌రో ద‌ఫా త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఇంకో ద‌ఫాకు కూడా కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ నేత‌లు ఇలాగే లోపాయికారీగా స‌హ‌క‌రిస్తే ... ఎల‌క్ష‌నాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయం. జ్యోతిబ‌సు రికార్డును కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ క‌లిసి తిర‌గ‌రాసే అవకాశాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. అందుకే ప్ర‌తిప‌క్షంలో మిగిలిన ఒక‌టీ అరా మొరుగుతున్న సింహాలు, పులులు ఇందిరాగాంధీ జూలాజిక‌ల్ పార్క్‌లో ఈ ప‌దిహేనేళ్లు కాలం గ‌డిపితే..అట‌వీశాఖా మంత్రి జోగు రామ‌న్న‌కు చెప్పి కేసీఆర్ సారు..ఒక ముక్క ఎక్కువ చికెన్ వేసే ఏర్పాటు చేయిస్తారు. లేదంటే..సింహాలు, పులుల‌తో బ‌స్తీల్లో స‌ర్క‌స్ ఆడించేస్తారు.

Tuesday, February 2, 2016

ఓట‌ర్లు ఓడిపోబోతున్నారు!


ఇది నిజం. అభ్య‌ర్థులు గెలుస్తారు. ఆ వెంట‌నే ఓట‌ర్లు ఓడిపోతారు. ఇది ప్ర‌తి ఎన్నిక‌ల‌కూ జ‌రిగే తంతే. అయితే జీహెచ్ ఎంసీలో ఓట‌ర్లు..ముఖ్యంగా సీమాంధ్ర ఓట‌ర్లు దారుణంగా ఓడిపోబోతున్నారు. త‌మ‌ను హీనంగా ఘోరంగా చూస్తూ...హాని త‌ల‌పెడుతున్న తెలంగాణ రాష్ర్ట స‌మితి గెల‌వాల‌ని వారు కోరుకుంటున్నారు. కారు దూసుకురావాల‌ని వారు ఆకాంక్షిస్తున్నారు. సైకిల్ ఓటేస్తే వారు కారు లిఫ్ట్ అడిగి పోవ‌డం ఖాయం. క‌మ‌లానికి ఓటేస్తే వాడూ కారు గూటికి చేర‌డం త‌ప్ప‌దు. ఇలాంటి ప‌రిస్థితిలో టీడీపీ, బీజేపీకి ఓటేసి వ‌గ‌చే కంటే.. కారు గెల‌వాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పేముంది?  నేరుగా హాని త‌ల‌పెట్టే కేసీఆర్ కంటే.. మేమున్నామ‌ని న‌మ్మించి ద్రోహం చేసే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు సీమాంధ్రుల పాలిట ఎంత ప్ర‌మాద‌కారులో ఎప్పుడో అర్థ‌మైపోయింది.
ఇద్ద‌రు మిత్రుల కుట్ర
 తాము ఓటేయాల‌ని ఈవీఎం ద‌గ్గ‌ర‌కు వెళితే..ద్రోహం త‌ల‌పెట్టేందుకా అన్న‌ట్టు చూస్తున్న గుర్తుల‌ను మ‌రీ మ‌రీ గుర్తుంచుకున్నారు. అవే సైకిల్‌, క‌మ‌లం.. ఇద్ద‌రూ పొత్తు పొట్టుకున్నారు. ఈ కూట‌మికి ఓటేద్దామ‌ని వెళితే.. ఈ ఇద్ద‌రు గులాబీ గూటికి మిత్రులైపోయారు. మిత్రుల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క పోటీ ఏంటి? దొంగ నా బ‌ట్ట‌లు. టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌తో టై అప్ కాక‌పోతే?  టీడీపీ-బీజేపీ క‌లిసి ఒకే అభ్య‌ర్థిని నిల‌బెడితే క‌ంప‌ల్స‌రీగా గెలిచే ప్ర‌తిచోటా ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్ వెనుక కుట్ర తెలియ‌ని కాదు. ఇక్క‌డ ఓట‌ర్లు గెలిపించాల‌నుకున్నా.. కారును ఓడించాల‌నుకున్నా.. సైకిల్ క‌మ‌లం పెద్ద‌లు కుట్ర ప‌న్ని మ‌రీ ఆ ఓట్ల‌ను చీల్చి కారుకు దారిచ్చే ఏర్పాటు చేశార‌ని అర్థం అవుతోంది. ఒక‌వేళ మొండిగా సీమాంధ్రులు ఇష్టంలేకున్నా సైకిల్ వారినో, క‌మ‌లం వారినో గెలిపించినా వారు చేరేది టీఆర్ ఎస్ భ‌వ‌నేక‌న్న‌ది సీమాంధ్రుల‌కు తెలియ‌నిది కాదు.
   పెద్ద‌లు వ‌దిలి పేద‌ల్ని మింగేస్తావా ద‌ళ‌ప‌తీ?
 అధికారంలోకొస్తే.. వెయ్యి నాగ‌ళ్ల‌తో దున్నుతామ‌న్న రామోజీ ఫిల్మ్‌సిటీకి మ‌రో వెయ్యి ఎక‌రాలిచ్చిన తెలంగాణ ప్ర‌భువా! సీమాంధ్రులు రూపాయి బియ్యం కొని తినే కార్డులెందుకు తీసేశావ్‌? న‌కు అడ్డుగా ఉన్న క‌మ్మ‌లు, రెడ్ల ప‌ని ప‌ట్ట‌కుండా సీమాంధ్ర‌కు చెందిన 26 బీసీ కులాల‌ను ఎందుకు ఓసీలుగా చేశావ్‌?  హిందూపురం ఎమ్మెల్యే బాల‌య్య బంజారాహిల్స్‌లో ఓటుంచావ్‌. అడుక్కుతినే వాళ్లు, కూలి చేసి బ‌తికే వాళ్ల గుర్తింపుకు ఆధార‌మైన ఓట‌ర్ కార్డును ఆధార్ ఆధారంతో తీసి ప‌డేశావ్‌?  సీమాంధ్రుల్లో పేద‌లే నీకు ఎందుకు శ‌త్రువులయ్యారు కేసీఆర్ సారూ. పెద్ద‌లు మిత్రులుగా ఎలా మారిపోయారు గులాబీ ద‌ళ‌పతీ? నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ రిమార్క్ ఉంద‌ని..రెడ్ మార్క్ వేయించి గులాబీ గ్యాంగ్‌.. అదే నాగార్జున‌తో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడుకు సూటేసే ఆట ఆడుతారు. అయ్య‌ప్ప సొసైటీపై ప్రొక్ల‌యిన్ ఎక్కుపెట్టిన కారు వీరులు.. అక్క‌డే ఉన్న ధ‌ర్మాన‌ను వెల‌మ కోటాలో వ‌దిలేస్తారు. నిలువు లోతు పాతేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చి..యాగానికి ఆహ్వానిస్తారు. ఆ ప‌త్రిక నీపై నిప్పులు చెరుగుతుంది? ఓటుకు నోటు కేస‌న్నావు? చ‌ంద్ర‌బాబుకు చిప్ప‌కూడు తినిపిస్తాన‌న్నావు? అమ‌రావ‌తి ఒడ్డున బాబు ఇంటికెళ్లి రొయ్య‌ల‌కూర తినొచ్చావు? ఇవేవీ త‌ప్పుకాదు సారూ! కానీ మా పేద‌ల్ని మింగేయ‌కు సారూ! మేము ఓడించినా నీవు గెలుస్తావు. మేము గెలిపించిన అభ్య‌ర్థులు మీ మ‌నుషులై రాజ్య‌మేలుతారు. సారూ వేరే దేశంలో లేము. మీ ఆస్తుల‌కు న‌ష్టం కలిగించం. ప్ర‌శ్నించ‌లేని తెలంగాణ సాధ‌న కోసం మేమెప్పుడూ అడ్డురాము. ప్ర‌తిప‌క్షంలేని తెలంగాణ‌లో సీమాంధ్ర పేద‌ల‌కు ఇంత చోటివ్వండి సారూ! కారు గుర్తుపై మీరు, మీరు కేటీఆర్ సారూ! ఆ త‌రువాత ఆయ‌న కుమారుడు గారు కూడా కూర్చొనేందుకు మాకెటువంటి అభ్యంత‌రం లేదు.

Saturday, January 23, 2016

క‌విత‌లు-1



ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ప‌చ్చ‌ని చిలుక‌లు
ఎర్ర ముక్కుల‌తో విర్ర‌వీగుతున్నాయి
పావురాలు కూడా
కాళ్ల‌కు క‌త్తులు క‌ట్టుకొంటున్నాయి
పిచ్చుక‌లు సెల్‌ట‌వ‌ర్‌పై
గూళ్లు క‌ట్టుకుంటున్నాయి
కాకులు గుల‌క‌ల‌రాళ్ల జోలికి పోకుండా
ఓ ప్యాకెట్ పొడ‌వాటి స్ర్టాలు కొనుక్కున్నాయి
నెమళ్లు డ్యాన్సు ప్రోగ్రాంల‌కు
అడ్వాన్సులు తీసుకుని డేట్లిస్తున్నాయి
కోయిల‌లు త‌మ రింగ్‌టోన్‌కు
పేటెంట్ హ‌క్కు సంపాదించాయి
కోళ్లు పందేల‌కు ముందే
మ్యాచ్ ఫిక్స్ చేసేస్తున్నాయి
తీతువు పిట్ట‌లు బీమా కంపెనీల‌తో
తెర‌చాటు ఒప్పందం కుదుర్చుకున్నాయి
గుడ్ల‌గూబ‌లు నైట్ డ్యూటీ
చేయ‌లేమంటూ ధ‌ర్నాకు దిగాయి
రాబందులు యాంటీబ‌యాటిక్స్‌పై
ప్ర‌యోగాలు మొద‌లెట్టాయి
గ‌బ్బిలాలు శీర్షాస‌నం వేసేందుకు
డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నాయి
గోరింక‌లు కిస్ ఆఫ్ ల‌వ్‌
ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాయి
కొంగ‌లు దొంగ జ‌పంతో
కాల‌క్షేపం చేస్తున్నాయి
వానాకాలంలో ఎండలు మండుతుంటే
శీతాకాలంలో వాన‌లు కురుస్తుంటే
వేస‌వి ఊస‌ర‌వెల్లిలా మారిపోతే
రెక్క‌లు తెగిన విహంగాల
లెక్క‌లు మారాయి
ఆధునిక కాలంతో క‌లిసి
క‌లివిడిగా సాగేందుకు
అద్దెకు రెక్క‌లు తెచ్చాయి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
అనే పాట‌..మీ కోసం రేడియో మిర్చి నుంచి
ఇది చాలా హాట్ గురూ!
....................................................శ్రీచమన్


అల‌..ఇలా ఎలా?

అలుపులేని అల‌
ఇలా ఎలా
ఎన్ని యుగాలుగా
ఈ తీరంతో పోరాటం?
గెలుపు ఓటముల్లో
అలుపన్న‌ది ఎరుగ‌ని
కెర‌ట‌మా! ఎన్నాళ్లీ
ఒడ్డుకు చేరాల‌నే ఆరాటం?
ప‌డిలేస్తావా!
వ‌డి వ‌డిగా సంద్రం
ఒడిలోకి జారుకుంటావు
ఆద‌ర్శ‌మా? ఆద‌మ‌రుపా?
క్ష‌ణాల్లో ఎన్నిజ్ఞాప‌కాల్ని చెరిపేస్తావు
పాద‌ముద్ర‌ల్ని నిర్దాక్షిణ్యంగా మింగేస్తావు
పిచ్చిక‌గూళ్లను తోసేసే శాడిజం
నీలాల నింగితో దోబూచులాట ఒట్టి నాట‌కం
నింగి నుంచి నేల‌జారి
వాగులు, వంక‌లై, న‌దుల మీదుగా
ప్ర‌వ‌హించే నీటిని నీలో క‌లుపుకుంటావు
నీ దాహం తీర‌నిది
ఎంత‌మందితో ప్రేమించ‌బ‌డ‌తావు
ఎంత‌మందిని మోసం చేస్తావు
బ‌తుకునిస్తావు..బ‌తుకులు చిదిమేస్తావు
అయినా నీపై మోహం తీర‌నిది
అలుపులేని అల‌
ఇలా ఎలా...
....................................................శ్రీచమన్


!!ఒరేయ్ వీవీఐపీ !! శ్రీచ‌మ‌న్
......................................
అంద‌రిలా అమ్మ‌కే పుట్టాడు
ఆహార‌మే తింటున్నాడు
రెండు కాళ్లున్నాయి
రెండు చేతులున్నాయి
మ‌న‌లా రెండు క‌ళ్లే ఉన్నాయి
కానీ వాడు వెరీ ఇంపార్టెంట్ ప‌ర్స‌న్‌

వాడికి అజీర్తి చేస్తుంది
ఆకులో అన్నం పారేస్తాడు
వీడికి ఆక‌లేస్తుంది
ఎంగిలి మెతుకులు తినేస్తాడు

అవ‌కాశం ఉంటే..మ‌తాల‌కు అతీతంగా
దేవుళ్లంద‌రినీ వ‌రుస‌లో నిల్చోపెట్టి
వాడికి సాష్టాంగ ప్ర‌ణామం చేయించేవారు
వాడే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప‌ర్స‌న్‌

ఒరేయ్ వీఐపీ..
నిన్నేరా ఒరేయ్ వీవీఐపీ
భ‌క్తికీ ..భుక్తీకీ నువ్వే ముందు
ఆక్ర‌మ‌ణ‌ల్లో పెద్ద‌పీట‌
అవినీతిలో మేజ‌ర్ వాటా

గుడిలో..బ‌డిలో..
ద‌వాఖానాలో..
వేదిక‌పై ..ముందు
ముందువ‌రుస‌లో
వీఐపీ కామందులూ
రోగాల ముందు
మీరెందుకు కారు వీఐపీలు
విష‌జ్వ‌ర మ‌ర‌ణాల ముందు
కారెందుకు వీవీఐపీలు

విప‌త్తులు వీరిని ఎత్తుకుపోవు
కాల‌నాగులు కాటేయ‌వు
ఏ ప్ర‌మాద‌క‌ర మ‌లుపూ మింగేయ‌దు
చివ‌రికి డెంగీ దోమ‌లు కూడా
ఏం పీక‌లేవు!

అతిసార మా వాడ‌లోనే కానీ..
వీఐపీ కోటాలో మీ మేడ‌కు రాదెందుకు?
మీ వీవీఐపీ పైర‌వీలు
య‌మ‌ధ‌ర్మ‌రాజు వ‌ర‌కూ పోవెందుకు?

వాన కురిసినా..పిడుగు ప‌డినా
న‌ది పొంగినా..సంద్రం ఉప్పొంగినా..
గాలి వీచినా..మంట లేచినా
సామాన్యులే వీవీఐపీ కోటాలో బ‌ల‌వుతారెందుకు?

ఆటో బోల్తా ప‌డినా..లారీ ఢీకొట్టినా
ప్ర‌హ‌రీ కూలినా.. గుడిసె కాలినా
వీఐపీ కోటా డిమాండ్ చేయ‌రెందుకు?

....................శ్రీచ‌మ‌న్‌.....................27.10.15



ఆకుల్నీ ఆవుల్ని తినే జంతువులారా? //శ‌్రీచ‌మ‌న్‌
...................

ఆకుకూర అంటాడు ఒక‌డు
ఆవు కూర అంటాడు మ‌రొక‌డు
బీఫ్ ఫెస్టివ‌ల్ ఒక‌డికి
బీర‌కాయ‌ పండ‌గ మ‌రొక‌రికి
బిర్యానీ కాంబినేష‌న్ ఒక‌రిది
బియ్యం తోడు ఇంకొక‌రికి

మేక‌ల్లా ఆకుల్ని తింటూ
మేక‌వ‌న్నెపులిలా
మ‌నుషుల్ని
నంజుకుతింటాడు

పులికిచ్చిన మాట ప్ర‌కారం
అడ‌వికెళ్లిన ఆవునూ
దారికాచి దారుణంగా చంపేసి
కూర పండ‌గ చేసుకుంటాడు

ఆక‌లి కేక‌లది ఏ భాష‌
ప‌చ్చ‌ని ఆకుల్ని, పాడి ఆవుల్ని
చివ‌రికి పేదోడి ఆక‌లిని
తినే జంతువులారా
మ‌నిషిని ప‌ట్టించుకోరా?

బొబ్బ‌ట్లు భోంచేస్తారు
చీకులు చీకేస్తారు
మీ పండ‌గ..మీ ఇష్టం..
ఆహారం లేక హాహాకారాలు చేస్తున్న ఆక‌లీ!
ఖాళీ క‌డుపుమంట‌తో
నువ్వూ ఓ పండ‌గ చేస్తో!
..........................శ్రీచ‌మ‌న్‌............28.10.15


సార‌ధి

ఊరంటే నాలుగు వీధులు
వెయ్యి గ‌డ‌ప‌లు కాదు
దుస్తులు వేసుకున్న కొంద‌రు మ‌నుషులు
ద‌యా జాలీ ఉన్న కొన్ని మ‌న‌సులు

సార‌ధి అంటే చిన్నీదీ కాదు..పెద్దీదీ లేదు
మాల‌పిల్లీ..సాక‌లీది..కంశాలి దొడ్డీ కానేకాదు
ర‌క్త‌మాంసాల జీవ‌న పోరాటం
గెలుపోట‌ముల జీవ‌నచిత్రం

ర‌చ్చ‌రాయికి సిమ్మెంట్ పూత‌
పెద్దోళ్లు కూర్చోవ‌డ‌మే మానేశారు
రామ మందిరానికి రంగులేశారు
దీపం పెట్టే పిల్ల‌ల జాడ లేదు

కొత్త దేవుళ్లు కొలువ‌య్యాక‌
శివుడికి గాలాడ్డంలేదు
ఇంటికో బోరు..మోటారొచ్చింది
తూర్పునుయ్యిలో చేద‌ల శ‌బ్దం..నిశ్శ‌బ్దం

త‌ల్లి గురించో..చెల్లిపైనో
నీ పెళ్లి ఊసో..ఇంకోడి పెళ్లాం తిర‌కాసో
అరుగుల‌పై అరిగిపోయిన రికార్డులా
ఫ్రీ వైఫైలా గాలిలో చ‌క్క‌ర్లు

ఒక వార‌ధి..ఆవ‌లే సార‌ధి
జీవిత‌మే ఓ బ‌హుమానం
బ‌తుకు మ‌రో భ‌రోసా
`పంచ్‌`రంగుల సాంఘిక మ‌నిషి చిత్రం

గెడ్డ‌వ‌త‌ల జ‌న‌నం..
ఇవ‌త‌ల మ‌ర‌ణం..
మ‌ధ్య‌లో జీవితం
ఖ‌న‌న‌మో..ద‌హ‌న‌మో..
మ‌ట్టిలో మ‌మేకం
ఆస్తుల‌కు వాటాలు..
అస్తిక‌లకు తిలోద‌కాలు

మాన‌వ సంబంధాల లెక్క‌లు
ఊరుకు ప‌డిన బాకీలు
ప్రాంస‌రీ నోటు మీద సంత‌కం
ఐపీ పెట్టేసింది
.........................................శ్రీచ‌మ‌న్‌.................................14.10.15
(మా ఊరు పేరు సార‌ధి....గెడ్డ అంటే వాగు అని అర్థం.. గెడ్డ అవ‌త‌ల ఊరు ఉంటుంది. గెడ్డ ఇవ‌త‌ల శ్మ‌శానం ఉంటుంది )


క‌..నిపించువాడు- వి..నిపించువాడు
.......................................................
ఎక్క‌డో ఓ చోట క‌నిపిస్తాడు
తీక్ష‌ణంగా చూస్తాడు
చూపులో ధిక్కారస్వ‌రం
క‌విలా అనిపిస్తాడు

ప్ర‌పంచం చుట్టూ
ప‌రిభ్ర‌మిస్తాడు
రంగు..రుచి..వాస‌న‌లేని
స్నేహాలు చేస్తాడు

హేళ‌న‌లు ఎదుర‌వుతున్నా
పాల‌కులు ప‌రిహ‌సిస్తున్నా
అక్ష‌రాలు ఆయుధాలుగా
సంచిలో వేసుకుని సంచ‌రిస్తుంటాడు
జ‌న‌జీవ‌న‌స్ర‌వంతి
తంత్రినై మోగుతాడు

వ్య‌వ‌స్థ‌ను భుజాన వేసుకుని
తిరుగుతున్న భేతాళ మాంత్రికుడు
ప్ర‌శ్న‌ల‌కు మౌన‌భంగం క‌ల‌గ‌గానే
క‌లం ప‌ట్టుకుని క‌విత రాసి వినిపిస్తాడు
................. శ్రీచ‌మ‌న్................10.10.2015............................


ప‌ల్లీ..క‌న్నీరు పెడుతోందో!
.................................
మా ఇంటి దేవ‌త
మా వ్య‌వ‌సాయకుల‌దైవం
మా గ‌తం
వేరుశ‌న‌క్కాయ‌లు

దొడ్డిబుట్టిన దూడ‌లు పెద్దరికం ప్ర‌ద‌ర్శించి..
కాడెద్దులుగా మారి నాన్నకు సాయ‌మ‌య్యాయి
ప‌లుకులు ఒక్కొక్క‌టిగా నా చేతిలోంచి చాలులోకి జారి
రేగ‌డిమ‌న్నును దుప్ప‌టి చేసుకుని దూరిపోయేవి

వెండివెన్నెల్లో ప‌రుచుకున్న న‌క్ష‌త్రాల్లా మెరిసిపోతూ
పుట్ట‌గొడుగుల్లా నేల‌మ్మను చీల్చుకుని వ‌చ్చేవి
త‌ల్లి ఒడిలో త‌నువెల్లా దాచుకున్న వేరుశ‌న‌క్కాయ‌లు
ఏరినోళ్ల‌కు కుంచం.. పొల్లాయి కొంచెం పోతేనేమి

పంట పండిందంటే..నిద్ర రాదు..ఆక‌లెయ్య‌దు
అప్పులోళ్లు ఇంటివైపు రారు.
కిరాణా కొట్టోడు బాకీ ఊసే ఎత్త‌డు
పండ‌క్కి పిల్లాజెల్ల‌ని పిల‌వాలంటే జంకే ఉండ‌దు

కాడెద్దులు కాటికెళ్లాయి
నేలపై న‌మ్మ‌కం అమ్మ‌కం
వేరుశ‌న‌గ‌కాయ‌ల అమ్మ ఒడిలో
కొల‌త‌ల రంగురాళ్లు వెలిశాయి
అప్పుడే రైతు చ‌చ్చిపోయాడు
నాన్న జీవ‌చ్ఛ‌వంలా మిగిలాడు

రైల్లో ప‌ల్లీ అని పిలుపు వినిపిస్తే
క‌ళ్ల‌ల్లో ప‌ల్లె క‌నిపిస్తుంది
వేరుశ‌న‌క్కాయ‌ల‌కు చేసిన‌
ద్రోహం పీడ‌క‌ల‌లా వెంటాడుతుంది

మెట్రో సిటీ సూప‌ర్‌మార్కెట్‌లో
ఆర్గానిక్ గ్రౌండ్‌న‌ట్‌..హాల్దీరామ్ పీన‌ట్‌
ప్యాకెట్‌లో వేరుశ‌న‌క్కాయ‌ల ప్ర‌తిరూపం
వెర్రిగా చూసి వెక్కిరిస్తోంది
........................................//శ‌్రీచ‌మ‌న్‌// 17.09.2015



ఉల్లీ తిరిగిచ్చెయ్! లేక‌పోతే లావైపోతావ్

ఉల్లీ..దేశ‌మంతా
విన‌ప‌డుతోంది నీ లొల్లి
కోస్తే క‌న్నీరు..కొంటే క‌న్నీరు
అందుకే ఏడుస్తున్నారు
కుమిలి కుమిలి

త‌ల్లిలా మేలుచేసే ఉల్లి
నీకు ప్ర‌ణ‌మిల్లీ
చాన్నాళ్ల‌కు రాస్తున్నా మ‌ళ్లీ

అరిస్టాటిల్ కంటే
అలెగ్జాండ‌ర్ కంటే
అమితాబ్‌బ‌చ్చ‌న్ కంటే
నువ్వే గ్రేట్ ఉల్లీ

నీ రేటు ఘాటు
నీ పేరే సెప‌రేటు
నీరుల్లి అలియాస్ క‌న్నీరుల్లి

డెబ్బ‌యి రూపాయిలిస్తే దొర‌లా దొరుకుతావు..
ఇర‌వ‌య్యే ఉందంటే ఆధార్ కార్డు అడుగుతావు

మెయిన్‌బ‌జార్‌లో నిగ‌నిగ‌లాడుతూ క‌నిపిస్తావు
రైతుబ‌జారులో కుల్లి చిక్కి శ‌ల్య‌మై ద‌ర్శ‌న‌మిస్తావు

రైతుకు పండేట‌ప్పుడు కిలో రెండ‌వుతావు
కోల్డ్‌స్టోరేజీలో బందీ అయితే అంత‌కు రెండింత‌ల‌వుతావు

ఉల్లీ నాకో నిజం చెప్ప‌వూ!
కొన్నేళ్లుగా నేనిలాగే ఉన్నాను!
నువ్వెలా లావైపోతున్నావు

జ‌నం నుంచి చాలా తీసుకుంటున్నావ్ ఉల్లీ
తిరిగిచ్చెయ్! లేక‌పోతే లావైపోతావ్
..............................శ్రీచమన్ 21.08.15
నిప్పులు చిమ్ముకుంటూ...
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి
నీ క్షిప‌ణులు ఎగిరిపోతే
నిబిడాశ్చ‌ర్యంలో ప్ర‌పంచం
మౌనంగా వేదిక‌పై
నీవు కూలిపోతే
నిస్తేజంగా మేము
క‌ల‌ల‌కు రెక్క‌లు తొడిగి
క్షిప‌ణుల‌కు ప్రాణంపోసి
విజ్ఞాన‌శాస్ర్తం
విధిరాత‌ను తిర‌గ‌రాసి
ఓ సృష్టిక‌ర్తా!
నీ స్ఫూర్తి
భార‌త‌జాతి కీర్తి
నిఖిల‌మై..అఖిల‌మై
నిత్య‌మై వెలుగుతూనే ఉంటుంది.
క‌లాం నీకు స‌లాం
..................................... శ్రీచ‌మ‌న్‌ (28.07.2015)

మీ దినంజెయ్య‌!
..........................
మీ రోజ్జెయ్య‌!
మీ నోటిల మ‌న్నుబొయ్య‌!
మీ దినంజెయ్య‌!
ఇదేం పోయేకాలం
తండ్రి స‌చ్చినా రాలేదు
ఆ దొంగ నా కొడుకు
పేన‌ముండ‌గానే
కాట్లో ఒదిలేండు
మ‌రో ఎద‌వ నా కొడుకు
సిన్న‌ప్పుడు..ముద్దుగున్నావ‌ని
గుండిల‌పై త‌న్నించుకుండ‌ని
ఎదిగి.. ఎదురున్న తండ్రినే
ఎగిరి త‌న్నేసి పోనాడో ఎద‌వ
అడ‌క్కుంటా క‌న్నాడ‌ని
అలుసైపోండ‌
ఆడు మ‌న్ను బుక్కి
నీకు పాలుబువ్వెట్టాడ‌ని కోప్మా?
ఆ ముసిలోడు నిన్నేటి అడ‌గ‌నేదు
స‌చ్చిపోతే త‌ల‌గొర‌య్యి పెట్ట‌మండు
దినం సెయ్య‌మండు
అది మానీసి ఈ దినం సేత్తావురా నీ రోజ్జెయ్య‌!
.....................................శ్రీచ‌మ‌న్...................

ఇండియాటుడే
మ‌న ఇండియాటుడే
ఎవ్రీ డే.. వ‌న్ స్పెష‌ల్ డే
టుడే..ఫాదర్స్ డే
అందుకో నాన్న ..నా డిస్పోజ‌బుల్ విషెస్‌
నాన్నకు నమస్కారం
అమ్మ‌కు అభినంద‌న‌లు
జీవితాన్ని జీతానికి అమ్మేశాం
కన్నోళ్ల‌కు ఇచ్చేందుకు కానుక‌లు ఎలా?
ఆక్వేరియంలో చేప పిల్లల్లా
ఇంటి గేటుకు కట్టేసిన కుక్కలా
కుంచించుకుపోయిన ప్రపంచం
జీవితంలాగే నిస్సారం
హాస్టల్లో చదివిన బుద్ధీ జ్ఞానం
కన్నోళ్ల‌కు వృద్ధాశ్రమం
ఏడాదిలో రోజులన్నీ అమ్ముడుపోయాయి
ఒక ప్రేమ పూర్వక పలకరింపూ నా దగ్గర లేదు
రెప్పలు మూసి గుండెను తెరిచి
నిద్ర నటిస్తూన్న కాలంలో
తీరే కోరికలు.. నెరవేర్చాలనుకున్న ఆశయాలకు
కలలోనూ చోటు దక్కలేదు ..
...........శ్రీచ‌మ‌న్...................


లాగౌట్ అయి ``పోతావు``
..........................
జీ మెయిల్‌, ఫేస్‌బుక్
ట్విట్ట‌ర్‌, వాట్సాప్‌
బ్లాగు, సైట్ ఏదైనా
ప్ర‌వేశానికి పాస్‌వ‌ర్డ్ మ‌స్ట్‌
డెబిట్‌, క్రెడిట్ కార్డులు
బ్యాంకు, గ్యాస్ అకౌంట్లు
ఆన్‌లైన్ బుకింగ్‌లు
అండ‌ర్ పాస్‌వ‌ర్డ్ కంట్రోల్
పుట్ట‌డానికి ..పెర‌గ‌డానికి
బ‌త‌క‌డానికి..చావ‌డానికి
స‌ర్వేజ‌నా సుఖినోభ‌వంతు
కాన్సెప్ట్ తో ఓ ఆధార్ నెంబ‌ర్
వివాహ‌మైనా
విడాకులైనా
విర‌హ‌మైనా
అంతా ఆన్‌లైన్లోనే
ఓటేసేందుకు ఓ కార్డు
నోటు తెచ్చేందుకు మ‌రో కార్డు
పాన్‌కార్డు.. ఐడీ కార్డు
నీ రికార్డుల‌న్నీ కార్డుల్లోనే..
ఇక్క‌డ ఏం పీకుతావో
కాలానిక‌నుగుణంగా కార్డు
గీకుతావో..గోకుతావో
స్ర్కాచ్ చేస్తావో..సీవీవీ త‌ప్ప‌నిస‌రి
లైఫ్‌కి లాగిన్ అవ్వాలంటే
పాస్‌వ‌ర్డ్ మ‌స్ట్‌
పాస్‌వ‌ర్డ్ మ‌రిచిపోయావో
లాగౌట్ అయి ``పోతావు``
..................................................శ్రీచ‌మ‌న్  19-06-2015


తూరుపు
...............................
తూరుపు
ఉదయం కోసమే..
ఎరుపు ఉద్యమంలా..

కొండోలని అంటాడు ఒకడు
కూలోలని పిలుచుకుంటాడు ఇంకొకడు
సికాకులమని ఏలాకోలం సేస్తాడో నటుడు

అమ్మని వదులుకుని
మాయ మాటల్ని నమ్ముకుని
సినీ మాయలోళ్ల‌కు అమ్ముకుని ..
రంకు, బొంకు నేర్చిన ర‌చ‌యిత వాడు.

బుర్ర తక్కువోలని రాసాడు
ఎర్రిబాగులోలని కూశాడు
అక్షరాలను అమ్ముకున్న విటుడు

విప్లవమై పాట పుట్టింది ఇక్కడ
అన్యాయంపై పిడికిలి ఎత్తింది ఇక్కడ
నేల నాదంటూ చైతన్యం గజ్జె కట్టింది ఇక్కడ

అది తూరుపు..
నీకు ఉదయమైనా
జ్ఞానోదయమైనా
అక్కడనుంచే కావాలి
......................................శ్రీచ‌మ‌న్


............. బిడ్డ "సెల్"లో ఉన్నాడు ...............
కనిపెంచిన అమ్మైనా
కన్న తండ్రైనా
మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్
ఓన్లీ వాట్సాప్

ఫీలింగ్స్ అయినా
షేరింగ్స్ కానీ
చావైనా పుట్టుకైనా
ఓన్లీ టైమ్ లైన్

మా ఇంటి మహా రాజు
మాయమయ్యాడు
వంట గది రారాజు
ఆ దిక్కే మరిచాడు

నా కోసం ఏం వండావమ్మా
అని అడగడమే మానేశాడు
పిజ్జా హట్ లో స్పూన్ ముద్దలు
కే ఎఫ్ సీ లో ఫోర్క్ తో కుస్తీలు

అమ్మ అని పిలిపించుకుని
ఎన్ని రోజులైంది
టచ్ స్క్రీన్ చేతికిచ్చి
మాతృ స్పర్శకు దూరమయ్యాడు

బాబూ ...మాటాడు ...
మాటలు ఖర్చు అయిపోతున్నాయి
మొబైలులో బాలెన్సు లేదమ్మా
ఫ్రీ టాక్ టైమ్ ఎప్పుడొస్తుందో
.
బిడ్డ సెల్ లో ఉన్నాడు
బెయిల్ రాని జైలులో
జీవిత ఖైదీ
క్షమాభిక్ష ఎప్పుడో

చార్జింగ్ తోనే నాలుకకు సిగ్నల్
మెమరీ కార్డుంటే అమ్మ వాల్ పేపర్
అప్పుడప్పుడూ స్క్రీన్ పై
వచ్చి పోతుంది

ఇప్పుడు మాట చాలా విలువైనది
కొనుక్కున్న మాటలు
అమ్ముకోవడానికే
ప్రీ పెయిడ్ గానో.. పోస్ట్ పెయిడ్ తోనో

మానవ సంబంధాలకు
సెకన్ల బిల్లింగ్ ..నిమిషాల ఆఫర్
నైట్ బేలన్స్.. అన్ లిమిటెడ్ టాక్ టైం
లైఫ్ టైం వ్యాలిడిటీ ...

మనసుకు మాటలు రావు
మనిషితో మాటాడాలంటే
ఏదో ఒక నెట్ వర్క్ లో ఉండాలి
ఏ ప్యాకేజీలో ఉన్నావో చెప్పాలి

ఒక్కోసారి లైన్లన్నీ బిజీ..
మరోసారి కాల్ వెయిటింగ్
స్విచాఫ్ ..లేదా ఔటాఫ్ కవరేజీ
మీరు డయల్ చేసిన నంబర్ ఒక సారి సరి చూసుకోండి
శ్రీచమన్ .. 30-12-2014 (9490638222)


డిల్లీ నడివీధిలో స్వచ్చ భారత్

తెలుగు రాష్ట్రాల పై కాంగ్రెస్ చేసిన "హస్త"ప్రయోగం
విఫలమై పార్టీ మొత్తం "హస్త"వ్యస్తపోయింది
రాహుల్ స్కలిత బ్రహ్మచర్యం నిర్వీర్యమైపోయింది

నాటకాలకు తెర తీసిన
నోటి దూల నారాయణ .. అయన పార్టీ
పరిస్థితి సుత్తీ కొడవలి రెంటికీ చెడింది

పెద్దల్లా మాట్లాడి
గద్దెనెక్కి గెద్దల్లా మారిన
కాషాయ కసాయి మూకలు
దేశాన్నే తన గుప్పిట్లో పెట్టుకునేందుకు
కార్చింది మొసలి కన్నీరే అని తేలింది

నమ్మిన తెలుగోడిని
నట్టేట ముంచిన వాడికి
డిల్లీ నడివీధిలో
స్వచ్చ భారత్

ఎక్కడున్నా చెత్త చెత్తే
మోడీ పిలుపందుకున్న
కేజ్రీవాల్ ఎత్తి పారేశాడు
దిల్లీ నుంచి మొదలైన
స్వచ్చ భారత్ గల్లీ వరకూ సాగాలి

జై చీపురు .జై జై చీపురు
శ్రీచమన్ ..  (9490638222)