Saturday, July 12, 2014

కుక్కకూ ఓ లెక్కుంది


 తిక్కకు లెక్క సినిమాల్లో విన్నాం. కుక్కకు లెక్క మాత్రం నేను కళ్ళారా చూశాను. దాని లెక్కకు పక్కటెముకలు లెక్కకు మిక్కిలిగా విరిగి పోవాల్సింది.. జస్ట్ మిస్. అంతా  డాగ్ దయ. ఓ బహుళ అంతస్తుల భవనానికి కాపలాగా వీరబొబ్బిలి ఠీవితో ఓ శునకం ఉంది. తనకు యజమాని అప్పగించిన భాద్యతలను ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిలా భయభక్తులతో నిర్వహిస్తోంది అది. బాగా బలిసినోల్ల సీమ కుక్క.. ఊర కుక్కతో జత కట్టిన ఓ బలహీన క్షణంలో జన్మించిన ఆనవాలు.. రంగులోనూ, ఆహార్యంలోను అక్కడక్కడా కనిపిస్తున్నాయా కుక్కలో..అపార్ట్మెంట్ సెల్లార్ కేంద్రంగా కుక్కగారు తన విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు.  ప్రతి రోజు అదే దారిలో నేను అద్దెకుండే గృహానికి రాకపోకలు సాగిస్తూ ఉన్నాను. తెలిసిగానీ, తెలియకగానీ నేను ఏనాడూ ఆ  కుక్కగారిని ఒక మాట అనలేదు. శునక విశ్వాసాన్ని శంకించనూ లేదు. ఎవెరీ డాగ్ హేజ్ ఇట్స్ ఓన్ డే .. దట్స్ డే .. అదే రోజు ద్విచక్ర వాహనంపై ఇంటి వైపు దూసుకుపోతున్న నా పైకి వేట కుక్కలా దూకింది. తప్పించుకునేందుకు బండిని స్పీడ్ గా పోనిచ్చాను. అయినా వెంటాడింది. యాక్సిలేటర్ తిప్పా. అతివేగంతో బండి నా చేజారింది. కాల బైరవుడి లక్ష్యం నెరవేరింది. కింద పడిన నా వైపు విజయోన్మాదంతో చూసి తన  డెన్ కి చేరింది. ఫ్రాక్చర్ తప్పి గుడ్డలు చిరిగి.. బండి పార్టులు విరిగాయి.  
    నా జీవితంలో ఎవ్వరిని ఏమీ చేయలేకపోయాను. చివరికి ఓ కుక్క చేతిలో కూడా.. వంటిపై గాయాలు, కుక్కపై  ప్రతీకారం తీర్చుకోవాలనే ద్యాసతో  నిద్రలేని రాత్రులు గడిపాను. మిత్రులకు  ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకున్నాను. ఓదార్చుతారేమోనని ఎదురు చూశానులా . నా కుక్క గొడవ వారికి సిటీ లైఫ్ లో  ట్రాఫిక్ సమస్యలాగే చికాకు పెట్టి ఉంటుంది. మిత్రులు ఇచ్చిన ఫోన్ నెంబర్తో  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డాగ్ సెల్ కు ఫోన్ చేశాను. మీది వీధి కుక్క సమస్య అయితే 1 నొక్కండి.. ఇంటి కుక్క సమస్య అయితే 2 నొక్కండి. గజ్జి కుక్క ప్రాబ్లెం అయితే 3 నొక్కండి.. అనే అందమైన ఆడగొంతు  ఐవీర్ లో వినిపించిందే వినిపించి ప్రీ పెయిడ్  బాలెన్స్ ఖాళీ  చేసేసింది. రోజులు గడిచిపోతున్నాయి. ఒక బేపిని  (ఉత్తరాంధ్రలో కుక్కని ఇలాగే పిలుస్తారు ) ఏమీ చేయలేకపోయాను. కుంటుతూ వెళుతున్న నన్ను అది వేళాకోళంగా చూస్తోంది. ఎట్టకేలకు డాగ్ స్క్వాడ్ హెడ్ నెంబర్ పట్టా.. జర్నలిస్ట్ మిత్రుడి సిఫారసుతో  ఫోన్ కొట్టా.. అడ్రస్ తీసుకున్నారు. వ్యాన్, వలతో చేరుకున్నారు. బహుళ అంతస్తుల భవనం వాచ్ మెన్ తన తోటి ఉద్యోగిని తీసుకెల్లొద్దని వేడుకున్నాడు . డాగ్ స్క్వాడ్ సిబ్బందితో గొడవ కూడా పడ్డాడు. విధి నిర్వహణే పరమావధిగా భావించే డాగ్ స్క్వాడ్ కుక్కను వలలో బంధించి వ్యాన్లో వేశారు. వీధి చివరకు వెళ్లి వ్యాన్ ను ఓ మూల ఆపి నాకు ఫోన్ చేశారు. '"సార్ .. కుక్కను పట్టేశాం. అపార్ట్ మెంట్ వాళ్ళు చాల గొడవ చేశారు. అయినా మీరు మా పెద్ద సారూ రికమెండేషన్ కదా. అందుకే కుక్కని వదలలేదు". అని చెప్పారు. సార్ చాయ్ పైసలు .. ఇవ్వరూ అని రిక్వెస్ట్ చేశారు. వ్యాన్ పైకెక్కి నన్ను వెంటాడి వేధించిన కుక్క నిస్సహాయంగా వలలో గిలగిల కొట్టుకుంటుంటే చూసి..దెబ్బకు దెబ్బ ఎలా తీసానో చూశావా అంటూ కాలరెగరేశాను. జేబులోంచి 2 వంద నోట్లు తీసి డాగ్ స్క్వాడ్ కి ఇచ్చాను. నేను మొదటి సారి విజయం సాధించాను. నా జర్నలిస్ట్ పరపతిలో నకిలీ వీరబోబ్బిలిని ఎలా పట్టించానో అడిగిన వారికి.. అడగని వారికి చెప్పి విజయ గర్వంతో విర్రవీగాను. 
    మూడు రోజులు గడిచిపోయాయి. అపార్ట్మెంట్ ముందు నుంచీ రోజు వెళుతున్నాను. కుక్కని ఎందుకు పట్టించావని ఎవరైనా అడిగితే.. ప్రెస్ ప్రివిలేజ్ ని దెబ్బ తీసిన ఎవరికైనా ఇదే గతి పట్టిస్తానని చెబుదామనుకున్నాను. ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. పట్టించిన నాకు, దొరికిపోయిన కుక్కకు తప్పించి .. ఈ ప్రపంచం ఈ విషయం పట్టించుకోవడం మానేసింది.  ఎవెరీ డాగ్ హేజ్ ఇట్స్ ఓన్ డే అగైన్. ద గ్రేట్ డాగ్ రిటర్న్స్. అదే కుక్క, అదే అపార్ట్మెంట్ ముందు దర్శనమిచ్చింది. మెడలో ఓ బెల్ట్ కొత్తగా వచ్చింది. అదే దానికిప్పుడు లైసెన్సు. ఇప్పుడు జర్నలిస్ట్ కాదు... ఆడిని పుట్టించిన జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ కూడా దాని బెల్ట్ పీక లేడిప్పుడు. కుక్క లెక్క తెలియక తిక్క లేచింది.  డాగ్ స్క్వాడ్ హెడ్ కి ఫోన్ చేశాను. సార్ .. మీరు మా ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఉన్నారు. పెంపుడు కుక్కను అక్రమంగా తీసుకొచ్చామని మాపై కేసు పెడతామని బెదిరించారు. మీరేమో జర్నలిస్ట్.. కుక్క యజమానేమో హైకోర్టు లాయర్. పట్టుకుంటే ఆయనకు కోపం.. విడిచిపెడితే మీకు రోషం.. అంటూ చిన్నపాటి క్లాస్ పీకాడు. సార్ కుక్కన్నాక అరుస్తాది, కరుస్తాది.. వినీ విన్నట్టు, ఏడిచీ ఏడవనట్టు వేల్లిపోవాలే గానీ ఇలా పట్టించి మమ్మల్ని ఇరుకున పెట్టొద్దని సలహా ఇచ్చాడు. ఈ సారి కుక్క అరిచినా,కరిచినా దాని యజమాని ఎవరో తెలుసుకోవాలని సూచించాడు. కుక్క లెక్క తెలిసింది. అదే వీధిలోంచి రోజూ వెళుతున్నాను. కుక్క గారి విధి నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఆగ్రహానికి గురికాకుండా నా విధి నేను నిర్వర్తిస్తున్నాను.