Monday, April 18, 2011

ప్రేమించని మనసు

గుర్తు లేవు చిననాటి సంగతులు ఒక్కటీ లేదు యవ్వనపు మధురస్మృతి చేజారి పోయింది స్నేహం ఏమైంది ఆ మోహం ప్రేమ ఇంకిన హృదయం ప్రతిరూపాన్ని నిలుపుకోని నయనం నడిచే దారిలో .. నీవు కనిపిస్తావని .. ప్రతి ముఖాన్ని పలకరిస్తాను అపరిచితుడిపై విశ్వాసం నీవు లేవని వసంతుడి ఆహ్వానం తిరస్కరించాను నీవు రావని తెలిసీ వచ్చిన వారిని నేను ప్రశ్నిస్తున్నాను నువ్వులేని ..నవ్వులేని .. మనస్సుకు వయోభారం ప్రేమే ఉంటె .. ప్రేమించే ఉంటె సృష్టి ఎంత అందమైనది.. నేను కూడా.

Saturday, April 16, 2011

తీన్ మా(బో)ర్

పోయే కాలం దాపురించినప్పుడు వచ్చిన ఆలోచనలు ఆందోళన కలిగిస్తాయి. ఆ, ఈ, ఊ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు సవర్ణ దీర్గసంధిగా రూపాంతరం చెందినట్టే .. అడ్డంగా దొబ్బిన పెజల సొమ్ముతో ఏదో చేద్దామని .. ఎర్రి పప్పని డమ్మీగా పెట్టి సినీమా తీస్తే సొమ్ములు పోతాయి. ఇప్పుడు సొమ్ములు పోనాయండీ అనేడిత్తే నిషా తెచ్చి ఇత్తాదేటి? పైత్యం ప్రకోపించిన ప్రేలాపనలుకు ఈలలు, చప్పట్లు ఆశించడం తప్పు కాదా మత్స బాబూ. ఇలాగే ఉండాలనుకునే వాడికి అవే బుద్దులు. రచనలైన, సినీమాలైన.. నీ అంతర్ముఖీన కోరికలు, పశు వాంఛలుతో నింపితే రజనీష్ జీవిత చరిత్ర అవుతుంది కానీ బాలచందర్ మరో చరిత్ర కాదు. ఫక్తు నీలి చిత్రం తీసి .. సెన్సార్ లేకుండా .. బెడ్రూం సీన్లుతో సకుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే.. టికెట్ కొన్నవాడికి మంట ఎక్కదూ. రిలీఫ్ కోసం వెళితే ఎండాకాలంలో వడదెబ్బ కొట్టిన వాడెవ్వడు. ఆవు కథలా .. సినీమాకు కొన్ని సీన్లు ఉన్డును. పాటలు మధ్య మధ్యలో వచ్చును. ఫైట్లు కూడా ఉండవలెను కాబట్టి ఎక్కడో చోట ఉన్డును. తారా ఘనమే కానీ నటన శూన్యం. సంగీతం కర్ణ కతోరం. పాటలు.. విన్న వారిపై వేటులు. మాటలు .. ముళ్ళ బాటలు. ఇటీవల ఒక పెద్దాయన కలిశారు. ఆయన మిత్రుడు ఒక ప్రముఖ కదా రచయిత. ఆయన సినీ కలంగ్రేటం చేద్దామనుకుని చాలా రోజులు నిరీక్షించి ఆ అవకాశాలు లేక నా పాండిత్యం ఇక్కడ సరిపోదని .. అందని అవకాశాలు వృధా అనుకుని మళ్ళీ పాత కధలకు వచ్చేశాడట. తనను కలిసిన మిత్రుడితో నా చదువు అక్కడ పనిచేసేందుకు ఎక్కువైంది మిత్రమా అన్నాడట. బాబులు .. ఇక ఆపండి మీ దెబ్బలు. మీ జీవితాలు తెరకెక్కించి మా జేవితాలతో ఆడుకోవద్దు. ప్లీజ్ బాబులూ.. ఈ బాబుల్ గాళ్ళ దెబ్బలు తట్టుకోలేకున్నం.

Wednesday, April 6, 2011

ఉద్యోగం చేయబడును

ఉపాధి దేశపటం
నిరుద్యోగ సూచికలు
వాంటెడ్ కాలమ్ ఖాళీగానే ఉంది
వాకిన్ ఇంటర్వ్యూలకు నడవలేకపోతున్నారు

దరఖాస్తులో కొన్నింటిని పూరించలేక
వదిలేస్తున్నారు
అర్హతలు మారాయి
టెక్నికల్ క్వాల్ఫికేషన్ తప్పనిసరి

అక్కడే ఉంది టెక్నిక్
ఉద్యోగం చేయడం ఎలా?
ఉన్నతాధికారులతో మెలగడంలో మెళకువలు
సబార్దినేట్స్ సహకారం పొందే విధంబెట్టిదనిన ..
బుక్ ఎగ్జిబిషన్లో పుస్తకాలు
పలువురికి ఉపాధి పధకాలు

ఉద్యోగం అంటే
నెలకోసారి వచ్చే జీతం కాదు
ఉదయం పది గంటలకు
కార్డ్ స్వాప్ చేసి
సాయంత్రం థంబ్ ఇండికేట్లో
సంతకం వచ్చీ వేలిముద్ర వేయడం కాదు

ఇలాగే బతకాలనుకోవడం
ఉద్యోగం ..
నెల బాకీలన్నీ ..ఒక రోజు తీర్చి
మరో నెల కోసం ఎదురు చూడ్డం
ఇలా పన్నెండు నెలలు కళ్ళు కాయలు కాసేలా
నిరీక్షించి ..కుంగి.. కృశించి ..
ఇంక్రిమెంట్ అందుకుందాం ..
అలా కాలానికి తెలియకుండా
కాలంలో కరిగిపో..
జనాభా లెక్కల్లో మనిషిగా
మిగిలిపో ..

ఓ అంతుబట్టని అరుణ కవీ
నీ కధలలో పాత్రనే జీవితం చేసుకున్న రవీ
నేనుగానే వెళ్లి పోతానన్న ..ఇలానే ఉంటానన్న
ఉద్యోగం కోసం వెదుకుతున్న నాకు తెలిసిన
ఆ నలుగురూ...

Monday, April 4, 2011

పండగ నాకేమీ కాదు

విరోధి, వికృతి, ఖర ..
అవసరార్ధం వస్తూ.. పోతూ ఉన్నాయ్
మామిడి చిగురు రాలేదనో
వేప పూత దొరకలేదనో
వగచడానికి ..
పండగ నాకేమౌతుంది ?
ఏడాదికోసారి వస్తుంది ..
వెలిపోతుందన్న బాధ కంటే
వస్తోందన్న ఆశే బాగుంటుంది
రోజూ తింటే నిల్వ పచ్చడి
ఏడాదికోసారి తింటే ఉగాది పచ్చడి
ఆరంభం ఎప్పుడూ సంబరమే
ముగింపూ మరో ప్రారంభాన్ని ఆశించడం
అందు కోసమే ఈ నవ్యోత్సాహం
పండగకు నేనేమీ కాను
ఎదురుచూస్తుంటాను
పలకరిద్దామని ..
ఆహ్వానిద్దామని
ఆతిధ్యం ఇద్దామని ..
పరిచయం లేని ఈ ఆపేక్ష
ప్రతి పండగకు కొత్త బట్టలు కట్టుకుని
ఎదురు చూస్తూనే ఉంది..

Saturday, April 2, 2011

నేను నేనుగా లేను ...

రకరకాల నవ్వులు అలంకరించుకున్నాను
ఎవరిలానో ఉండాలని..
పనిని బట్టి పులుముకున్న నవ్వు ..
సత్యశోధనకు దొరకదు

పుస్తకాలలోని హావభావాలు
ఇతరుల మస్తిస్కాల్లోని ఆలోచనలు
మెదడు పరాన్నజీవి
హృదయం అద్దెకొరకు

నేను లేను
వ్యక్తిత్వ వికాసం ఎలా
విజయానికి చాలా మెట్లు
ఎక్కే వారే అందరూ..


నా ఆనందం అమ్మివేయబడింది
స్వేచ్చ కంచె వేసుకుంది
నవ్వును చెరశాలలో బంధించారు ..
నా ప్రేమకు పెళ్లి చేసేశారు


కన్నీటికి జాలి లేదు
ఏ సందర్భమైనా ఒకటే స్పందన
కాలం యవ్వనాన్ని దోచేసింది
ఆకులు రాలే సన్నివేశాన్ని చూడలేను


అందరూ చెప్పేవారే
వినేవారి కోసమీ నిరీక్షణ
సలహాలు ఉచితం
సహాయం ఖరీదైంది

ఊరినుంచి ..నావారి నుంచి ..
మనసు నుంచి.. మమత నుంచి ..
నేను వలస పోయాను ..
నేను ఎక్కడున్నానో నాకే తెలియనంత దూరంగా ...

శ్రిచమన్.. 9490638222