Wednesday, June 30, 2010

రాయ లేఖ ..

రాయాలని ఉంది ..
రాయలేనని అనిపిస్తోంది
అన్యాయాలను రాసేందుకు అక్షరాలూ కరువు
దురాగతాలను వర్ణించేందుకు మాటలు కరువు

వాదం మింగేస్తుందో
సిద్దాంతం కాటేస్తుందో
వివాదం ముసురుతుందో
రాద్ధాంతం జరుగుతుందో

నా మటుకు జీవితం
నెలకు ఓ సారి వచ్చే జీతం
ఇది నా గతం .. పునరావృతం
ఇదే నా తరతరాల చరితం
...శ్రీచమన్

Thursday, June 24, 2010

రీచార్జి నాలుక

బాబూ ...మాటాడు ...
మొబైలులో బాలెన్సు లేదమ్మా..

ఆ ఇంటి వంట గది రారాజు
ఏ పిజ్జా కార్నర్లో ఇరుక్కున్నాడో

బిడ్డ సెల్ లో ఉన్నాడు
మాటలు ఖర్చు ఐపోతున్నై

చార్జింగ్ ఉంటేనే
నాలుక పని చేస్తోంది

ఇప్పుడు మాట చాలా విలువైనది
ప్రీపైడ్ గానో , పోస్ట్ పైడ్ తోనో , లైఫ్ టైం వ్యాలిడిటీ ...

కొనుక్కున్న మాటలు
అమ్ముకోవడా నికే..

సెకన్ల బిల్లింగ్
నిమిషాల ఆఫర్
నైట్ బాలన్సు
అన్ లిమిటెడ్ టాక్ టైం

మనసుకు మాటలు రావు
మనిషితో మాటాడాలంటే
ఏదో ఓ నెట్వర్క్లో ఉండాలి
ఏ ప్యాకేజీలో ఉన్నావో చెప్పాలి

ఒక్కోసారి లైన్లన్నీ బిజీగా ..
మరోసారి కాల్ వేఇటింగ్
స్విచాఫ్ ..లేదా ఔటాఫ్ కవరేజీ ...

-శ్రీచమన్











Tuesday, June 15, 2010

చావు లేదు

ఛీ.. ఛీ.. చీర్స్ కాదు
వాసన..దుర్వాసన
మృతదేహం వద్ద ఉన్నట్టుంది

అందమైన పలు వరుస
లోపలంతా ఖడ్గమృగం కోరలు
నవ్వు ప్రాణం తీసేలా ఉంది

విశాల నయనాలు
చీకటి ఆవరించిన అద్దాల్లోంచి చూపు
చుట్టూ నల్లని వలయాలు

రెప్పలను కన్నులు నమ్మడము లేదు
కనుల వెనుక ఏవో కుట్రలు దాగినట్లు
నిద్ర నటిస్తూ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నా ...

దయ లేని హృదయం
బరువెక్కింది
కార్పొరేటు చెల్లించి చికిత్సకెల్లింది

నిలువెల్లా మర్మం
దాచిపెట్టుకున్న చర్మం

మందంగా తయారైంది

ఊపిరి ఆగింది
తనను వీడి
తనువూ చాలించింది

చనిపోయాడు... మహానుభావుడు ..
ఎప్పుడు .. అసలెప్పుడు బతికున్నాడని...
రోజూ చచ్చి ..బతికి .. ఈ రోజు గతిన్చారా?









Sunday, June 13, 2010

పోనీ... పోనీ... భో(పా)పాల్...

ఆ శ్వాసలు గాలిలో కలిసిన
ఎన్నేల్లకో ఈ (అ)న్యాయం

ప్రజాస్వామ్యమా వర్ధిల్లు
మరణించీ మూయని కనుపాప సాక్షిగా

విష వాయువు
వారి ప్రాణ వాయువు

పురుగులను చంపలేని మందు
జనాలకు చావు విందు

బానిసత్వం సంకెళ్ళు తెగినా
దొరపై గౌరవం తగ్గలే

భోపాపాల భైరవులను
రక్షించిన కౌరవులూ

పొతే పోనీ భోపాల్ పాపాల్
రానీ రానీ కోపాల్ శాపాల్




Saturday, June 12, 2010

జీవశ్చవాలు


ఎటు చూసినా
జీవశ్చవాలు
మద్యం తాగేందుకే
బతికి ఉన్నాయి

మీకు అన్నం పెట్టేందుకే
మీ జేబుకు కన్నం పెడుతున్నారు
నీ బాగోగులు చూసేందుకే
నిన్ను బ్రష్ట్టు పట్టిస్తున్నారు

చెమట చిందించు
రూపాయి సంపాదించు
సిండికేటు గల్లా పెట్టెకు అందించు
చేరుతావు మృత్యువు అంచు

Tuesday, June 8, 2010

తూరుపు

తూరుపు
ఉదయం కోసమే..
ఎరుపు ఉద్యమంలా..

కొండోలని అంటాడు ఒకడు
కూలోలని పిలుచుకుంటాడు ఇంకొకడు
సికాకులమని ఏలాకోలం సేస్తాడో నటుడు

అమ్మని వదులుకుని
మాయ మాటల్ని నమ్ముకుని
సినీ మాయలోల్లకు అమ్ముకుని ...

బుర్ర తక్కువోలని రాసాడు
ఎర్రిబాగులోలని కూశాడు
అక్షరాలను అమ్ముకున్న విటుడు

విప్లవమై పాట పుట్టింది ఇక్కడ
అన్యాయమంటూ మాట నినదించింది ఇక్కడ
నేల నాదంటూ చైతన్యం గజ్జే కట్టింది ఇక్కడ


అది తూరుపు..
నీకు ఉదయమైనా
జ్ఞానోదయమైనా
అక్కడనుంచే కావాలి
...శ్రీచమన్