Monday, March 28, 2011

కొట్టుకుందాం రా .. తిట్టుకుందాం రా..

కొట్టుకునేందుకు కారణం ఎందుకు .. చేతులు ఉంటె చాలు. తిట్టుకోవడానికి కోపం రావాలా? తిట్లు వస్తే దండకం అందుకోవచ్చు. ఎవరిని ఎవరు కొడుతున్నారు? ఎవరిని ఎవరు ఎందుకు తిడుతున్నారు అనేవి పక్కన పెడితే .. సినిమాలో కామెడీ ట్రాక్ ఎలాగో అసెంబ్లీ సమావేశాల్లో ఈ తన్నుడు.. తిట్టుడు .. సన్ని..వేషాలూ అంతే. ఒకరు మీరు దొంగలు.. కబ్జాకోరులు.. అని అరుస్తుంటే.. ఎదుటి వాళ్ళు మీరుకాదా అని ప్రశ్నిస్తారే తప్పా మేము ......, ....., కాదు అని ఖండింరు. ఒకరి హయాంలో హత్య జరిగితే ..మీ హయాంలో ఎన్ని జరిగాయి అవన్నీ మేము బయట పెడితే .. అంటారే తప్పా.. తమ వాళ్లీ హత్యకు కారణం కాదని అనరు. నిజం నర్మ గర్భంగా ఒప్పుకున్నా జనాలు పట్టించుకోరు. చట్టం తన పని తానూ చేసుకుపోదు. ఇలా ఒకరికొకరు సాయపడుతూ .. తిట్టుకున్నట్టు ...కొట్టుకున్నట్టు .. కనిపిస్తారు గానీ శాసన సభ సాక్షిగా అందరూ ఒకటే. కాకరాపల్లిలో ముగ్గురిని కాల్చేయడం అమానుషం ఆంటే... బషీర్బాగ్ కాల్పుల సంగతి ఏంటంటారు. ప్రస్తుత ప్రభుత్వం ఆంటే గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందిని ఎన్కౌంటర్ చేయాలి, ఎక్కువ మంది జనాలను పిట్టల్లా కాల్చాలి . భూమ్ ఉండగానే భూములు పందేరం చేయాలి. ఇవన్నీ పాలకులు ప్రాధమిక లక్షణాలుగా అలవరుచుకున్నారు. అసలు ఎవరివీ భూములు? ఎలా చేతులు మారాయి? సోంపేట, కాకరాపల్లివాసులవి భూములు కావా? ప్రాణాలు కావా? దేశంలో ఏ ఒక్క నాయకుడి భూమీ సెజ్ కు ఇవ్వలేదు. ఫ్యాక్టరీలను తమ భూముల్లో ఎందుకు ఏర్పాటు చేసుకోరు? ఆక్రమనలంటూ పేదల గుడిసేలే కూల్చడం చూసాం. ఒక పెద్ద భవంతి ఒక్కటైనా కూలిందా? ఇవేవీ అక్కడ చర్చకూ రావు. ఓటు .. తీట.. ఒకటే. తీర్చుకుంటే గానీ తెలియదు. ద్రౌపదీ వస్త్రాపహరణం ఇప్పుడు చూసి ఎవరైనా బాధపడతారా? మన తెలుగు సిన్మాల్లో అదో ఎదురిచ్చుకోవాలి. మన శాసన సభా రసాభాస పర్వం అటువంటిదే. కొట్టుకున్న వాళ్లకు.. తిట్టుకున్న వాళ్లకు.. ఆ కామెడీ సన్ని..వేషాలను .. మొదట చూపించే వాళ్లకు.. టికెట్ కొని సినిమా ఎలా చూస్తామో.. ఓటు వేసినందుకు మనకు ఉచితంగా అసెంబ్లీ సినిమా.. కొట్టుకుందాం రా.. తిట్టుకుందాం రా.. ఈ వేసవిలో చాలా చల్లగా ఉంటుంది ...

Saturday, March 26, 2011

సంకరవిత్తులు

కళింగాంధ్ర కవితా సంకలనంలో ప్రచురితం

Wednesday, March 23, 2011

ఫోర్జరీ

సిగ్నేచర్
ఎవరు చేసారు ?

జ్ఞాపకాలు ద్రవరూపంలో
ఆల్కహాలంతా పొగచూరింది

కొన్ని గుర్తు చేసుకుంటూ
మరికొన్ని మరిచిపోయే యత్నంలో

పరస్పర వ్యాకరణ దోష సంభాషణలు
ఆత్మస్తుతి, పరనింద

కొమ్ములు వత్తులూ మత్తుగా
పేలుతూ తూలుతున్నై

గుండె మంటలపై
నిప్పులు చల్లుతున్నారు


గాయాల గేయాలాపన
ఘనమైన మంచు ముక్కలు ద్రవించి

మాస్క్ లు తీసి
నిజరూప దర్శనం

లైట్ తోలు కప్పుకున్న
రా ..క్షసులు

కనీ కనిపించని
వినీ వినిపించని లోకంలో

తీరని వేదన
మద్యం..తర రోదన

హామీలు ..ఓదార్పులు..
ధ్రువ పత్రాలు ..

కాలం నిద్ర లేచింది
రాత్రి హామీలపై ఎవరో ఫోర్జరీ చేసారు ..

7799214121

Sunday, March 20, 2011

ఆత్మ ప్రభోధానుసారం

దేవుడు సాచ్చ్చి నేనే తప్పూ సేయలేదు. పిల్లల తోడు నాకేమీ తెల్దు. నన్ను ఎవులూ నమ్మకున్తన్రు. ఆత్మ ఏటి సేప్పుద్ది. ఏది మంచో అదే సేయ్యమంతాది. నానూ అదే సేసినాను. రూపాయీ.. రూపాయీ .. ఏటి సేత్తవంటే అరిచ్చంద్రుడితో అబద్దమాదిస్తానందట. ఆ ఎవ్వారం కాదు నాది. నోటుతో నా ఓటును కొనే దమ్మున్నోడు మళ్ళీ పుట్టాలా. ఎన్ని నోట్లిస్తే వచ్చిందీ ఓటు ? ఒత్తికొట్టిన అమ్మేత్తానా? ఆత్మా ప్రభోధానుసారం ఎవరి మనోభావాలు గాయపడకుండా ఏసాను. ఎవురేమనుకున్న .. ఏటి సేత్తమన్నా మాటిత్తే తప్పే వంశం కాదు నాది. అటేడు తరాల నుంచీ ఇటేడు తరాల వరకూ ఆత్మప్రభోదానుసారమే నడుస్తున్న వంశం. ఓటును కొన్నోడుంటే.. ఆడి చోటునే కొన్నోడొకడు. ఓటు ఉండాలే కానీ అది తన పని తాను చేసుకుపోతుంది. ఓటింగ్ అంటే ఇదీ. క్రాస్ చీటింగ్ అన్న.. భలే మంచి ఓటు బేరమన్నా.. పరవా నై . కరంటు ఉండగానే మిక్సీ పట్టాల. కోడి దొరికినప్పుడే బిర్యాని వండాల. ఆత్మ ప్రభోధానుసారం రాజ్యాంగం మీద ఒట్టేసి అంతా విప్ ప్రకారమే చేస్తాను

Tuesday, March 15, 2011

నిజంగా చెబుతున్న అబద్దం

ఒంటరి సమూహాలు
ఎటు చూసినా శకలాలు
చరిత్రకు శిధిల సాక్ష్యాలు
వాస్తవానికి కట్టిన సమాధులు

ఇప్పుడు నిజం తనని తాను నిరూపించుకోవాలి
అబద్దం ఇంటరాగేషన్కు దొరకదు
చట్టం చట్రంలోంచి పాదరసంలా నేరం
కేసు లాజిక్ ముందు మోకరిల్లింది

నిశ్శబ్దం .. అచేతనం
మాట్లాడలేని ఓ బహుభాషాకోవిదుడు
విరామ చిహ్నాలు ప్రశ్నార్ధకాలై..
జవాబు ఇంకా ఎందుకు?

ఉదయం ప్రసవ వేదన ..సాయంత్రం ప్రసూతి వైరాగ్యం
రాతిరి పీడకలలు ..వేకువన కొత్త ఆశలు
రోజులన్నీ సూర్య చంద్రులవేనా?
గ్రహణం రోజైనా నాకోసం విడవండి ..

శ్రీచమన్ ..9490638222

Friday, March 4, 2011

భౌతికకాయం

అంగ్లేయులనుకుంటున్నావా?
ఆంద్ర కేసరి గుండె చూపితే
గుండు దింపకుండా ఆపేయడానికి...

ఎక్కడున్నావు ? ఏమి చేస్తున్నావు?
ఎటు వైపు వెళుతున్నావు?
అందరూ అంటున్నట్టు నువ్వు వెనకబడే ఉన్నావ్ ..


అడివిలో ఉన్నా చస్తావ్
ఏటీ అన్యాయమని అడిగినా అంతే..

బీలో .. తంపరో ..
మెరకో.. పల్లమో ..
కంచె పడితే కాపలదారుడే యజమాని


అది పవర్ ప్లాంట్
తాకితే తుపాకీలా పేలిపోతావ్
కాకిలా కాలిపోతావ్

ఎంత నీరసంగా ఉన్నాడు
రబ్బరు బుల్లెట్లకు చనిపోయాడు


వోల్టులు ..కిలో వోల్టులు
శక్తి ముందు ..సాము గరిడీలా?

నీది నీకు కాకుండా చేసిన జీవోలు
శాపనార్ధాలతో కాలిపోతాయా?


కూటిలోన... గూటిలోనా ..
బుగ్గి జల్లినోడు
తిడితే పారిపోతాడా? కొడితే ఊరుకుంటాడా?

తామరతంపరగా వూరు సుట్టూ ఫేట్రీలు
ఈదిలో పోలీసోల్ల బూట్లు సప్పుడు
కట్టుకున్నది కన్నీరు పెడుతోంది ..
కన్ను రెప్పార్పకుండా చూస్తోందా భౌతిక కాయం