Wednesday, December 9, 2015

ఎండా.. వాన ..




చినుకు నేలను ముద్దాడింది
మట్టి వాసనేదీ ?

నై.. రుతి పవనం
ఈశాన్యానికి వాస్తు దోషం

వానకు కాలంలేదు
మేఘాలతో చెలిమి లేదు

వ‌నాల్లో జ‌నాలు
న‌గ‌రాల్లో వ‌న్య‌ప్రాణులు
కాకుల దూర‌ని కార‌డ‌విలో
కాలింగ్ బెల్ మోత

ప‌ర్యావ‌ర‌ణానికి పొగ‌
ప్ర‌కృతిపై వికృత‌చేష్ట‌లు
కాలాలకు పోయే కాలం
శీతాకాలంలో వాన‌లు
వానాకాలంలో ఎండ‌లు
ఎండా కాలంలో మంచు
ప‌ర్యావ‌ర‌ణ విధ్వంస చిత్రం
వాతావ‌ర‌ణం విచిత్ర దృశ్యం

అల్ప‌పీడ‌నాల ఆప‌ద‌లు
వాయుగుండాల గండాలు
తుఫాన్ ప్ర‌కంప‌న‌లు
సునామీ హెచ్చ‌రిక‌లు

నిషా, ఖైముఖ్, ఓగ్ని, ఐలా, లైలా ...
ఇప్పుడు చినుకంటే వణుకు

ఫైలిన్ ఘీంకారం
హుధుద్ హుంక‌రింపు
సునామీ ఉప‌ద్రవం
విశాఖ విల్ల‌విల్లాడితే
చెన్నై గుండె చెదిరింది

ఓ వైపు
జ‌ల‌విలయం.. ప్రళ‌యం
కన్నీటి సంద్రం
తాగేందుకే నీరు లేదు

మ‌రోవైపు క‌రువు
ప‌నుల్లేవ్‌..పంట‌ల్లేవ్‌
ఆక‌లి మంట‌లు
క‌న్నీటితో గొంతు త‌డుపుదామంటే
క‌ళ్ల‌లోనూ నీరింకిపోయాయి

తాము మాత్రమే జీవించేందుకు
జీవ‌వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు

త‌న గొయ్యి తానే త‌వ్వుకుంటున్నాడు
మ‌న చితి మ‌న‌మే పేర్చుకుంటున్నాం


.................................................శ్రీచ‌మ‌న్








Thursday, September 17, 2015

ప‌ల్లీ..క‌న్నీరు పెడుతోందో! //శ‌్రీచ‌మ‌న్‌//


..............................
మా ఇంటి దేవ‌త
మా వ్య‌వ‌సాయకుల‌దైవం
మా గ‌తం
వేరుశ‌న‌క్కాయ‌లు

దొడ్డిబుట్టిన దూడ‌లు పెద్దరికం ప్ర‌ద‌ర్శించి..
కాడెద్దులుగా మారి నాన్నకు సాయ‌మ‌య్యాయి
ప‌లుకులు ఒక్కొక్క‌టిగా నా చేతిలోంచి చాలులోకి జారి
రేగ‌డిమ‌న్నును దుప్ప‌టి చేసుకుని దూరిపోయేవి

వెండివెన్నెల్లో ప‌రుచుకున్న న‌క్ష‌త్రాల్లా మెరిసిపోతూ
పుట్ట‌గొడుగుల్లా నేల‌మ్మను చీల్చుకుని వ‌చ్చేవి
త‌ల్లి ఒడిలో త‌నువెల్లా దాచుకున్న వేరుశ‌న‌క్కాయ‌లు
ఏరినోళ్ల‌కు కుంచం.. పొల్లాయి కొంచెం పోతేనేమి

పంట పండిందంటే..నిద్ర రాదు..ఆక‌లెయ్య‌దు
అప్పులోళ్లు ఇంటివైపు రారు.
కిరాణా కొట్టోడు బాకీ ఊసే ఎత్త‌డు
పండ‌క్కి పిల్లాజెల్ల‌ని పిల‌వాలంటే జంకే ఉండ‌దు

కాడెద్దులు కాటికెళ్లాయి
నేలపై న‌మ్మ‌కం అమ్మ‌కం
వేరుశ‌న‌గ‌కాయ‌ల అమ్మ ఒడిలో
కొల‌త‌ల రంగురాళ్లు వెలిశాయి
అప్పుడే రైతు చ‌చ్చిపోయాడు
నాన్న జీవ‌చ్ఛ‌వంలా మిగిలాడు

రైల్లో ప‌ల్లీ అని పిలుపు వినిపిస్తే
క‌ళ్ల‌ల్లో ప‌ల్లె క‌నిపిస్తుంది
వేరుశ‌న‌క్కాయ‌ల‌కు చేసిన‌
ద్రోహం పీడ‌క‌ల‌లా వెంటాడుతుంది

మెట్రో సిటీ సూప‌ర్‌మార్కెట్‌లో
ఆర్గానిక్ గ్రౌండ్‌న‌ట్‌..హాల్దీరామ్ పీన‌ట్‌
ప్యాకెట్‌లో వేరుశ‌న‌క్కాయ‌ల ప్ర‌తిరూపం
వెర్రిగా చూసి వెక్కిరిస్తోంది

Wednesday, February 4, 2015

// నాలుగు కళ్ళు //


ప్రపంచాన్ని చూడడానికి 
రెండు కళ్ళు చాలవు 
విశ్వాన్ని చుట్టి రావడం 
రెండు కాళ్ళకు సాధ్యమా?

దూరదృష్టి లేకపోతే 
దూర తీరాలు చేరలేని గమ్యాలు 
భార హిత జీవితానికి 
ముందు చూపు అత్యవసరం 

నయనం ప్రధానం 
అంతటా ప్రదర్శనా ప్రభావం 
రెండు కళ్ళ నిండా 
బిగ్ బజార్లు..గోల గోల మాల్ లు 

దృష్టి ఉంటే 
సృష్టి ఎంత అందమైనది 
దిష్టి తీయాలి 
ప్రతి సృష్టికి ప్రాణ ప్రతిష్ట చేయాలి 

నా కళ్ళు చెబుతున్నాయి 
నువ్వు మోసం చేసావని
మూడో కంటికి తెలియని 
కుట్రలు యేవో కను రెప్పల మాటున  

కళ్ళ  అద్దమందు కొండ
కొంచమై కనపడదా 
విశ్వదాభి మామ 
ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రేమ 

లయన్స్ క్లబ్ లో నేత్రదానం 
దినపత్రిక జిల్లా పేజీలో ఓ వార్తా చిత్రం 
స్వచ్చంద ఉచిత నేత్ర వైద్య శిబిరం 
కళ్ళకు నల్లమబ్బుల గంతలు

 
సోడా బుడ్డీ కళ్ళద్దాలతో 
బుడిబుడి అడుగులు 
అత్యాశ పొరలు కమ్మేసిన 
అంధత్వ చీకట్లు 

పరీక్ష రాసి పాసై పుట్టిన పసి గుడ్డు
సిలువను మోసుకెళ్ళే ఏసులా 
బ్యాగులు మోసుకెళ్ళే బాలలు 
ర్యాంకుల జీవితంతో పోరాడుతున్న కౌమారులు 
పోటీ పరీక్షల్లో తలపండిన యువకులను 
జీతం కోసం అమ్మేసిన జీవితాలను 
బంధించిన ధృతరాష్ట్ర కౌగిలి 

కంటి పాపల్లో దాగున్నాడు 
కనుగూటి  చీకట్లో తచ్చాడుతున్నాడు
లెన్సుల బూచాడు..ఒంటి కన్ను రాచ్చసుడు 
రెండు రెళ్ళ నాలుగు కళ్ళు  
.............శ్రీచమన్.... తేదీ 04. 02. 2015

Thursday, January 29, 2015

నేను ..

నమస్కారం నేను .. మీ....
అమెరికాలో ఉంటే
ఐ యామ్ యాన్ ఇండియన్
ఇండియాలో ఏపీ వాడిని
కొండ గుర్తులో హైదరాబాదీని ..
భాగ్యనగరంలో మాత్రం శ్రీకా"కులం" వాసిని
జిల్లా కేంద్రానికెళితే రాజాం మా వూరు
సొంతూరిలో ఫలానా నా ఇంటి పేరు
ఇంట్లో ఉంటే .. కొడుకును..
నా గదిలోకి వెళితే ఇద్దరు పిల్ల తండ్రిని..
ప్రపంచం పల్లెటూరులా మారిపోయింది
నా వరకు ఆ గది సమస్త ప్రపంచం
నా అసలైన చిరునామాకు చేరాల్సిన ఉత్తరం
జీవిత కాలం లేటు ..
నా పేరు మనిషి..
ఇది ఎవ్వరికీ ఎవ్వరూ
ఇప్పటివరకూ చెప్పని రహస్యం
చెప్పుకోలేని దౌర్భాగ్యం
అందరూ మనుషులే..
అలా అని ఎవరు చెప్పినా
డీఎన్ఏ పరీక్షించమంటారు

అమ్మకు జే. . జే. .

మదర్స్ డే నాడు అమ్మకు జే జే
ఫాదర్స్ డే నాన్నకు నమస్కారం
జీవితాన్ని జీతానికి అమ్మేసిన జీవులం
కన్నోల్లకు ఇంకేమి కానుకలు ఇవ్వగలం
ఆక్వేరియంలో చేప పిల్లల్లా
ఇంటి గేటుకు కట్టేసిన కుక్కలా
కుంచించుకుపోయిన ప్రపంచం
జీవితంలాగే నిస్సారం
హాస్టల్లో చదివిన బుద్ధీ జ్ఞానం
కన్నోళ్ళను వృద్ధాశ్రమంలో చేర్పించింది
ఏడాదిలో రోజులన్నీ అమ్ముడుపోయాయి
ఒక ప్రేమ పూర్వక పలకరింపూ నా దగ్గర లేదు
రెప్పలు మూసి గుండెను తెరిచి
నిద్ర నటిస్తూన్న కాలంలో
తీరే కోరికలు.. నెరవేర్చలనుకున్న ఆశయాలకు
కలలోనూ చోటు దక్కలేదు ..

Wednesday, January 28, 2015

కొత్త మతానికి పురుడు పోస్తాం

బేటీ బచావో బేటీ పడావో 
సంతాన సాఫల్య కేంద్రం 
ఇక్కడ పుట్టే ఆడపిల్లలు 
వారికి వారే రక్షకులు 

అత్యాచారాలకు బలి కాని 
అమ్మాయిలకు జన్మనిస్తాం 
అఘాయిత్యాలను ఎదుర్కొనే 
ఆడపిల్లల్ని ఉత్పత్తి చేస్తాం 

సురక్షితమైన అద్దె గర్భం 
అందుబాటులో ఉంది 
లింగ వివక్ష చూపని 
కిరాయి తల్లులు మా ప్రత్యేకం 

పిల్లల్ని కాపాడే
కొత్త మతానికి పురుడు పోస్తాం 
పిల్లల్ని ప్రేమించే
 కొత్త కులానికి జన్మనిస్తాం 

సేంద్రియ పద్దతిలోసంతానోత్పత్తి 
ప్రకృతి సిద్ధమైన ప్రసవం 
కలయిక అక్కర్లేని 
కలల పంట 

సరసమైన ధరలకు సరోగసి 
టెన్ పర్సంట్ డిస్కౌంట్లో 
టెస్ట్ ట్యూబ్ బేబీ 
ఆషాడం ఆఫర్ 

శ్రీచమన్ .............. 28. 01. 2015


Tuesday, January 27, 2015

మేక్ ఎ విష్


నగరం మురుగు
నురగలు కక్కుతూ 
నాలాలు పొంగి 
నడిరోడ్డుపై ప్రవహిస్తోంది 

సకల మలినాలు 
అనంత వ్యర్ధాలు 
తమ కుల్లునంతటికీ 
నల్లటి రూపమిచ్చాయి 

స్లిమ్ ఉమ్మేసిన చెత్త 
పోష్ విసిరేసిన యాష్
హైట్స్ నుంచొచ్చిన  డస్ట్ బిన్లు 
స్లమ్ ను ముంచెత్తాయి 


ఓడలు తిరగని మురికివాడలో 
నావే కానరాని వైతరిణీ నదిలో 
ఉందో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల 


హారన్ మోగించే క్రూర జంతువులను  
తప్పించుకుంటూ.. ఒప్పించుకుంటూ 
కంకర అడవుల ముళ్ళ బాటలో 
పాదరక్షలు లేని అక్షర కాంక్ష 


పలకా పుస్తకాలతో 
ప్రతి రోజూ పసిపాపల 
పద్మవ్యూహ ప్రవేశం 
అభిమన్యుడికి ఒకసారే 


కేజీ టు పీజీ ఉచిత విద్య 
ఇక్కడ చదువు"కొనక్క"ర్లేదు 
చదువుకెల్లడమే కష్టం 
చిన్నపిల్లలకు పెద్ద బాల"శిక్ష"

చిట్టి పాదాలు చెప్పుకోలేవు 
చెప్పులు  కొనివ్వండి 
చిరిగి శల్యమైన పుస్తకాలకు 
ఓ సంచి దానమివ్వండి 

తీర్చండి వీరి మేక్ ఎ విష్ 
కొన ప్రాణాలతో ఉన్న 
చదువుల తల్లులకు 
కొత్త వూపిరివ్వండి 

(కృష్ణానగర్ సమీపం ఇందిరానగర్ బస్తీలో ప్రభుత్వ పాఠశాలకు చెప్పులు లేకుండా, పుస్తకాలు ఉంచేందుకు సంచి లేకుండా పొంగుతున్న మురుగు ప్రవాహాన్ని దాటుకుంటూ కిలో మీటర్ దూరం నుంచి వస్తున్న చిట్టితల్లిని చూసి) 

శ్రీచమన్ ............... 27. 01. 2015








Monday, January 12, 2015

నన్ను ప్రేమిస్తావా?

డెబిట్ కార్డ్ 
జీరో బేలన్స్
క్రెడిట్ కార్డ్
బిల్ పెండింగ్
నాన్న సైడ్
నో అసెట్స్
అమ్మ తరపు
అసలు అడగొద్దు
బాడుగ ఇల్లు
రోగాల వల్లు
అరటి ఆకు కొలువు
అప్పులకు నెలవు
చుక్కకో ముక్కకో
పక్కకో కక్కుర్తి పడే
దేవుడిచ్చిన తండ్రి (గాడ్ ఫాదర్)
నను పెంచుకోడు
విమానమంత
విశాల హృదయానికి
టు లెట్ బోర్డ్
పెట్టి చాలా రోజులైంది
తలపుల తలుపు
కాంటాక్ట్ నంబర్ కు
రాంగ్ నంబర్ కాలూ
రావట్లేదు
నా సర్వనామం
పెళ్ళికాని ప్రసాద్
ఒక్క మిస్సుడ్ కాల్ వస్తే
నా మిస్సెస్ చేసుకుంటా
ప్రేమించానని
ఒక్క మాట చెబితే
ఒంటరితనానికి
రాజీనామా చేస్తా
ఏడడుగులు నడుస్తానంటే
ఏడవడం మానేస్తా
మూడు ముళ్ళేయనిస్తే
మూడీ బిరుదు వదులుకుంటా
కనిపించిన వారినల్లా
కలలో కంటూ
స్వప్న స్ఖలనాలపై
నిదిరిస్తున్న
స్ఖలిత బ్రహ్మచారిని
కరుణించే దేవత కోసమీ ప్రార్ధన
.............. శ్రీచమన్ .................. (11. 01. 2015)

నా మరణానికి ఎవరూ కారణం కాదు ..

నిండు చూలాల్లు 
నిండుగా ఉన్న
ధర్మాసుపత్రిలా ఉంది
జనరల్ బోగీ
కష్టాలను మూటగట్టి
నెత్తికెత్తుకుని సామాన్యుడిలా
దూర ప్రాంతాలకు
భారంగా కదిలిన బస్సు
విరామమెరుగని
విశాలమైన నగరదారులన్నీ
పల్లె ఇరుకు సందులకు
పరుగులు పెడుతున్నాయి
పొమ్మన్న పల్లెలో
సంకురాతిరి సంబరానికి
పిలవని పేరంటాళ్ళు
ఈ వలస పక్షులు
డబ్బుకు.. జబ్బుకు
పల్లె పట్టణమన్న తేడాల్లేవ్
అంటు కట్టిన పార్దీనియం మొక్కలు
అంటువ్యాధిలా విస్తరించాయి
ఇక్కడ క్లబ్బులు పబ్బులు
అక్కడ కోడి పందాలు
పొట్టేళ్ల పోటీలు
బెల్ట్ తీసిన షాపులు
రక్తాన్ని చెమట చేసి
కష్టాన్ని కాసులుగా మార్చి
పల్లెకొచ్చిన బాటసారి
జేబుకు చిల్లు పెట్టిన నల్ల దొరలు
తాటి తోపులో మొలిచిన
రియల్ కొలత రాళ్ళు
తొక్కుడు బిల్లాట పిల్లల కాళ్ళకు
చేసిన మానని గాయం
పళ్ళు లేని ఊక జోరులో
గుంట నక్కలు
వూరిలో మనుషుల్ని
పీక్కు తినే ఊర కుక్కలు
పంటల్లేని పల్లెలో
ఆకలి మంటల్లా
భోగి మంటలు
టైర్ కాలిన వాసన
పండగ పూట అందరూ
ఆటకెళ్ళే పెద్ద తోట
చెట్టు మోడై భూమి బీడై
చిన్నబోయింది
మద్యం మత్తులో
వావివరసలు మరిచిన
కనుమ కలహాలు
కంపరం పుట్టిస్తున్నాయి
చెరిగిపోతున్నఅద్భుత చిత్రాన్ని
తిరిగి చిత్రించేందుకు
నేను బ్రమ్మనూ కాను
ఆయన చేసిన బొమ్మను
అందుకే కూలిపోయిన
నా పూరిల్లు సాక్షిగా
బ్రాందీ సీసాలో దూరి
ఆత్మహత్య చేసుకుంటున్నాను ..
.............. శ్రీచమన్ .............. (12. 01. 2015)

Thursday, January 1, 2015

కళా మతల్లీ


తల్లి పాల కొద్దీ 
రొమ్ము గుద్ది 
టెట్రా ప్యాక్ 
సొగసులద్ది 
సొమ్ముకు 
అమ్ముకుంటున్న 
బిడ్డలారా 

కు.ని.  చేయించుకున్న
 కళా మతల్లికి 
పుట్టిన ముద్దు బిడ్డలారా 

గొడ్రాలి కడుపున
పడ్డ కణితులార 

బిడ్డని భ్రమ  పడుతున్న తల్లి 
కడుపులో పెరుగుతున్న 
క్యాన్సర్ గడ్డలారా 
వెండి తెరపై వాలిన గద్దలారా 
చాలించండి మీ కపట నాటకాలు 

(శ్రీచమన్)
.... 9490638222

(సినిమా ఒక కళ .. మతల్లీ అంతే శ్రేష్టమైనదని అర్థం. కళా మతల్లీ అంటే కళలో శ్రేష్టమైనది. అంతే కానీ సినీ పరిశ్రమ ఒక తల్లీ కాదు .. ఈ బాబులు..  వాల్లబ్బలు ఈ తల్లికి పుట్టిన పిల్లలూ కారు. ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్ లో ప్రగల్భాలు, మోసకారి మాటలు, నక్క సిగ్గు పడే నటనలు, వినలేక/.. అన్నింటికంటే చెత్త సినిమాలు చూడలేక.. )

ప్రపంచీకరణకు పుట్టిన ప్రజాకవీ


తాగేది జానీ వాకర్ 
పాడేది కల్లు పాట
చెప్పేవి మార్కిస్ట్ కబుర్లు
దూరేవి పెట్టుబడిదార్ల బంగళాలు
చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్
మాట్లాడేది సేంద్రియ వ్యవసాయం
తొంగునేటప్పుడు ఏసీ
లేచేటప్పుడు గోచీ
వేదికలపై పల్లె పలవరింత
కలలో పట్నవాసం కలవరింత
స్టార్ హోటల్లో
దిగిన ప్రజా కవీ
నీకు రేపే సన్మానం
...శ్రీచమన్.......

ఒకటి కొంటే ..

కరిగిపోయిన కాలం
గడియారం ముళ్లు
బాధ్యతల ఒబేసిటీ
హృదయానికి భారం
అపజయం
వెన్నతో పెట్టిన విద్య
గెలుపు చివరి మజిలీ
బరిలో మిగిలేది ఓటమే

మధ్య తరగతి
త్రిశంకుస్వర్గం
అద్దె రెక్కలతో ఎగిరిపోతే
ఎంత బాగుంటుంది
వన్ ఆర్ నన్
కోరికలు గుర్రాలు
ఓజోమేన్.. ఒకటి కొంటే
మరొకటి ఉచితం
హెయిర్ కు డై
కోటుకు టై
లోదుస్తులకు
తనిఖీల నుంచి మినహాయింపు
................. శ్రీచమన్ (30-08-2014)