Wednesday, February 4, 2015

// నాలుగు కళ్ళు //


ప్రపంచాన్ని చూడడానికి 
రెండు కళ్ళు చాలవు 
విశ్వాన్ని చుట్టి రావడం 
రెండు కాళ్ళకు సాధ్యమా?

దూరదృష్టి లేకపోతే 
దూర తీరాలు చేరలేని గమ్యాలు 
భార హిత జీవితానికి 
ముందు చూపు అత్యవసరం 

నయనం ప్రధానం 
అంతటా ప్రదర్శనా ప్రభావం 
రెండు కళ్ళ నిండా 
బిగ్ బజార్లు..గోల గోల మాల్ లు 

దృష్టి ఉంటే 
సృష్టి ఎంత అందమైనది 
దిష్టి తీయాలి 
ప్రతి సృష్టికి ప్రాణ ప్రతిష్ట చేయాలి 

నా కళ్ళు చెబుతున్నాయి 
నువ్వు మోసం చేసావని
మూడో కంటికి తెలియని 
కుట్రలు యేవో కను రెప్పల మాటున  

కళ్ళ  అద్దమందు కొండ
కొంచమై కనపడదా 
విశ్వదాభి మామ 
ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రేమ 

లయన్స్ క్లబ్ లో నేత్రదానం 
దినపత్రిక జిల్లా పేజీలో ఓ వార్తా చిత్రం 
స్వచ్చంద ఉచిత నేత్ర వైద్య శిబిరం 
కళ్ళకు నల్లమబ్బుల గంతలు

 
సోడా బుడ్డీ కళ్ళద్దాలతో 
బుడిబుడి అడుగులు 
అత్యాశ పొరలు కమ్మేసిన 
అంధత్వ చీకట్లు 

పరీక్ష రాసి పాసై పుట్టిన పసి గుడ్డు
సిలువను మోసుకెళ్ళే ఏసులా 
బ్యాగులు మోసుకెళ్ళే బాలలు 
ర్యాంకుల జీవితంతో పోరాడుతున్న కౌమారులు 
పోటీ పరీక్షల్లో తలపండిన యువకులను 
జీతం కోసం అమ్మేసిన జీవితాలను 
బంధించిన ధృతరాష్ట్ర కౌగిలి 

కంటి పాపల్లో దాగున్నాడు 
కనుగూటి  చీకట్లో తచ్చాడుతున్నాడు
లెన్సుల బూచాడు..ఒంటి కన్ను రాచ్చసుడు 
రెండు రెళ్ళ నాలుగు కళ్ళు  
.............శ్రీచమన్.... తేదీ 04. 02. 2015

No comments:

Post a Comment