Thursday, September 17, 2015

ప‌ల్లీ..క‌న్నీరు పెడుతోందో! //శ‌్రీచ‌మ‌న్‌//


..............................
మా ఇంటి దేవ‌త
మా వ్య‌వ‌సాయకుల‌దైవం
మా గ‌తం
వేరుశ‌న‌క్కాయ‌లు

దొడ్డిబుట్టిన దూడ‌లు పెద్దరికం ప్ర‌ద‌ర్శించి..
కాడెద్దులుగా మారి నాన్నకు సాయ‌మ‌య్యాయి
ప‌లుకులు ఒక్కొక్క‌టిగా నా చేతిలోంచి చాలులోకి జారి
రేగ‌డిమ‌న్నును దుప్ప‌టి చేసుకుని దూరిపోయేవి

వెండివెన్నెల్లో ప‌రుచుకున్న న‌క్ష‌త్రాల్లా మెరిసిపోతూ
పుట్ట‌గొడుగుల్లా నేల‌మ్మను చీల్చుకుని వ‌చ్చేవి
త‌ల్లి ఒడిలో త‌నువెల్లా దాచుకున్న వేరుశ‌న‌క్కాయ‌లు
ఏరినోళ్ల‌కు కుంచం.. పొల్లాయి కొంచెం పోతేనేమి

పంట పండిందంటే..నిద్ర రాదు..ఆక‌లెయ్య‌దు
అప్పులోళ్లు ఇంటివైపు రారు.
కిరాణా కొట్టోడు బాకీ ఊసే ఎత్త‌డు
పండ‌క్కి పిల్లాజెల్ల‌ని పిల‌వాలంటే జంకే ఉండ‌దు

కాడెద్దులు కాటికెళ్లాయి
నేలపై న‌మ్మ‌కం అమ్మ‌కం
వేరుశ‌న‌గ‌కాయ‌ల అమ్మ ఒడిలో
కొల‌త‌ల రంగురాళ్లు వెలిశాయి
అప్పుడే రైతు చ‌చ్చిపోయాడు
నాన్న జీవ‌చ్ఛ‌వంలా మిగిలాడు

రైల్లో ప‌ల్లీ అని పిలుపు వినిపిస్తే
క‌ళ్ల‌ల్లో ప‌ల్లె క‌నిపిస్తుంది
వేరుశ‌న‌క్కాయ‌ల‌కు చేసిన‌
ద్రోహం పీడ‌క‌ల‌లా వెంటాడుతుంది

మెట్రో సిటీ సూప‌ర్‌మార్కెట్‌లో
ఆర్గానిక్ గ్రౌండ్‌న‌ట్‌..హాల్దీరామ్ పీన‌ట్‌
ప్యాకెట్‌లో వేరుశ‌న‌క్కాయ‌ల ప్ర‌తిరూపం
వెర్రిగా చూసి వెక్కిరిస్తోంది

No comments:

Post a Comment