Saturday, January 23, 2016

క‌విత‌లు



నేను నేనుగా లేను ...
రకరకాల నవ్వులు అలంకరించుకున్నాను
ఎవరిలానో ఉండాలని..
పనిని బట్టి పులుముకున్న నవ్వు ..
సత్యశోధనకు దొరకదు

పుస్తకాలలోని హావభావాలు
ఇతరుల మస్తిస్కాల్లోని ఆలోచనలు
మెదడు పరాన్నజీవి
హృదయం అద్దెకొరకు

నేను లేను
వ్యక్తిత్వ వికాసం ఎలా
విజయానికి చాలా మెట్లు
ఎక్కే వారే అందరూ..


నా ఆనందం అమ్మివేయబడింది
స్వేచ్చ కంచె వేసుకుంది
నవ్వును చెరశాలలో బంధించారు ..
నా ప్రేమకు పెళ్లి చేసేశారు


కన్నీటికి జాలి లేదు
ఏ సందర్భమైనా ఒకటే స్పందన
కాలం యవ్వనాన్ని దోచేసింది
ఆకులు రాలే సన్నివేశాన్ని చూడలేను


అందరూ చెప్పేవారే
వినేవారి కోసమీ నిరీక్షణ
సలహాలు ఉచితం
సహాయం ఖరీదైంది

ఊరినుంచి ..నావారి నుంచి ..
మనసు నుంచి.. మమత నుంచి ..
నేను వలస పోయాను ..
నేను ఎక్కడున్నానో నాకే తెలియనంత దూరంగా ...

......................................................శ్రీచ‌మ‌న్ 9490638222
బ‌తుకే ఒక ఆత్మ‌హ‌త్య‌!
నీ కోసం
నీ వాళ్ళ కోసం
కాలంతో కలకాలం
 జీవించే ఓ చిరంజీవి

క్షణమొక యుగం
బతుకు దుర్భరం
జీవితం భారం
మరణం దూరం

ఆశలు తీరవు.. కోరికలు చావవు.. నీలానే
ధరలు నీతో పాటు పెరుగుతాయి
సమస్యలతోనే సహజీవనం
కష్టాలు ..నష్టాలు నీ కుడి ఎడమలు


చావాలనుకున్నావో ఖబడ్దార్
ప్రతి రోజూ పుడుతూ ..చస్తూ
సమస్యలున్నంత వరకు
జీవించు మధ్య తరగతి మహా జీవి

తీగలు పట్టుకుంటే కరెంట్ కట్
దూకే బావిలో నీరుండదు
తాగే పురుగు మందు నకిలీ

నీ బ్రతుకే ఓ నరకం
నీకెందుకు ఇంకా మరణం
......................................................శ్రీచ‌మ‌న్ 9490638222
ఉద్యోగం చేయబడును
ఉపాధి దేశపటం
నిరుద్యోగ సూచికలు
వాంటెడ్ కాలమ్ ఖాళీగానే ఉంది
వాకిన్ ఇంటర్వ్యూలకు నడవలేకపోతున్నారు

దరఖాస్తులో కొన్నింటిని పూరించలేక
వదిలేస్తున్నారు
అర్హతలు మారాయి
టెక్నికల్ క్వాల్ఫికేషన్ తప్పనిసరి

అక్కడే ఉంది టెక్నిక్
ఉద్యోగం చేయడం ఎలా?
ఉన్నతాధికారులతో మెలగడంలో మెళకువలు
సబార్దినేట్స్ సహకారం పొందే విధంబెట్టిదనిన ..
బుక్ ఎగ్జిబిషన్లో పుస్తకాలు
పలువురికి ఉపాధి పధకాలు

ఉద్యోగం అంటే
నెలకోసారి వచ్చే జీతం కాదు
ఉదయం పది గంటలకు
కార్డ్ స్వాప్ చేసి
సాయంత్రం థంబ్ ఇండికేట్లో
సంతకం వచ్చీ వేలిముద్ర వేయడం కాదు

ఇలాగే బతకాలనుకోవడం
ఉద్యోగం ..
నెల బాకీలన్నీ ..ఒక రోజు తీర్చి
మరో నెల కోసం ఎదురు చూడ్డం
ఇలా పన్నెండు నెలలు కళ్ళు కాయలు కాసేలా
నిరీక్షించి ..కుంగి.. కృశించి ..
ఇంక్రిమెంట్ అందుకుందాం ..
అలా కాలానికి తెలియకుండా
కాలంలో కరిగిపో..
జనాభా లెక్కల్లో మనిషిగా
మిగిలిపో ..

ఓ అంతుబట్టని అరుణ కవీ
నీ కధలలో పాత్రనే జీవితం చేసుకున్న రవీ
నేనుగానే వెళ్లి పోతానన్న ..ఇలానే ఉంటానన్న
ఉద్యోగం కోసం వెదుకుతున్న నాకు తెలిసిన
ఆ నలుగురూ...
......................................................శ్రీచ‌మ‌న్ 9490638222

అందమే ఆనందం
మాటకు మౌనం
భాషకు భావం
మనిషికి మనసు
ప్రేమకు హృదయం
ఉంటేనే అందం
......................................................శ్రీచ‌మ‌న్ 9490638222


కొన్ని అర్థం లేని త్యాగాలు

ఆశ శ్వాసతో
కోరిక బతుకుతో
మనిషి మనసుతో
త్యాగం కోరుకోని బంధాలు

పరస్పర  అవకాశాలు
తప్పని సరైన అవసరాలు
ప్రేమగా నటిస్తూ
జీవితాంతం జీవిస్తాయి

ఉత్పత్తి ...
పునరుత్పత్తి లేని చోట
విత్తనానిదీ త్యాగమే
వీర్యానిదీ దానమే..
.............................................................శ్రీచ‌మ‌న్ 9490638222


మేము మూర్ఖులం

ధని"కులం"
అర్భ "కులం"
మేము ..మీరు..
వీరు..వారు...
అందరం మూర్ఖులమే

అమెరికా వెళ్ళినా
ఆస్ర్టేలియా వచ్చినా
ఇంగ్లాండ్లో ఉన్నా
ఈజిప్ట్ లో బతికినా

సామాజిక "వర్గాలుగా"
విడిపోయి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా ....


.............................................................శ్రీచ‌మ‌న్ 9490638222

ప్రేమ సూత్ర

తొ లి చూపో ..మలి వలపో
అన్నీ చూసుకో ..అర్థం చేసుకో ..

ప్రేమించేందుకు సరిపడా
ఆస్తులు.. అంతస్తులు ..

పనికిమాలిన హృదయం
ఎంత విశాలంగా వుందో ..

ప్రేమ సూత్రకు
కామ సూత్రం మూలం ..
భావ ప్రాప్తికి  'అర్ధ' బలమిస్తే..
'అంగ' బలం మంగళ సూత్రం ఇచ్చింది

ప్రేమించే హృదయం
మళ్ళీ కవాటాలు తెరుచుకుంది
పతితలను ..పతివ్రతలను
అక్కున చేర్చుకునేందుకు
.........................................................శ్రీచ‌మ‌న్ 9490638222

లండన్ ...వెల్ డన్..

టార్గెట్ కొట్టింది గ"గన్"
మేరీ "కాం"గా విసిరింది  పంచ్
మన "సైనా" ఆట...
కుస్తీలో కాంస్య‌"యోగ" ము
గురి తప్పని  "విజయం"
సుశీల్ "పట్టు" పట్టి సాధించెన్

మువ్వన్నెల పతాక ధారులు
భారత క్రీడాకారులు ...
లండన్ ఒలింపిక్స్ పతక వీరులు
అందుకోండి మా అభినంద‌న‌లు
....................................................శ్రీచ‌మ‌న్ 9490638222


నా దారి

దారి కానరాని ఎడారి నుంచి
నింగీ నేల కలిసిన  ఒకానొక ప్రాంతానికి

తీరంతో పోరాడి ..ఓడి ..
అలసి మరలిన సంద్రం వైపు

వెలుతురును జయించి ..
 స్థాపించిన చీకటి సామ్రాజ్యం మీదుగా

ఒంటరితనం తోడుగా ...
నీడలా  వెంటాడుతూ

కామ ధేనువు కోసమో
కల్పవృక్షం కోసమో ..

కల సాకారం చేసుకునేందుకో  ...
కళాతృష్ణ  తీర్చుకునేందుకో...

విశ్వ జన విస్ఫోట‌ము
నుంచి అణువునై ...
పరమాణువునై ...
నేను సాగిస్తున్న .....

....................................................శ్రీచ‌మ‌న్ 9490638222



అస్పష్ట సంకేతాలు

విశ్వాసానికీ శీల పరీక్ష
అపరిచితము  ఒక వెంటాడే జ్ఞాపకం
ఉరి తాడుకి పశ్చాత్తాపం
తలారీయే చివరి న్యాయమూర్తి

చీకటికి ఏవేవో కోరికలు
రాతిరంతా గుసగుసలు
ఏకాంత చోరుడు..సూర్యుడు
పగలంతా విరహ వేదన

కలలు  అలలై
వేకువ తీరాన్ని చేరుతున్నాయి
ఆకారం లేక..  సాకారం కాక
తిరిగి సాగరానికి

....................................................శ్రీచ‌మ‌న్ 9490638222


నేను ..
నమస్కారం నేను .. మీ....
అమెరికాలో ఉంటే
ఐ యామ్ యాన్ ఇండియన్
ఇండియాలో  ఏపీ వాడిని
కొండ గుర్తులో హైదరాబాదీని ..
భాగ్యనగరంలో మాత్రం శ్రీకా"కులం" వాసిని
జిల్లా కేంద్రానికెళితే రాజాం మా వూరు
సొంతూరిలో ఫలానా నా ఇంటి పేరు
ఇంట్లో ఉంటే ..  కొడుకును..
నా గదిలోకి వెళితే ఇద్దరు పిల్ల తండ్రిని..

ప్రపంచం పల్లెటూరులా మారిపోయింది
నా వరకు ఆ గది సమస్త ప్రపంచం
నా అసలైన  చిరునామాకు చేరాల్సిన ఉత్తరం
జీవిత కాలం లేటు ..

నా పేరు మనిషి..
ఇది ఎవ్వరికీ ఎవ్వరూ
ఇప్పటివరకూ చెప్పని రహస్యం
చెప్పుకోలేని దౌర్భాగ్యం
అందరూ మనుషులే..
అలా అని ఎవరు చెప్పినా
డీఎన్ఏ పరీక్ష చేయిస్తారు
....................................................శ్రీచ‌మ‌న్ 9490638222


అమ్మకు జే. . జే. .

మదర్స్ డే నాడు అమ్మకు జే జే
ఫాదర్స్ డే నాన్నకు నమస్కారం
జీవితాన్ని జీతానికి అమ్మేసిన జీవులం
కన్నోల్లకు ఇంకేమి కానుకలు ఇవ్వగలం


ఆక్వేరియంలో చేప పిల్లల్లా
ఇంటి గేటుకు కట్టేసిన కుక్కలా
కుంచించుకుపోయిన ప్రపంచం
జీవితంలాగే నిస్సారం

హాస్టల్లో చదివిన బుద్ధీ జ్ఞానం
కన్నోళ్ళను వృద్ధాశ్రమంలో చేర్పించింది
ఏడాదిలో రోజులన్నీ అమ్ముడుపోయాయి
ఒక ప్రేమ పూర్వక పలకరింపూ నా దగ్గర లేదు

రెప్పలు మూసి గుండెను తెరిచి
నిద్ర నటిస్తూన్న కాలంలో
తీరే కోరికలు.. నెరవేర్చలనుకున్న ఆశయాలకు
కలలోనూ చోటు దక్కలేదు ..


....................................................శ్రీచ‌మ‌న్ 9490638222



ఒకటి కొంటే ..

కరిగిపోయిన కాలం
గడియారం ముళ్లు
బాధ్యతల ఒబేసిటీ
హృదయానికి భారం

అపజయం
వెన్నతో పెట్టిన విద్య
గెలుపు చివరి మజిలీ
బరిలో మిగిలేది ఓటమే
 

మధ్య తరగతి
త్రిశంకుస్వర్గం
అద్దె రెక్కలతో ఎగిరిపోతే
ఎంత బాగుంటుంది

వన్ ఆర్ నన్
కోరికలు గుర్రాలు
ఓజోమేన్..  ఒకటి కొంటే
మరొకటి ఉచితం 

హెయిర్ కు డై
కోటుకు టై
లోదుస్తులకు
తనిఖీల నుంచి మినహాయింపు

....................................................శ్రీచ‌మ‌న్ 9490638222


బ్లడ్ కారిడార్    (కవిత శీర్షిక)

బీల బేల చూపులు
దమ్ము పొలంలో
థర్మల్ దుమ్ము
ఏ వెలుగులకీ చీకట్లు

గూడ కొంగల బతుకు సమరం
తేలినీలాపురం
సైబీరియా టు ఇండియా
పొడుగు రెక్కల మృత్యు సంతకం

ఒకప్పుడు తీరం అంటే ..
ఇసుక తిన్నెలు..కొయ్య పడవలు 
అలుపులేని అలలు..కొన్ని వలలు

ఇప్పుడు తీర ప్రాంతం అంటే.. 
అణుభూతం కోరలు తోమే స్నానవాటిక
మాయదారి మందుల కంపెనీల శవపేటిక


నది ఆనవాళ్లు
కన్నీటి చారికలు

నాగావళిని
కాలనాగులా కాటేసింది ఎవరు?

వంశధారలు
ఏ వంశానికి ధారాదత్తమయ్యాయి?

మహేంద్రతనయకు
ఎందరు సవతి తండ్రులు?

బాహుదాను బంధించిన
ఆజానుబాహుడు ఎవడు?

చంపావతిని చంపేశారు
పంచనామా ఎప్పుడు?

వేగావతి వేగం
మింగేసింది ఎవరు?

జంఝావతి జలాలు
పొలాలకెందుకు చేరవు

తీరం ..ఇప్పుడు
సహజ వనరుల నిలయం

తవ్వుకుంటారో ..
తరలించుకుంటారో
ఇండస్ట్రియల్  కారిడార్ కోసం
గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం
(శ్రీకాకుళం సాహితీ క‌వితా సంక‌ల‌నం ``తుడుం``లో ప్ర‌చురితం
....................................................శ్రీచ‌మ‌న్ 9490638222

విటుడ‌వై..మ‌హాన‌టుడ‌వై..

పదండి వెనక్కి ..పదండి నెట్టుకు
యూసఫ్ గూడ అడ్డా వైపు
చీము నెత్తురు లేని తోలు తిత్తితో
సిగ్గు శరం లేని బతుకుతో
విటుడవై మహా నటుడవై
తింటూ బతికేయ్
చాటు మాటుగా తిడుతూ గడిపెయ్

మఠం నిద్ర .. సత్రం భోజనం
పధకం పెట్టే ప్రభుత్వానికే నా ఓటు
....................................................శ్రీచ‌మ‌న్ 9490638222

లుక్స్.. సెక్స్

కలయిక కల అయినప్పుడు 
నిదుర కూడా ప్రేమించదగినదే
కోరికల కలవరింతలను
కోడి కూత తట్టి లేపింది

చాప నా సహచరి
దిండు ఓ ప్రేయసి
లుక్సూ సెక్స్ లో
ప్రధాన భంగిమ

ఎన్ని కలలు
స్కలించాయి
మరెన్నికోరికలు
ప్రసవించాయి

మంచానికి మనస్సు ఉంటే
వెల్లకిలా పడిన
నీ హృదయంపై పడి 
తను తనువు చాలించేది

ఏ కాంతా చూడని
ఏకాంతంలో
యవ్వనాన్ని
ప్రేమించింది నపుంసకత్వం

ప్రేమికుడివీ నువ్వే
ప్రేయసీ నువ్వే
తాజ్ మహల్
అవసరమే రాదు

....................................................శ్రీచ‌మ‌న్ 9490638222
ప‌ద్య‌మే మ‌ద్యం

కవిత్వం  ప్రేయసి
రచనా వ్యాసంగం
ఒక‌  వ్యసనం
 ప్రేమ మైకం
ఎడ‌తెగ‌ని మోహం
తీర‌ని దాహం

ప‌ద్య‌పాదాల‌ స‌వ్వ‌డిలో
నెచ్చెలి ఒడిలో
నిద్ద‌రోతున్న క‌వి
క‌ల‌లో అల‌జ‌డి
క‌లంలో క‌ల్లోలం

ప‌ద్య‌మే మ‌ద్యం
ఉల్లాస‌ప‌రిచే వాయిద్యం
క‌ల్లోలిత మ‌న‌సుకు వైద్యం
ఆత్మారాముడికి  నైవేద్యం
................................................శ్రీచ‌మ‌న్ 9490638222

బిడ్డ‌లార‌! క్యాన్స‌ర్ గ‌డ్డ‌లార‌!

తల్లి పాల కొద్దీ
రొమ్ము గుద్ది
టెట్రా ప్యాక్
సొగసులద్ది
సొమ్ముకు
అమ్ముకుంటున్న
బిడ్డలారా

కు.ని.  చేయించుకున్న
 కళా మతల్లికి
పుట్టిన ముద్దు బిడ్డలారా

గొడ్రాలి కడుపున
పడ్డ కణితులార

బిడ్డని భ్రమ  పడుతున్న తల్లి
కడుపులో పెరుగుతున్న
క్యాన్సర్ గడ్డలారా
వెండి తెరపై వాలిన గద్దలారా
చాలించండి మీ కపట నాటకాలు

................................................శ్రీచ‌మ‌న్ 9490638222


సినిమా సూపిత్త ..

నవ్వుల వెనుక
నిశీధిలో విషాదం
లైట్స్ ఆన్

అందం లోపలి పొరల్లో
ఎన్ని ముడతలు
స్టార్ట్ యాక్షన్

వాగులు వంకలను
కలిపే కన్నీటి చారిక
అందుబాటులో గ్లిజరిన్

కళ్ల కింద నీటి సంచుల్లో
ఉప్పునీటి సంద్రం
ఈ దాహం తీరనిది

వెండితెరపై వెలుగులు
వన్నె తగ్గని అందాలు
ప్రతిసృష్టికర్త మేకప్ మెన్


కురుల మెరుపులు
వాలు జడ వయ్యారం
సిగ్గు వదిలిన విగ్గు
 
ఎద సిరుల విరుపులు
అరవైలో ఇరవై 
సిలికాన్ సిత్ర్రాలు

పెదాల పదాలు
పాదాల నృత్యాలు
కృష్ణానగర్ ప్రొడక్షన్స్

ఎడతెగని పోరాటం
రెమ్యూనరేషన్ కోసం
స్టంట్ మాస్టర్ ఆరాటం


సకల కళల ఆకారులు
ఏదో ఒక యూనియన్
సభ్యత్వం

మేకప్ లేకపోతే ప్రేక్షకులతోపాటు
కుటుంబసభ్యులూ కూడా
 గుర్తు పట్టలేకపోతున్నారు

పచరంగుల సాంఘిక
చిత్రంలో విశ్రాంతి లేదు
శుభం కార్డు.. బోర్డు తిరగబడింది

...........................................శ్రీచమన్ 9490638222


ఫోర్జరీ


జ్ఞాపకాలు

ద్రవరూపంలో

ఆల్కహాలంతా

పొగచూరింది


కొన్ని గుర్తు చేసుకుంటూ

మరికొన్ని మరిచిపోయేందుకు

పరస్పర వ్యాకరణ దోష సంభాషణలు

ఆత్మస్తుతి, పరనింద


కొమ్ములూ..  వత్తులూ

మత్తుగా పేలుతూ తూలుతున్నై

గుండె  మంటలపై నిప్పుల కప్పు

గాయాల గేయాలాపన


ఘనమైన మంచు ముక్కలు ద్రవించాయి

మాస్క్ లు తీసి నిజరూప దర్శనం

లైట్ తోలు కప్పుకున్న రా ..క్షసులు


కనీ కనిపించని

వినీ వినిపించని లోకంలో

తీరని వేదన

మద్యం..తర రోదన


హామీలు..ఓదార్పులు..వాగ్దానాలు ..  ధ్రువ పత్రాలు ..

కాలం నిద్ర లేచింది

రాత్రి హామీలపై ఎవరో ఫోర్జరీ చేసారు ..


...........................................శ్రీచమన్ 9490638222


ప్రపంచీకరణకు పుట్టిన  ప్రజాకవీ

తాగేది జానీ వాకర్
పాడేది కల్లు పాట

చెప్పేవి మార్కిస్ట్ కబుర్లు
దూరేవి పెట్టుబడిదార్ల బంగళాలు

చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్
మాట్లాడేది సేంద్రియ వ్యవసాయం

తొంగునేటప్పుడు ఏసీ
లేచేటప్పుడు గోచీ

వేదికలపై పల్లె పలవరింత
కలలో పట్నవాసం కలవరింత

స్టార్ హోటల్లో
దిగిన ప్రజా కవీ
నీకు రేపే సన్మానం
.................................................................శ్రీచ‌మ‌న్ 9490638222

నన్ను ప్రేమిస్తావా?

డెబిట్ కార్డ్
జీరో బేలన్స్
క్రెడిట్ కార్డ్
బిల్ పెండింగ్

నాన్న సైడ్
నో అసెట్స్
అమ్మ తరపు
అసలు అడగొద్దు

బాడుగ ఇల్లు
రోగాల వల్లు
అరటి ఆకు కొలువు
అప్పులకు నెలవు

చుక్కకో  ముక్కకో
 పక్కకో కక్కుర్తి పడే
దేవుడిచ్చిన తండ్రి (గాడ్‌ఫాద‌ర్‌)
నను పెంచుకోడు

విమానమంత
విశాల హృదయానికి
టు లెట్ బోర్డ్
పెట్టి చాలా రోజులైంది


ఒక్క మిస్సుడ్ కాల్ వస్తే
నా మిస్సెస్ చేసుకుంటా
కాంటాక్ట్ నంబర్ కు
రాంగ్ నంబర్ కాలూ
రావట్లేదు
తలపుల తలుపు
తాళం పోయింది
...................................................శ్రీచ‌మ‌న్ 9490638222


నా మరణానికి  ఎవరూ కారణం కాదు ..

నిండు చూలాల్లు
నిండుగా ఉన్న
ధర్మాసుపత్రిలా ఉంది
జనరల్ బోగీ

కష్టాలను మూటగట్టి
నెత్తికెత్తుకున్న‌ సామాన్యుడిలా
దూర ప్రాంతాలకు
భారంగా కదిలిన బస్సు

విరామమెరుగని
విశాలమైన నగరదారులన్నీ
పల్లె ఇరుకు సందులకు
పరుగులు పెడుతున్నాయి

పొమ్మన్న పల్లెలో
సంకురాతిరి సంబరానికి
పిలవని పేరంటాళ్ళు
ఈ వలస పక్షులు

డబ్బుకు..  జబ్బుకు
పల్లె పట్టణమన్న తేడాల్లేవ్
అంటు కట్టిన పార్దీనియం మొక్కలు
అంటువ్యాధిలా  విస్తరించాయి

ఇక్కడ క్లబ్బులు పబ్బులు
అక్కడ కోడి పందాలు
పొట్టేళ్ల పోటీలు
బెల్ట్ తీసిన షాపులు

రక్తాన్ని చెమట చేసి
కష్టాన్ని కాసులుగా మార్చి
పల్లెకొచ్చిన బాటసారి
జేబుకు చిల్లు పెట్టిన నల్ల దొరలు

తాటి తోపులో మొలిచిన
రియల్ కొలత రాళ్ళు
తొక్కుడు బిల్లాట పిల్లల
కాళ్ళకు మానని గాయం


ఊక జోరులో
గుంట నక్కలు
వూరిలో మనుషుల్ని
పీక్కు తినే ఊర కుక్కలు


పంటల్లేని పల్లెలో
ఆకలి మంటల్లా
భోగి మంటలు
టైర్ కాలిన వాసన

పండగ పూట అందరూ
ఆటకెళ్ళే పెద్ద తోట
చెట్టు మోడై భూమి బీడై
 చిన్నబోయింది

మద్యం మత్తులో
వావివరసలు మరిచిన 
కనుమ కలహాలు
కంపరం పుట్టిస్తున్నాయి

చెరిగిపోతున్నఅద్భుత చిత్రాన్ని
తిరిగి చిత్రించేందుకు
నేను బ్రమ్మనూ కాను
ఆయన చేసిన బొమ్మను

అందుకే కూలిపోయిన
నా పూరిల్లు సాక్షిగా
బ్రాందీ సీసాలో దూరి
ఆత్మహత్య చేసుకుంటున్నాను ..

.............................................. శ్రీచమన్ 9490638222



మేక్ ఎ విష్

నగరం మురుగు
నురగలు కక్కుతూ
నాలాలు పొంగి
నడిరోడ్డుపై ప్రవహిస్తోంది

సకల మలినాలు
అనంత వ్యర్ధాలు
తమ కుల్లునంతటికీ
నల్లటి రూపమిచ్చాయి

స్లిమ్ ఉమ్మేసిన చెత్త
పోష్ విసిరేసిన యాష్
హైట్స్ నుంచొచ్చిన  డస్ట్ బిన్లు
స్లమ్ ను ముంచెత్తాయి


ఓడలు తిరగని మురికివాడలో
నావే కానరాని వైతరిణీ నదిలో
ఉందో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల


హారన్ మోగించే క్రూర జంతువులను 
తప్పించుకుంటూ.. ఒప్పించుకుంటూ
కంకర అడవుల ముళ్ళ బాటలో
పాదరక్షలు లేని అక్షర కాంక్ష


పలకా పుస్తకాలతో
ప్రతి రోజూ పసిపాపల
పద్మవ్యూహ ప్రవేశం
అభిమన్యుడికి ఒకసారే


కేజీ టు పీజీ ఉచిత విద్య
ఇక్కడ చదువు"కొనక్క"ర్లేదు
పాఠ‌శాల‌కు వెళ్ల‌డ‌మే కష్టం
చిన్నపిల్లలకు పెద్ద బాల"శిక్ష"

చిట్టి పాదాలు చెప్పుకోలేవు
చెప్పులు  కొనివ్వండి
చిరిగి శల్యమైన పుస్తకాలకు
ఓ సంచి దానమివ్వండి

తీర్చండి వీరి మేక్ ఎ విష్
కొన ప్రాణాలతో ఉన్న
చదువుల తల్లులకు
కొత్త వూపిరివ్వండి

...........................................శ్రీచమన్ 9490638222



కొత్త మతానికి పురుడు పోస్తాం

బేటీ బచావో బేటీ పడావో
సంతాన సాఫల్య కేంద్రం
ఇక్కడ పుట్టే ఆడపిల్లలు
వారికి వారే రక్షకులు

అత్యాచారాలకు బలి కాని
అమ్మాయిలకు జన్మనిస్తాం
అఘాయిత్యాలను ఎదుర్కొనే
ఆడపిల్లల్ని ఉత్పత్తి చేస్తాం

సురక్షితమైన అద్దె గర్భం
అందుబాటులో ఉంది
లింగ వివక్ష చూపని
కిరాయి తల్లులు మా ప్రత్యేకం

పిల్లల్ని కాపాడే
కొత్త మతానికి పురుడు పోస్తాం
పిల్లల్ని ప్రేమించే
 కొత్త కులానికి జన్మనిస్తాం

సేంద్రియ పద్దతిలో సంతానోత్పత్తి
ప్రకృతి సిద్ధమైన ప్రసవం
కలయిక అక్కర్లేని
కలల పంట

సరసమైన ధరలకు సరోగసి
టెన్ పర్సంట్ డిస్కౌంట్లో
టెస్ట్ ట్యూబ్ బేబీ
ఆషాడం ఆఫర్

....................................................శ్రీచమన్  9490638222


ఓ మర మనిషీ ..
రకరకాల నవ్వులు
ప్లాస్టిక్ పువ్వులు
ఓ మర మనిషీ
నాలోకి రా

పుస్తకాలలోని హావభావాలు
ఇతరుల ఆలోచనలు
మెదడు పరాన్నజీవి
హృదయం ఓ స్టంట్ మాస్టర్

నేను లేను
వ్యక్తిత్వ వికాసం ఎలా?
విజయానికి చాలా మెట్లు
ఎస్కలేటర్ కోసమీ నిరీక్షణ

నా ఆనందం అమ్మివేయబడింది
స్వేచ్చ కంచె వేసుకుంది
కోరికల గుర్రాలకు కల్లెమేశారు
నా ప్రేమకు పెళ్లి చేసేశారు

కన్నీటికి జాలి లేదు
సందర్భమేదైనా  ఒకటే స్పందన
కాలం యవ్వనాన్ని దోచేసింది
ఆకులు రాలే సన్నివేశాన్ని చూడలేను

చెప్పేవారే అందరూ
వినేవారే లేరు
సలహాలు ఉచితం
సహాయం ఖరీదైంది

ఊరినుంచి ..నావారి నుంచి ..
మనసు నుంచి.. మమత నుంచి ..
నేను వలస పోయాను ..
ఎక్కడున్నానో  తెలియనంత దూరంగా ...

................................................................శ్రీచ‌మ‌న్ 9490638222

నాలుగు కళ్ళు

ప్రపంచాన్ని చూడడానికి
రెండు కళ్ళు చాలవు
విశ్వాన్ని చుట్టి రావడం
రెండు కాళ్ళకు సాధ్యమా?

దూరదృష్టి లేకపోతే
దూర తీరాలు చేరలేని గమ్యాలు
భార హిత జీవితానికి
ముందు చూపు అత్యవసరం

నయనం ప్రధానం
అంతటా ప్రదర్శనా ప్రభావం
రెండు కళ్ళ నిండా
బిగ్ బజార్లు..గోల గోల మాల్ లు

దృష్టి ఉంటే
సృష్టి ఎంత అందమైనది
దిష్టి తీయాలి
ప్రతి సృష్టికి ప్రాణ ప్రతిష్ట చేయాలి

నా కళ్ళు చెబుతున్నాయి
నువ్వు మోసం చేసావని
మూడో కంటికి తెలియని
కుట్రలు యేవో కను రెప్పల మాటున 

కళ్ళ  అద్దమందు కొండ
కొంచమై కనపడదా
విశ్వదాభి మామ
ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రేమ

లయన్స్ క్లబ్ లో నేత్రదానం
దినపత్రిక జిల్లా పేజీలో ఓ వార్తా చిత్రం
స్వచ్ఛంద ఉచిత నేత్ర వైద్య శిబిరం
కళ్ళకు నల్లమబ్బుల గంతలు


సోడా బుడ్డీ కళ్ళద్దాలతో
బుడిబుడి అడుగులు
అత్యాశ పొరలు కమ్మేసిన
అంధత్వ చీకట్లు

పరీక్ష రాసి పాసై పుట్టిన పసి గుడ్డు
సిలువను మోసుకెళ్ళే ఏసులా
బ్యాగులు మోసుకెళ్ళే బాలలు
ర్యాంకుల జీవితంతో పోరాడుతున్న కౌమారులు
పోటీ పరీక్షల్లో తలపండిన యువకులు


జీతం కోసం అమ్మేసిన జీవితాలను
బంధించిన ధృతరాష్ట్ర కౌగిలి
కంటి పాపల్లో దాగున్నాడు
కనుగూటి  చీకట్లో తచ్చాడుతున్నాడు
లెన్సుల బూచాడు..ఒంటి కన్ను రాచ్చసుడు
రెండు రెళ్ళ నాలుగు కళ్ళు 
.................................................................శ్రీచ‌మ‌న్ 9490638222
నాకో షుగ‌ర్‌లెస్సూ..!

చీకట్లను చీల్చుకుంటూ
వెలుతురు దారి
చెమటలు కక్కుకుంటూ
అలుపెరగని ఓ బాటసారి
అన్నీ వాడి పారేసేవే
కొన్ని మరకలు
మరికొన్ని గురుతులు
చిందర వందరగా వ్యర్ధాలు
మార్నింగ్ వెరీ ఫ్రెస్సూ
ఈవెనింగ్ వెరీ స్ట్రెస్సూ
ఉరుకు పరుగుల జీవితం
ఆశే ఆసాంతం
పేరు మధురం
తీరు దుర్భరం
మనిషికి విరోధి
అదే ఈ వ్యాధి
చక్కెర వ్యాధి
షుగర్ జబ్బు
డయాబెటిక్ ..
ఎలా పిలిచినా
తీయగా పలుకుతుంది
చేవను మింగేసి
చేదును మిగిలిస్తుంది
ఆకలిని తీర్చే అన్నం విషమై
తనువెల్లా తూట్లు పొడుస్తుంటే
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన
ప్రియురాలు గొంతు నులిమేస్తున్నట్లుంది
నిరంతరం చావు భయంతో
తింటూ .. బతుకుతూ
తీయనైన రోగాన్ని
హాయిగా జయించాలనే
ఈ వేకువ పోరాటం
నీడ కూడా జాడ చూపని వేళలో
జీవితాన్ని కాచి వడపోసిన వాడిలా
నరకాన్ని అధిగమించేందుకు
డయాబెటిక్ ఎడారిలో
నడక దారి
కంకర అడవుల్లో వాకింగ్
కింగ్ లను సేదదీర్చేందుకు
దారి పక్క చెట్టు కింద
అభివృద్ధి మింగేయకుండా
వదిలేసిన గుర్తులా
ఖరీం భాయి చాయ్ డబ్బా
నాకో షుగర్లెస్సూ...
అంటూ ఆర్డర్లు ..


................................................శ్రీచమన్... 9490638222


No comments:

Post a Comment