Wednesday, December 9, 2015

ఎండా.. వాన ..




చినుకు నేలను ముద్దాడింది
మట్టి వాసనేదీ ?

నై.. రుతి పవనం
ఈశాన్యానికి వాస్తు దోషం

వానకు కాలంలేదు
మేఘాలతో చెలిమి లేదు

వ‌నాల్లో జ‌నాలు
న‌గ‌రాల్లో వ‌న్య‌ప్రాణులు
కాకుల దూర‌ని కార‌డ‌విలో
కాలింగ్ బెల్ మోత

ప‌ర్యావ‌ర‌ణానికి పొగ‌
ప్ర‌కృతిపై వికృత‌చేష్ట‌లు
కాలాలకు పోయే కాలం
శీతాకాలంలో వాన‌లు
వానాకాలంలో ఎండ‌లు
ఎండా కాలంలో మంచు
ప‌ర్యావ‌ర‌ణ విధ్వంస చిత్రం
వాతావ‌ర‌ణం విచిత్ర దృశ్యం

అల్ప‌పీడ‌నాల ఆప‌ద‌లు
వాయుగుండాల గండాలు
తుఫాన్ ప్ర‌కంప‌న‌లు
సునామీ హెచ్చ‌రిక‌లు

నిషా, ఖైముఖ్, ఓగ్ని, ఐలా, లైలా ...
ఇప్పుడు చినుకంటే వణుకు

ఫైలిన్ ఘీంకారం
హుధుద్ హుంక‌రింపు
సునామీ ఉప‌ద్రవం
విశాఖ విల్ల‌విల్లాడితే
చెన్నై గుండె చెదిరింది

ఓ వైపు
జ‌ల‌విలయం.. ప్రళ‌యం
కన్నీటి సంద్రం
తాగేందుకే నీరు లేదు

మ‌రోవైపు క‌రువు
ప‌నుల్లేవ్‌..పంట‌ల్లేవ్‌
ఆక‌లి మంట‌లు
క‌న్నీటితో గొంతు త‌డుపుదామంటే
క‌ళ్ల‌లోనూ నీరింకిపోయాయి

తాము మాత్రమే జీవించేందుకు
జీవ‌వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు

త‌న గొయ్యి తానే త‌వ్వుకుంటున్నాడు
మ‌న చితి మ‌న‌మే పేర్చుకుంటున్నాం


.................................................శ్రీచ‌మ‌న్








1 comment:

  1. కాలాలకు పోయే కాలం- well said. good

    ReplyDelete