Monday, January 30, 2017

బ్యాట్‌..ట్వీటూ వీరూకొక్క‌టే!

సెహ్వాగ్ ట్వీటుతోనూ కొడ‌తాడు
విధ్వంస‌క‌ర ట్వీట్స్‌మెన్ వీరూ
బ్యాట్‌..ట్వీటూ వీరూకొక్క‌టే!
బ్యాటుతోనే కాదు..ట్వీటుతోనూ కొడ‌తాడు. క్రీజులోకి దిగి వీర‌విహారం ప్రారంభిస్తే..బౌల‌ర్లు రిటైర్డ్ హ‌ర్ట్ గా వెనుదిరుగుదామా అనేలా బాదేవాడు. ఇప్పుడు సైటైర్ల‌తో నెటిజ‌న్ల హార్ట్‌ల‌ను కొల్ల‌గొడుతున్నాడు. కొంద‌రు పొలిటీషియ‌న్ల‌ను హ‌ర్ట్ చేస్తున్నాడు.  మైదానంలో దిగితే బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించే వీరూ..ఇప్పుడు రిటైర్ అయి సెటైర్లు పేల్చుతున్నాడు. ఓపెనింగ్ కు దిగి విధ్వంస‌క‌ర బ్యాటింగ్ విన్యాసాల‌తో క్రికెట్ అభిమానుల మ‌న‌సు దోచుకున్న వీరేంద్ర సెహ్వాగ్‌..బ్యాటు వ‌దిలి ట్వీటు బాట ప‌ట్టాడు. ఇక్క‌డా అదే కొట్టుడు.
అయితే ఎప్పుడూ సీరియ‌స్‌గా క‌నిపించే..వీరూలో ఎంత సెన్సాఫ్ హ్యూమ‌ర్ వుందో..అంతే స్థాయిలో మాన‌వ‌త్వ‌మూ వుంది. దేశంలోని స‌మ‌కాలీన స‌మ‌స్య‌ల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ వీరూ ..మైదానంలోనే కాదు..సోష‌ల్ మీడియాలోనూ విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించాడు. దేశంలో నేత‌ల బ‌ర్త్‌డేల సంద‌ర్భంగా కాస్త వ్యంగ్యం..మ‌రి కాస్తా వెట‌కారం..ద‌ట్టించి..ప్రేమాభిమానాలు కుమ్మ‌రించి చేస్తున్న ట్వీట్లు హాట్ హాట్‌గా స‌ర్క్యులేట్ అవుతున్నాయి.
ఢిల్లీలో వ‌ర్షాలు కురుస్తున్న‌ప్పుడు.. ప‌డ‌వ కావాలేమో బ‌జ్జీ ట్వీటు చేస్తే..రెండు ప‌డ‌వలు కొనుక్కోవాలి.. స‌రి బేసి ట్రాఫిక్ అమ‌లు వుంది జాగ్ర‌త్త అంటూ హాట్ గా రీట్వీట్ చేశాడు సెహ్వాగ్‌. న‌రేంద్ర‌మోడీకి బ‌ర్త్‌డే విషెస్ చెబుతూ ..క్రికెట్ ప‌రిభాష‌లో మోడీజీ 66 నాటౌట్‌..మీరు సెంచ‌రీ చేయాల‌ని స్వీటుగా ట్వీట్ విషెస్ చెప్పాడు. ఇక ఢిల్లీ సీఎం.. కేజ్రీవాల్‌కు కాస్త వ్యంగ్యంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశాడు వీరూ.
త‌ర‌చూ జ‌లుబు, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే కేజ్రీవాల్‌కు..ఈ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అవ‌న్నీ త‌గ్గి ఆరోగ్యంగా వుండాల‌ని కోరుకుంటున్నాన‌ని ట్వీట్ గ్రీటింగ్స్ పంపాడు. యురి సెక్టార్‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తూ..వారికి కుటుంబ‌స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టించిన ట్వీటులోనూ వీరేంద్ర సెహ్వాగ్ త‌న‌లోని దేశ‌భ‌క్తిని, సైనిక‌శ‌క్తిపై వున్న ప్రేమ‌ను మ‌రోసారి చాటాడు.
“17 మంది ప్రాణాలు. వారికీ కుటుంబాలున్నాయి. వాళ్లకూ కొడుకులున్నారు. కూతుళ్లున్నారు. వారు మాతృభూమికోసం సేవ చేశారు. ఈ దృశ్యం చూసేందుకు బాధగా ఉంది. యూరీ దాడి ఘటన విని నా గుండె తరుక్కుపోతోంది. దాడి చేసిన వారు తిరుగుబాటుదారులు కాదు. వారు ఉగ్రవాదులే. ఉగ్రవాదానికి సరైన సమాధానం ఇచ్చితీరాలి“ అని ట్వీటు చేసి..17 మంది సైనికుల పార్థివ‌దేహాలున్న ఫోటోల‌ను పోస్టు చేశాడు.
బ్యాటు..ట్వీటు రెండూ కూడా ఒకేలా వాడుతున్న వీరేంద్ర సెహ్వాగ్‌లో ఒక విమ‌ర్శ‌కుడున్నాడు..మ‌రో విశ్లేష‌కుడు దాగున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌లో ఒక సీరియ‌స్ రైట‌ర్ అంత‌ర్లీనంగా వున్నాడు. చ‌రిత్ర‌, రాజ‌కీయాలు, సామాజిక వ‌ర్త‌మాన స‌మ‌కాలీన అంశాల‌పై పూర్తి స్థాయి అవ‌గాహ‌న‌తో వున్న వీరేంద్ర  సెహ్వాగ్‌…ట్విట్ట‌ర్ వేదిక‌గా క్రీజులో చెల‌రేగిన‌ట్టుగానే చెల‌రేగిపోతున్నాడు. అవుట్ స్వింగ‌ర్ అయినా, ఇన్ స్వింగ‌ర్ అయినా, యార్క‌ర్ అయినా, స్లో డెలివ‌రీ అయినా, గూగ్లీ అయినా, దూస్రా అయినా, చివ‌రికి బౌన్స‌ర్‌నైనా బౌండ‌రీకి దాటించే స‌త్తా వీరూ బ్యాటుది.
ఇప్పుడు విషాద‌మైనా, ఆనంద‌మైనా, క‌ష్ట‌మైనా, న‌ష్ట‌మైనా, వ్యంగ్య‌మైనా, భిన్న‌మైన అంశాల‌పై..వాటిక‌నుగుణంగా స్పందిస్తూ ట్వీటే ఆలోచ‌నా శ‌క్తి సెహ్వాగ్‌ది. అందుకే వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. వివేచ‌న‌, వివేకం, దేశ‌భ‌క్తి, వ్యంగ్యం క‌ల‌గ‌లిసిన ట్వీట్స్‌మెన్‌గానూ రికార్డులు సృష్టిస్తున్నాడు.
శ్రీచ‌మ‌న్‌, జర్న‌లిస్ట్
srichaman@gmail.com
http://www.cricnkhel.com/telugu/virendra-sehwag-indian-cricketer-twitter-chall-madhu-cricnkhel-com-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80%e0%b0%9f%e0%b1%82-%e0%b0%b5/

No comments:

Post a Comment