Monday, January 30, 2017

ఎప్ప‌టికీ “యువ‌“ రాజే!

అర‌ణ్యాన్ని ఏలేది మృగ‌రాజు అయితే.. మైదానంలో సంచ‌రించేది యువ‌రాజు. వాడి చూపు ఆక‌లిగొన్న పులిలా ఉంటుంది. వాడి క‌సి వేట‌కు వెళ్లే సింహంలా ఉంటుంది. ఫీల్డింగ్ స‌మ‌యంలో చీతాను త‌ల‌పిస్తాడు. ఆట‌ను యుద్ధంలా భావిస్తాడు. తాను ఆట‌గాడిన‌ని మ‌రిచిపోతాడు. సైనికుడిలా నిలువెల్లా దేశ‌భ‌క్తి పులుముకుంటాడు. రెచ్చ‌గొడితే రెచ్చిపోతాడు. ఎంత‌లా అంటే, ఫ్లింటాఫ్ గొంతు కోస్తాన‌ని స్లెడ్జింగ్కు దిగితే.. వాడి వెన్నుముక‌లాంటి బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను ఊచ‌కోత కోసేంత‌గా! ఆరు బాళ్లు, ఆరు ర‌కాలుగా, ఆరు దిశ‌లుగా ఆరేసి ప‌రుగులుగా బాదేంత‌గా! యాక్ట‌ర్ కొడుకు యాక్ట‌రైనా అంత‌గా రాణించ‌లేదు.
డాక్ట‌ర్ కొడుకు డాక్ట‌రైనా తండ్రి పేరు సంపాదించ‌లేదు. కానీ క్రికెట‌ర్ కొడుకు క్రికెట‌ర్ అయ్యాడు. తండ్రి కోరికా కాదు. త‌ల్లి పైర‌వీ లేదు. దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర‌య్యాడు. తండ్రి పేరు చెప్పుకు తిరిగే బాబుల‌కు చెంప‌పెట్టులాంటివాడు. త‌న‌కూ ఓ మోస్త‌రు క్రికెట‌ర్‌గా పేరున్నా, కొడుకుతో సత్సంబంధాలు లేక‌పోయినా, యువ‌రాజ్‌సింగ్ తండ్రిన‌ని త‌ర‌చూ చెప్పుకుంటాడు యోగ‌రాజ్ సింగ్‌. మ‌న‌స్సు య‌వ్వ‌నంతో ఉర‌క‌లేస్తుంటే..ఆటైనా, ప్రేమ‌యినా జ‌యించి తీరుతాడు. విజేత‌గా నిలుస్తాడు. మృత్యువునూ జ‌యిస్తాడు. మృత్యుంజ‌యుడ‌వుతాడు.  పేరుకు త‌గ్గ‌ట్టే ఎప్ప‌టికీ యువ రాజు యువ‌రాజే. ప్రేమించినా, కామించినా, ర‌మించినా డ్రామాలాడే ఆట‌గాళ్ల‌కు, పిట్ట‌ల వేట‌గాళ్ల‌కు భిన్నంగా ప్రేమికురాలిని వెంటేసుకుని తిరిగే ధీశాలి మ‌నోడు.
నీకో నాకో మ‌నుషులెవ‌రికైనా క్యాన్స‌ర్ వచ్చింద‌ని రిపోర్ట్‌లో తెలిస్తే చాలు స‌గం చ‌చ్చిపోతారు. అదీ నూటికో కోటికో వ‌చ్చే కేన్స‌ర్ అయితే గుండె ఆగి “పోతారు“. ట్రీట్‌మెంట్ ప్రారంభ‌మైన త‌రువాత ఇక జ‌నానికి క‌నిపించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌రు. కొంత‌మంది చికిత్స అయినాక భ‌యంతో పోతారు. టెన్ష‌న్‌తో ప్రాణాలు విడుస్తారు. అయితే వాడు యువ‌రాజ్ సింగ్‌. మాంచి స్వింగ్ మీదున్న‌ప్పుడు సింగ్ ఈజ్‌ది కింగ్ అనిపించుకున్న స‌మ‌యంలో పంజా విసిరింది మాయ‌దారి రోగం. అయితే క్యాన్స‌ర్ ను కూడా చాలా సులువుగా బాల్‌ను బౌండ‌రీ లైను దాటించినంత సులువుగా దాటించేసి మైదానంలో అడుగుపెట్టాడు. వ‌న్డే టీమ్‌లోకొచ్చాడు. 20-20 జ‌ట్టులో కీల‌క స‌భ్యుడ‌య్యాడు. ఐపీఎల్‌లో అద‌ర‌గొడుతున్నాడు. మ‌ళ్లీ ఆరు బాళ్ల‌కు ఆరు సిక్స్‌లు కొడ‌తానంటున్నాడు. వీడి వాల‌కం, య‌వ్వ‌నం, మొండిత‌నం చూస్తుంటే నిజంగా కొట్టేట‌ట్టున్నాడు.
వీడి ప్రేమ సంద్రం. ఎంత అంటే.. తాను ప్రేమించి,పూజించే స‌చిన్ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు పెద్ద‌దిక్కుగా ఎదురుగా క‌న‌బ‌డితే చిన్న‌పిల్లాడిలా పాదాల‌పై ప‌డి దండం పెట్టేంత ప్రేమ‌. క్రికెట్ గాడ్ ను భుజాల‌పై ఎక్కించుకుని తిప్పేంత  అభిమానం. ప్రేమ‌లాగే కోప‌మూను. గ‌ట్టు తెగిన గోదారిలా ఉర‌క‌లెత్తుతుంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు నుంచి క‌వ్వింపులొస్తే కాల‌నాగులా బుస‌కొడ‌తాడు. బ్యాట్‌కు ప‌నిచెబుతాడు. యువ‌రాజ్ గ‌త ఆట‌తీరుతో పోల్చుకుంటే క్యాన్స‌ర్ జ‌యించి వచ్చిన ఆడింది అంతంత‌మాత్ర‌మే. అయినా య‌వ్వ‌నం పునః సంత‌రించుకున్న యువ‌రాజు రాజ్యానికి వ‌చ్చిన రాజ‌సం మైదానంలో దిగితే క‌న‌బ‌డుతోంది. ఐపీఎల్ ప్ర‌స్తుత సీజ‌న్‌లో సిక్స్ కొడితే అదే రాజ ఠీవి. ఫీల్డ్‌లో చిరుత‌లా క‌ద‌లాడుతూ, పాద‌ర‌సంలా పాదాలను ల‌క్ష్యంవైపు తిప్పుతూ యువీ చేసిన ర‌నౌట్ చూశారా? వీడు ఆడేది క్రికెట్టే కాన‌ట్టు ఉంటుంది.
మైదానాన్ని యుద్ధ‌క్షేత్రంగా, తానొక సైనికుడిగా భావిస్తాడేమో! మ‌నిషిలో నిర్ల‌క్ష్యం, మ‌న‌సులో ఆత్మ‌విశ్వాసం, చూపులో క‌సి, ల‌క్ష్యంపై గురి, స్వేచ్ఛా జీవ‌నం, నిర్భీతి గ‌మ‌నం యువ‌రాజ్ బ‌లం, బ‌ల‌హీన‌త‌లు. వ‌న్నె త‌ర‌గ‌ని చిన్నోడు.. క్రికెట్ అభిమానుల మ‌న‌సు దోచేదే మ‌నోడు.. నిత్య‌య‌వ్వ‌నం తొణికిస‌లాడే న‌వ‌యువ‌కుడు..యువ‌రాజ్ అంటే ఎవ‌రైనా అభిమానించ‌ని వారుంటారా? అనే సందేహంతో ఇదంతా! ఉంటే.. బ‌య‌ట‌ప‌డండి. భ‌య‌ప‌డ‌ని వీరుడుని, మృత్యుంజ‌యుడిని కెలికి చూడండి. స్టువ‌ర్ట్ బ్రాడ్‌లా మ‌రొక‌డెవ‌డో బ‌ల‌వుతాడు.
=======
శ్రీచ‌మ‌న్, జ‌ర్న‌లిస్ట్ srichaman@gmail.com

http://www.cricnkhel.com/telugu/yuvraj-singh-sri-chaman-great-cricketer-super-player-9213/

1 comment:

  1. nice post ! thanks for sharing the post.
    Visit our website for more news updates TrendingAndhra

    ReplyDelete