Monday, January 30, 2017

కోట్లు ఇవ్వ‌డం కాదు..కోర్టులివ్వండి!

ప‌త‌కాలొచ్చాయి. ప‌థ‌కాలు మొద‌ల‌య్యాయి. మెడ‌ల్స్ వ‌చ్చాయి. మేక‌వ‌న్నెపులులొస్తున్నాయి. నాడు మాటసాయం కూడా చేయ‌లేని వాళ్లు నేడు కోట్లు ప్ర‌క‌టించారు. ఆడేట‌ప్పుడు సాయం కూడా అవ్వ‌నివారు..ఇప్పుడు అడిగితే ఏ స‌హాయం అయినా చేస్తామంటున్నారు. ఆడేవాడు ప‌త‌కాలు తెచ్చేవాడు అవ‌కాశం లేక ప్రేక్ష‌కుడిలా చూస్తున్నాడు. డ‌బ్బుబ‌లంతో..రాజ‌కీయాల అండ‌తో..పైర‌వీల అర్హ‌త‌తో ఓడేవాడు అవ‌కాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. అందుకే ఆడేవాళ్లంద‌రినీ ప్రోత్స‌హించండి..ఒక‌రో ఇద్ద‌రో గెలిచాక‌..వారిద్ద‌రికీ ఇచ్చే కోట్ల‌లో ప‌దో వంతు ఒక్కో క్రీడాకారిణిపై ఖ‌ర్చు పెట్టండి. ఒక్కో క్రీడాకారుడిని త‌యారు చేయ‌డానికి వెచ్చించండి.
సాక్షి మాలిక్ ఎంతిచ్చినా వ‌ద్ద‌న‌దు. సింధుకు ఎంత‌డిగినా కాద‌న‌రు. 120 కోట్ల మందికి ప్ర‌తినిధులు వారు. ఒలింపిక్స్‌లో మువ్వ‌న్నెల రెప‌రెప‌ల‌కు కార‌కులు వీరు.  ఒలింపిక్స్ వెళ్లిన‌వాళ్లే కాదు. వంద‌కోట్లు దాటిన భార‌తావ‌నిలో గురిత‌ప్ప‌ని విలుకారులు, ప‌ట్టువ‌ద‌ల‌ని మ‌ల్ల‌యోధులు ఎంద‌రో వున్నారు. కానీ వారికి ప్రోత్సాహం ఎక్క‌డ‌?వారికి అవ‌కాశాలు ఏవి? అవును. ఇది ఒక డిమాండ్‌. ప‌చ్చిగా ప‌చ్చ నోటు సాక్షిగా చేస్తున్న డిమాండ్‌. వితండ విన‌తి. 120 కోట్లమందికి 2 పతకాలు వ‌చ్చాయి.
సిగ్గులేదా! ఇష్ట‌ప‌డి ఆడి..క‌ష్ట‌ప‌డి సాధ‌న చేస్తే..ఆ రోజు సాక్షి మాలిక్‌కు ఒక్క‌డైనా అండ‌గా వున్నాడా? ఆర్థిక సాయం చేశాడా? ఈ కోటానుకోట్ల జ‌నాల్ని ఏలుతున్న ప్ర‌జాస్వామ్య ప్ర‌భువులారా! స‌క‌ల‌క‌ళా పోష‌కులారా! క్రీడ‌ల‌పై క్రీనీడ‌లు ప్ర‌స‌రింప‌జేసిన రాజ‌పోష‌కులారా? గెలిచిన ఇద్ద‌రిపై ఇన్ని కోట్లు గుమ్మ‌రించే బ‌దులు.. కోర్టుల్లేక ఆడ‌లేక‌పోతున్న వారికి కోర్టులు ఏర్పాటు చేయొచ్చు క‌దా! బూటు లేక ప‌రిగెత్త‌లేక‌పోతున్న ప‌రుగులు రాణులు..రాజుల‌కూ ప‌త‌కం సాధించ ముందే ఓ షూ కొనివ్వొచ్చు క‌దా! కండ బ‌లం..గుండె బ‌లం అండ‌గా ఉన్నా ఆద‌రించే వారు లేక‌..ఆదుకునే వారు లేక‌..ఎంతో మంది క్రీడాకారులు..హోట‌ల్ల‌లో స‌ర్వ‌ర్లుగా, క్లీన‌ర్లుగా వున్నారంటే…అది మీ పాపం కాదా! స్పోర్ట్స్ క్యాంప్‌లో దోమ‌లు కుట్టి..జ్వ‌రాలొచ్చి..కునారిల్లిపోతున్న క్రీడా ప్ర‌తిభ మీరు ఇచ్చిన శాపం కాదా?
క్రీడాసంఘాల‌కు అధ్య‌క్షుల‌లో ఏ ఒక్క‌డికైనా ఒక ఆట‌వ‌చ్చా? పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ ద‌ళారీల నేతృత్వంలో వివిధ ఆట‌ల పోటీల‌కు ఎంపిక‌వుతున్న క్రీడాకారుల్లో స‌త్తా ఎంత‌? వ‌్య‌క్తిగ‌త ఇష్టాఇష్టాల‌తో క్రీడ‌ల‌కు మీరు చేసే ద్రోహం..ఇంకెన్ని ద‌శాబ్దాల‌పాటు ఇలా ర‌జ‌త‌, కంచు ప‌త‌కాల సంబ‌రాల‌కు ప‌రిమితం చేస్తుందో? ఇప్ప‌టికైనా అర్థం అవుతోందా? మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం కోస‌మే స్కూల్ వ‌చ్చే పిల్ల‌లున్న మ‌న దేశంలో ..ఎంత మంది అకాడ‌మీల‌కు వెళ్లి ల‌క్ష‌లు క‌ట్టి  ..కోచింగ్ తీసుకోగ‌ల‌రు. బ్యాట్ కూడా కొనుక్కోలేడు. వాడు ఆడ‌గ‌ల‌డు. అంత‌ర్‌జిల్లా పోటీల‌కు వెళ్లేందుకు బ‌స్‌చార్జీ కూడా వుండ‌దు.
వాడు స‌త్తా చాట‌గ‌ల‌డు. క‌ష్టాల‌కు ఎదురీదేవాడికి ..ఈత‌కొల‌నులు చేప‌పిల్ల‌కంటే సునాయాసంగా దాటేస్తాడు. ఆక‌లిని జ‌యించిన వాడు ప్ర‌త్య‌ర్థిని జ‌యించ‌లేడా? జీవితంతో పోరాడి గెలిచేవాడు మ‌ల్ల‌యుద్ధంలో గెల‌వ‌లేడా? స‌మ‌స్య‌ల సుడిగుండంలో.. చిక్కుకుని స‌మ‌య‌స్ఫూర్తితో బ‌య‌ట‌కొస్తున్న రోజువారీ జీవితం కంటే..ఏ పోటీ ఎక్కువ కాదు. ప‌ద్మ‌వ్యూహంలోంచి కూడా అభిమ‌న్యుడులా కాకుండా..వెళ్ల‌డ‌మే కాదు..రావ‌డ‌మూ తెలిసిన అభిన‌వ అభిమ‌న్యుల్లెంద‌రో వున్నారు. బ‌తుకులో గెలిచేవాడికి ఆట‌లో గెల‌వ‌డం ఓ లెక్కా?.. ఇక్క‌డ గెలిచే ప్ర‌తివాడూ ..ఒక బోల్ట్‌, ఒక ఫెల్ఫ్‌. స్పోర్ట్స్ హాస్ట‌ల్‌లో కోటి క‌ల‌ల ఆట‌గాళ్ల క‌డుపు నింపండి. నిదుర‌లోనూ ప్రాక్టీస్ చేస్తున్న ప‌రుగు వీరుల‌కు దోమ‌లు కుట్ట‌కుండా కాపాడండి. కోట్ల‌లో కొంత వెచ్చించి..ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో మైదానాలు మెరుగుప‌ర‌చండి. కోర్టులు సిద్ధం చేయండి. క్రీడా ప‌రిక‌రాలు ఉచితంగా అంద‌జేయండి. ఎంపిక‌లో ప్ర‌తిభ‌కు పెద్ద‌పీట వేయండి. ఇవ‌న్నీ అయ్యాక పోటీల‌కు పంపండి.. వీరు గెలుచుకొచ్చే ప‌త‌కాల‌తో మ‌న మువ్వ‌న్నెల ప‌తాకాలు రెప‌రెప‌లాడాలి. వీరు విజ‌య తీరాల‌కు చేరుతున్న‌ప్పుడు మ‌న గుండెలు ఉప్పొంగిపోవాలి. వందకోట్ల పైబ‌డిన జ‌నం జ‌య‌జ‌య విజ‌య‌ధ్వానాల‌తో ఒలింపిక్స్ మైదానాలు ద‌ద్ద‌రిల్లిపోవాలి.
శ్రీచ‌మ‌న్ జ‌ర్న‌లిస్ట్ srichaman@gmail.com

http://www.cricnkhel.com/telugu/pv-sindhu-badminton-govt-performance-11crores-no-courts-yet%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%87%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e2%80%8c%e0%b0%a1%e0%b0%82-%e0%b0%95%e0%b0%be/

No comments:

Post a Comment