Sunday, July 25, 2010

నీ మట్టిని అమ్మేందుకు నువ్వే ఓ దళారీ...

ఆ మట్టిలోనే పుట్టాడు ... పెరిగాడు
తల్లి, చెల్లిని మరిచినప్పుడే ..
దళారీ లక్షణాలు కనిపించాయి..
దేనినైనా ఎలాగైనా అమ్మడం అలవాటైంది
కొనేవాడు ఎవడైతే నాకేంటి
అమ్ముకునేది అమ్మ అయినా కమిషన్ ఇవ్వాల్సిందే
ఇప్పుడు వాడికి కనిపిస్తున్నది బువ్వ పెట్టే భూమి కాదు
ఊరిపై బుగ్గి పోసే ధర్మల్ భూమ్



Wednesday, July 21, 2010

నడక

నేనో బాటసారి
అది ఓ రహదారి
చూపే తోవ ఒకే వైపు
నడక ఎందుకో యాంత్రికమైంది

కాళ్ళకు బుద్ధిలేదు
కళ్లకూ దూర దృష్టి లేదు
ఒకటే గమ్యం
అటు వైపే పయనం

రాళ్ళూ ...ముళ్లేనా ...
తారు మారయ్యిందా
వెనుక వస్తున్నవారికీ అదే తోవ
ఎదురుపడుతున్నవారూ అదే కోవ

ఎన్నాళ్ళీ నడక
ఇదే దారిలో ఎంత వరకు వెళతావ్
దివికేగినట్టే కనిపిస్తూ
భువిని వీడదు






Friday, July 16, 2010

గుండెతో గుండును అడ్డుకుంటారా?

అల్లరి మూకలు
బతుకు భయంతో
ఆకలనే ఆయుధంతో
దాడులకు తెగబడ్డారు

ప్రజాస్వామ్య బంధువులు
ప్రభువుల సంరక్షణకు బందూకులతో
ఆత్మ రక్షణ నెపంతో
వారిని నిలువరించారు

ఆ వెలుగులు ఎవరివి
ఈ రక్తం ఏ గ్రూపుదో ?
తుపాకీకి చట్టమేంటి
ఉపాధినిచ్చే ధర్మమైన ప్లాంట్ పై రాల్లేసింది ఎవర్రా ?

గుండెతో గుండును అడ్డుకుంటారా
తాటాకు చప్పుళ్ళకు తూటా బెదరదు
ప్రాణానికి లక్షణమైన ఖరీదు
అవసరమైతే ఓ (అ) న్యాయ విచారణ

గాయం కోరేది పరామర్శ కాదు
త్యాగం కోరేది పరిహారం కాదు ...

...శ్రిచమన్.... 9490638222



గుండు ..గుండె

ఆ గుండు గురి
ఎప్పుడూ ఈ గుండెలపైనే
నీరింకని బీల
ఇప్పుడు నెత్తురోడుతోంది

అది ధర్మ భూమి
ధర్మానదీ కాదు
ధర్మల్ కు చెందదు
మా భూమిని మరుభూమిగా మార్చింది ఎవరు ?

బీలపై బేల చూపులే మీకు కనిపిస్తున్నాయ్
నీరు తేలి నెత్తురింకిన నేల అది
మీరు పూడ్చేసిన ఒక నినాదం
వేల గొంతులై ....






Monday, July 12, 2010

పారిపోదాం...

మార్నింగ్ వాక్ లు
రౌండ్ ది క్లాక్
ఉరుకు పరుగులు
నిద్రలోనూ పయనమే ..

పదండి ముందుకు
పదండి తోసుకు
తొక్కుకుంటూ .. ఎక్కుకుంటూ
ఆగకుండా నడిచే వాడే మొనగాడు

తెలియని గమ్యం
అలుపెరుగని పయనం
పడిపోతే పోయేదేం లేదు
లేచి నిలబడడం తప్పా ..

పారిపోదాం ..
నింగిలోకి ..
నీళ్ళలోకి ..
గాలిలోకి
srichaman ...

Saturday, July 10, 2010

అమ్ముకుంటే పాపమా?

ఇదీ పాపమేనా?
ముల్లకంచెల్లోవదిలేయలేదే
పందులో ... కుక్కలకో ఆహారం కాలేదే

కన్నది ఒకరైతే
కొనుక్కున్నది మరొకరు
పేదరికం దాతృత్వం ఐతే
వేరొకరికి మాతృత్వం ...

లక్షలు పోస్తే
లక్షణమైన బిడ్డనిచ్చే
సంతాన సాఫల్య కేంద్రానికి లైసెన్సు
ఆకలితో బిడ్డను అమ్ముకుంటే న్యూసెన్సు

చావూ నేరము
పుట్టుకా నేరం
చెబుతోంది చట్టం

అక్షరం ముక్క రాకపోఇనా
రాజ్యాంగం సెక్షన్లకు అనుగుణంగా
కనడమైనా... కొనడమైనా... జరగాల్సిందే
లేదంటే చట్టం తన పని చేసుకు పోతుంది




Thursday, July 8, 2010

వాన ..

చినుకు నేలను ముద్దాడింది
మట్టి వాసనేదీ ?

నై.. రుతి పవనం
ఈశాన్యానికి వాస్తు దోషం

వానకు కాలంలేదు
మేఘాలతో చెలిమి లేదు

నిషా, ఖైముఖ్, ఓగ్ని, ఐలా, లైలా ...
ఇప్పుడు చినుకంటే వణుకు

ప్రలయమో... విలయమో...
కన్నీటి సంద్రమో ...

వానలో తడవాలని ఉంది ...

Monday, July 5, 2010

వాడ్ని చంపెయ్యండి ...

వాడే .. బలవంతుడు ...
వాడికి కొనుగోలు శక్తి పెరిగినది
అందుకే ధరలు పెంచాము

వాడే .. బలహీనుడు ..
బతకలేక పోతున్నాడు ...
వాడికి ఏమీ అందకుండా బందు చేస్తున్నాము

చుక్కలు తాగి లెక్క కక్కేది వాడే
రోగాలతో కునారిల్లి ఆస్పత్రికి డబ్బు పోసేదీ
ఆకలే ఆస్తిగా అందరి అంతస్తులు పెంచేదీ వాడే

వాడు పేదోడు ..
సిండికేట్లకు పెద్దోడు ..
రక్తాన్ని చెమటగా మార్చే వాడు

వాడు చెమటను ఖర్చు చేస్తాడు
వీడు రక్తముగా మార్చి పొదుపు చేస్తాడు
వాడు batakaali ... ledu వాడ్ని చంపెయ్యండి


Sunday, July 4, 2010

నాకు దేవుడు కనిపించాడు

కొండకు ఎల్తున్నాను
బస్సులో కనిపించాడు
కండక్టర్ దేవుడు
నన్ను చూసి విసుక్కుంటూ

రైలెక్కాను
జెనరల్ టిక్కెట్టుతో రిజర్వేషన్లో ...
ఎదురయ్యాడు టిటి భగవంతుడు
సమర్పించుకున్నాను దక్షిణ

కొండ కాడ
గుండు కాడ
లడ్డు ఉండ కాడ
కనిపించారు సాములోరు

ఏడేడు కొండల దారిలో
గర్భ గుడిలో
కనిపించిన పెతి జీవుడు
నాకు దేవుడి లెక్కే కనిపిస్తున్నాడు

ఇంత మంది దేవుళ్ళను చూసిన నేనే వీఇపి ..
నేను డబ్బిచ్చిన ప్రతి చోటా హుండీ కేననుకున్న
నాకు దేవుడు కనిపించాడు బ్రేక్ దర్సనములో ....

తుపాకి మాట

వారి నోటి నిండా తూటాలే
ఆ తుపాకుల నుంచి వచ్చేవి మాటలే
ఎన్కౌంటర్ .. ఎదురు కాల్పులు
మృత దేహాన్ని గుర్తించారు

వారికి కావాల్సిన మనిషే అతడు
ఇన్నాళ్ళూ అజ్ఞాతంలో ఉన్నాడు
ఇప్పుడు చిక్కాడు
ఎ కాకి కబురు అందించిందో