Monday, January 12, 2015

నా మరణానికి ఎవరూ కారణం కాదు ..

నిండు చూలాల్లు 
నిండుగా ఉన్న
ధర్మాసుపత్రిలా ఉంది
జనరల్ బోగీ
కష్టాలను మూటగట్టి
నెత్తికెత్తుకుని సామాన్యుడిలా
దూర ప్రాంతాలకు
భారంగా కదిలిన బస్సు
విరామమెరుగని
విశాలమైన నగరదారులన్నీ
పల్లె ఇరుకు సందులకు
పరుగులు పెడుతున్నాయి
పొమ్మన్న పల్లెలో
సంకురాతిరి సంబరానికి
పిలవని పేరంటాళ్ళు
ఈ వలస పక్షులు
డబ్బుకు.. జబ్బుకు
పల్లె పట్టణమన్న తేడాల్లేవ్
అంటు కట్టిన పార్దీనియం మొక్కలు
అంటువ్యాధిలా విస్తరించాయి
ఇక్కడ క్లబ్బులు పబ్బులు
అక్కడ కోడి పందాలు
పొట్టేళ్ల పోటీలు
బెల్ట్ తీసిన షాపులు
రక్తాన్ని చెమట చేసి
కష్టాన్ని కాసులుగా మార్చి
పల్లెకొచ్చిన బాటసారి
జేబుకు చిల్లు పెట్టిన నల్ల దొరలు
తాటి తోపులో మొలిచిన
రియల్ కొలత రాళ్ళు
తొక్కుడు బిల్లాట పిల్లల కాళ్ళకు
చేసిన మానని గాయం
పళ్ళు లేని ఊక జోరులో
గుంట నక్కలు
వూరిలో మనుషుల్ని
పీక్కు తినే ఊర కుక్కలు
పంటల్లేని పల్లెలో
ఆకలి మంటల్లా
భోగి మంటలు
టైర్ కాలిన వాసన
పండగ పూట అందరూ
ఆటకెళ్ళే పెద్ద తోట
చెట్టు మోడై భూమి బీడై
చిన్నబోయింది
మద్యం మత్తులో
వావివరసలు మరిచిన
కనుమ కలహాలు
కంపరం పుట్టిస్తున్నాయి
చెరిగిపోతున్నఅద్భుత చిత్రాన్ని
తిరిగి చిత్రించేందుకు
నేను బ్రమ్మనూ కాను
ఆయన చేసిన బొమ్మను
అందుకే కూలిపోయిన
నా పూరిల్లు సాక్షిగా
బ్రాందీ సీసాలో దూరి
ఆత్మహత్య చేసుకుంటున్నాను ..
.............. శ్రీచమన్ .............. (12. 01. 2015)

No comments:

Post a Comment