Tuesday, January 27, 2015

మేక్ ఎ విష్


నగరం మురుగు
నురగలు కక్కుతూ 
నాలాలు పొంగి 
నడిరోడ్డుపై ప్రవహిస్తోంది 

సకల మలినాలు 
అనంత వ్యర్ధాలు 
తమ కుల్లునంతటికీ 
నల్లటి రూపమిచ్చాయి 

స్లిమ్ ఉమ్మేసిన చెత్త 
పోష్ విసిరేసిన యాష్
హైట్స్ నుంచొచ్చిన  డస్ట్ బిన్లు 
స్లమ్ ను ముంచెత్తాయి 


ఓడలు తిరగని మురికివాడలో 
నావే కానరాని వైతరిణీ నదిలో 
ఉందో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల 


హారన్ మోగించే క్రూర జంతువులను  
తప్పించుకుంటూ.. ఒప్పించుకుంటూ 
కంకర అడవుల ముళ్ళ బాటలో 
పాదరక్షలు లేని అక్షర కాంక్ష 


పలకా పుస్తకాలతో 
ప్రతి రోజూ పసిపాపల 
పద్మవ్యూహ ప్రవేశం 
అభిమన్యుడికి ఒకసారే 


కేజీ టు పీజీ ఉచిత విద్య 
ఇక్కడ చదువు"కొనక్క"ర్లేదు 
చదువుకెల్లడమే కష్టం 
చిన్నపిల్లలకు పెద్ద బాల"శిక్ష"

చిట్టి పాదాలు చెప్పుకోలేవు 
చెప్పులు  కొనివ్వండి 
చిరిగి శల్యమైన పుస్తకాలకు 
ఓ సంచి దానమివ్వండి 

తీర్చండి వీరి మేక్ ఎ విష్ 
కొన ప్రాణాలతో ఉన్న 
చదువుల తల్లులకు 
కొత్త వూపిరివ్వండి 

(కృష్ణానగర్ సమీపం ఇందిరానగర్ బస్తీలో ప్రభుత్వ పాఠశాలకు చెప్పులు లేకుండా, పుస్తకాలు ఉంచేందుకు సంచి లేకుండా పొంగుతున్న మురుగు ప్రవాహాన్ని దాటుకుంటూ కిలో మీటర్ దూరం నుంచి వస్తున్న చిట్టితల్లిని చూసి) 

శ్రీచమన్ ............... 27. 01. 2015








No comments:

Post a Comment