Wednesday, February 8, 2017

ప‌థం-దృక్ప‌థం...4

ప‌థం-దృక్ప‌థం...4
అది ఓ మ‌త్తు. ఓ వ్య‌స‌నం. మాన‌ని మాన‌సిక రుగ్మ‌త‌. పేరేదైనా దాని తీరొక్క‌టే. అంద‌లం, అధికారం, పీఠం..ఏదైనా కానీ. కుల‌,మ‌త‌,ప్రాంతాల‌కు అతీతంగా దానికి లోనుకాని దాసుడు లేడు. దాసీ లేదు. కీర్తి, కాంత‌, క‌న‌కం ..వీట‌న్నింటితో సంబంధ‌బాంధ‌వ్యాలు క‌లుపుకున్న అధికారం స్టైలే వేరు. నేతాజీకి పుత్రాజీ భ‌యం. జామాత‌తో మామ‌కు సంక‌టం. ఇష్ట‌స‌ఖితో ఇర‌కాటం. నెచ్చెలి అంట‌. ఈ చెలిక‌త్తె..విషం పూసిన క‌త్తి అని తెలిసీ..మీడియా, ప్ర‌జ‌లు ప్రియ‌స‌ఖి అని సంబోధిస్తూ..కొత్త అర్థాలు తీస్తున్నారు. అధికారం కోసం త‌మ అనుకూలురు చేసే కుట్ర‌ల‌కు ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌..అమ్మ మాట కోసం వంటి కొత్త ప‌దాలు..వాటి అర్థాలు వెతికి ప‌ట్టి మ‌రీ మీడియా..త‌న పాత్ర తాను పోషిస్తోంది. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా..ప్ర‌జ‌ల్ని, దేశాన్ని, చివ‌రికి సొంత త‌ల్లినీ, తండ్రినీ, బిడ్డ‌ల్నీ అన్యాయం చేయ‌డానికీ..అంతం చేయ‌డానికీ వెనుకాడ‌ని ప్ర‌మాద‌క‌ర ధోర‌ణులు ప్ర‌జాస్వామ్యంలో పొడ‌సూపుతున్నాయి. ఓటేసే ప్ర‌జ‌ల‌కు వేటేసే అవ‌కాశం లేదు. అందుకే కుర్చీ కోసం కొట్టుకుంటూ కుమ్ముకుంటున్నారు. ఉత్త‌ర‌దిక్కుకు వెళితే..త‌న‌యుడుతో తండ్రి ఢీ అంటాడు. ద‌క్షిణాదికొస్తే అధికారం కోసం అర్రులు చాచ‌డంలో ఆది..ఇదే ప్రాంతం అని చెప్పొచ్చు. మామకు తోడుగా వుండి..నీడ‌లా వెంటాడి వెనుకుండి ఒక్క‌పోటు పొడిచేశాడు. ఆయ‌నే ఇప్పుడు మీడియా పాలిట‌ అప‌ర‌చాణుక్యుడు. ఉద్య‌మాల‌తో సాధించుకున్న రాష్ర్టంలోనూ అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా సాగిస్తున్న ప‌ర‌మ‌ప‌ద‌సోపాన ప‌టంలో కొంద‌రు పాముల నోట చిక్కారు. మ‌రికొంద‌రికి నిచ్చెన‌లు అందాయి. అద‌ను చిక్క‌డంలేదు కానీ..ప‌దునైన కుట్ర‌లు తెర‌వెనుక సాగుతున్నాయి. అర‌వనాట మ‌రో థియ‌రీ. అమ్మా అని అరిచినా కాన‌రాని అమ్మ బొమ్మ పెట్టి ఆడుతున్న ``ప‌వ‌ర్‌``ఫుల్ డ్రామా ..రోజుకో మ‌లుపు తిరిగి ర‌క్తి క‌ట్టిస్తోంది. ప్ర‌పంచంలోనే వ్య‌క్తిపూజ‌కు ప‌రాకాష్ట‌గా నిలిచిన త‌మిళ‌నాడులో అధికారం కోసం సాగుతున్న పులిజూదం చూస్తే ..ప‌వ‌ర్‌కు ఇంత ప‌వ‌ర్ ఉందా అనిపిస్తుంది. చిన్న‌మ్మా అని పిల‌వ‌బ‌డే శ‌శిక‌ళ‌కు పిల్ల‌లు లేరు. తిన‌డానికి లోటు లేక‌పోవ‌డ‌మే కాదు..రోజుకు కోటి నోట్లు తిన్నా త‌ర‌గ‌ని సంప‌ద పోగైంది. ఏ లోటూ లేదు. సంపాదించి త‌ర‌త‌రాల‌కు త‌ర‌గ‌కుండా పిల్ల‌ల‌కు పెట్టాల‌నీ లేదు. మ‌రెందుకు శ‌శిక‌ళ‌కు ఈ ఆరాటం అంటే.. అధికారంలో వున్న మాయ‌. అధికారంలో వున్న మ‌త్తు. ప‌వ‌ర్‌లో వుంటే వ‌చ్చే ఎక్స్‌ట్రా ప‌వ‌ర్‌. అందుకే ఈ కుట్ర‌లు. అధికారం కోసం..అధికారం చేత‌..అధికారం వ‌ల‌న‌.. సాధించిన అధికారంతో.. ధిక్కారాన్ని తొక్కేసి.. అంద‌లం ఎక్కేసి.. దాని శాశ్వ‌తం చేసుకోవాల‌నే భ్ర‌మ‌ల్లో నిత్యం కుట్ర‌లూ, కుతంత్రాల‌తోనే జీవితం సాగిస్తున్నారు మ‌న నేత‌లు. అందుకే అధికారం వున్న చోట కుట్రలు వుండి తీరుతాయి.
చ‌ల్లా మ‌ధుసూద‌న‌రావు

No comments:

Post a Comment