Saturday, February 11, 2017

కాలాలీత క‌విత‌లు

నా మరణానికి ఎవరూ కారణం కాదు ..
నిండు చూలాల్లు
నిండుగా ఉన్న
ధర్మాసుపత్రిలా ఉంది
జనరల్ బోగీ

కష్టాలను మూటగట్టి
నెత్తికెత్తుకుని సామాన్యుడిలా
దూర ప్రాంతాలకు
భారంగా కదిలిన బస్సు

విరామమెరుగని
విశాలమైన నగరదారులన్నీ
పల్లె ఇరుకు సందులకు
పరుగులు పెడుతున్నాయి

పొమ్మన్న పల్లెలో
సంకురాతిరి సంబరానికి
పిలవని పేరంటాళ్ళు
ఈ వలస పక్షులు

డబ్బుకు.. జబ్బుకు
పల్లె పట్టణమన్న తేడాల్లేవ్
అంటు కట్టిన పార్దీనియం మొక్కలు
అంటువ్యాధిలా విస్తరించాయి

ఇక్కడ క్లబ్బులు పబ్బులు
అక్కడ కోడి పందాలు
పొట్టేళ్ల పోటీలు
బెల్ట్ తీసిన షాపులు

రక్తాన్ని చెమట చేసి
కష్టాన్ని కాసులుగా మార్చి
పల్లెకొచ్చిన బాటసారి
జేబుకు చిల్లు పెట్టిన నల్ల దొరలు

తాటి తోపులో మొలిచిన
రియల్ కొలత రాళ్ళు
తొక్కుడు బిల్లాట పిల్లల కాళ్ళకు
చేసిన మానని గాయం

పళ్ళు లేని ఊక జోరులో
గుంట నక్కలు
వూరిలో మనుషుల్ని
పీక్కు తినే ఊర కుక్కలు

పంటల్లేని పల్లెలో
ఆకలి మంటల్లా
భోగి మంటలు
టైర్ కాలిన వాసన

పండగ పూట అందరూ
ఆటకెళ్ళే పెద్ద తోట
చెట్టు మోడై భూమి బీడై
చిన్నబోయింది

మద్యం మత్తులో
వావివరసలు మరిచిన
కనుమ కలహాలు
కంపరం పుట్టిస్తున్నాయి

చెరిగిపోతున్నఅద్భుత చిత్రాన్ని
తిరిగి చిత్రించేందుకు
నేను బ్రమ్మనూ కాను
ఆయన చేసిన బొమ్మను

అందుకే కూలిపోయిన
నా పూరిల్లు సాక్షిగా
బ్రాందీ సీసాలో దూరి
ఆత్మహత్య చేసుకుంటున్నాను ..
.............. శ్రీచమన్ .............. (12. 01. 2015)



సాగరుడే వీరుడు //శ‌్రీచ‌మ‌న్‌//

క‌ల‌లు కూడా అల‌ల్లానే
వ‌చ్చి పోతుంటాయి
క‌ళ క‌ట్టిన ఇసుక గూళ్లు
క‌సిగా కుమ్మేస్తుంది కాలం

భార‌మైన ప్ర‌తీ దాన్నీ
సుదూరాల‌కు విసిరేసి
మ‌ళ్లీ ప్రేమ‌గా ఒడ్డుకు చేర్చి
త‌న ఒడిలో లాలిస్తుంది తీరం

క‌డ‌లి హోరులో ఊసులు
సాగ‌ర ఘోష‌లో బాస‌లు
క‌ల్లోల కెర‌టాల కింద‌
మాసిపోయిన పాద‌ముద్ర‌లు
అల చెరిపేసిన అక్ష‌రాలు

కామోద్దీప‌న ప్రేరేపిత‌ ప్రేమ‌లు
అవాంఛిత అనురాగాలు
బికినీ.. బీచ్ బంధాలు
కోరికల్ని తీర్చుకునే అందాలు

త‌న త‌నువు చివ‌ర‌ తీరంలో
కోట్లాది ప్రేమ‌లు విడిచిన గుర్తులు సాక్షిగా
అదే నదీ క‌న్య‌క‌ల‌తో ప‌దేప‌దే ర‌మిస్తూ
ఒక అనంత‌కాల‌పు సాగ‌ర‌మోహం

త‌ర‌త‌రాల చ‌రిత‌ను
తిర‌గ‌రాస్తున్న త‌రంగాలు
గెలుపోట‌ముల నాయ‌కుడు
సాగ‌రుడే వీరుడు
....................................................18-11-16


మ‌ళ్లీ వాడే వ‌చ్చాడు// శ‌్రీచ‌మ‌న్ //

మొద‌ట వాడు
భ‌జ‌నప‌రుడి కోసం వ‌చ్చాడు
నేనా భ‌జ‌న‌బృందంలో లేను

త‌ర్వాత వాడు
చాడీలు చెప్పేవాడి కోసం చూశాడు
చాడీలు చెప్ప‌డం నాకు చేత‌కాదు

అనంత‌రం వాడు
త‌న‌ ప్రాంతంవాడిని వెతికాడు
నాదా ప్రాంతం కాదు

మ‌రోసారి వాడు
త‌న కుల‌పోడిని అన్వేషించాడు
నేనా కులం వాడిని కాను

ప‌ట్టువ‌ద‌ల‌ని వాడు
త‌న మ‌తం వాడి కోసం నిరీక్షించాడు
నాదా కుత్సిత మ‌తం కాదు

చివ‌రిగా వాడు
మ‌నిషి కోసం వ‌చ్చాడు
నేను మ‌నిషినే అంటే న‌మ్మ‌లేదు
భ‌జ‌న చేయ‌లేవు..
చాడీలు చేత‌కావు..
ప్రాంతం, కులం, మ‌త‌మూ
ఏదీ క‌ల‌వ‌న‌ప్పుడు
నువ్వు మ‌నిషివంటే నేనెలా
న‌మ్మాల‌ని ప్ర‌శ్నించాడు?

శ్రీచ‌మ‌న్‌.... 08.11.2016
(జర్మన్‌ కవి ఫాస్టర్‌ మిల్లర్‌కు క్ష‌మాప‌ణ‌ల‌తో)




షిఫ్ట్+ఆల్ట్ ...డిలీట్//శ్రీచ‌మ‌న్‌//
..........................................

మెమ‌రీ కార్డ్ ఫుల్
క‌ల‌ల్ని చెరిపేసేయ్‌
ఆశ‌ల్ని చిదిమేసేయ్‌
లైఫ్‌కు స్పేస్ కావాలి

న‌చ్చిన షేప్లో డిజైన్ చేసేందుకు
జీవితం ఫోటోషాప్ కాదు క‌దా!
కొన్ని ఫిల్ట‌ర్‌లు, మ‌రికొన్ని ఎఫెక్ట్‌లు
వేసి విషాదాల్ని బ్ల‌ర్ చేయ‌లేవు

కంట్రోల్ ప‌ట్టుకుని సీ కొడితే
నీకు న‌చ్చిన‌వి కాపీ కావు
కంట్రోల్ పీ ఒత్తితే
కావాల్సిన‌ద‌ల్లా నీ లైఫ్ డెస్క్‌పై
ఉన్న ఫోల్డ‌ర్‌లో పేస్ట్ కాదు

చిత్ర‌మైనా, దృశ్య‌మైనా
బొమ్మ వెనుక బొరుసు
ఎడిటింగ్‌లో క్వాలిటీ లోపిస్తే
లైఫ్‌లో క్లారిటీ మిస్స‌వుతుంది.

24 ఫ్రేమ్స్ డ్రీమ్స్‌
అద్దంలా ముక్క‌లై
ఒక్కో ముక్క‌లో ఒక్కో ముఖం
నీ ప్ర‌తిరూపం భిన్న‌మైంది

సిస్ట‌మ్ మొత్తం వైర‌స్‌
ఫార్మాట్ చేయాల్సిన
స‌మ‌యం ఆస‌న్న‌మైంది
ప్ర‌స్తుతానికి కొన్ని టెంప్ ఫైల్స్‌
షిఫ్ట్ ఆల్ట్ డిలీట్ కొట్టేసేయ్‌

డిలీట్‌..డిలీట్‌..
జీవిత‌కాలం లేటు
పేరు ముందు లేట్‌
కూడా డోన్ట్ డిలీట్‌

శ్రీచ‌మ‌న్‌.....9490638222 (07.11.2016)




//జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు //శ‌్రీచ‌మ‌న్‌//
న‌ది ఎండిన‌ది
క‌న్నీటి చారిక‌
అల్ల‌క‌ల్లోల తీరం
దుఖఃసాగ‌రం
బీడు భూములు
పిట్ట‌ల బొమ్మ‌లు
మ‌నుషుల మ‌న‌సులు
ముళ్ల‌కూ ఓ కంచె
దేహానికి దాహం
పొంచివున్న ద్రోహం
క‌లకు మెల‌కువ‌
అంతా భ్రాంతి
నిద్ర‌కు ఓ మాత్ర‌
రోజూ ఓ మ‌ర‌ణం
ఉద‌యం ఓ అలారం
నిత్య‌మూ జ‌న‌నం
.....................................24.07.16



//మ‌నిషి కావాలి//శ్రీచ‌మ‌న్//
న‌లుగురిలో న‌వ్వేందుకు
ఓ ముఖం కావాలి

ఒంట‌రిగా ఏడ్చేందుకు
కాసిన్ని క‌న్నీళ్లు రావాలి

బ‌హిరంగంగా అరిచేందుకు
ఓ నినాదం రాయాలి

పిడికిలెత్తి నిన‌దించేందుకు
న‌రాల‌కు శ‌క్తి అవ‌స‌రం

అప్పుడ‌ప్పుడూ సిగ్గుప‌డేందుకు
శ‌రీరంలో చీమూనెత్తురు వుండాలి

సాయం చేయాల‌నిపించేందుకు
స్పందించే మ‌న‌సుంటే మంచిది

మంచో చెడో మాట్లాడ‌టానికి
ఒక మ‌నిషి అత్య‌వ‌స‌రం

..............................................04.07.2017


నువ్వూ వెళ్లి``పోతావ్‌`` //శ్రీచ‌మ‌న్ //

చేప‌ల కోసం చెరువుని
చెక్క‌ల కోసం చెట్టుని
ఇసుక కోసం న‌దిని
ఇంధ‌నం కోసం సంద్రాన్ని
గోళ్లు కోసం పులుల్ని
ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌కృతిని
ప‌ద‌వుల కోసం ప్ర‌జ‌ల్ని
మింగేసిన త‌రువాత
నువ్వూ, నీ వార‌సులు మాత్ర‌మే
ఉంటార‌ని ఎలా అనుకుంటావో
.............................................30.06.16



రుణం అను బంధం//శ‌్రీచ‌మ‌న్// 17.06.16

అంతా మిధ్య అనుకున్న
దాంట్లో ఎంత వైవిధ్యం
గాలి, నీరు, ఆహారమే కాకుండా
కొన్ని ఆఫ‌ర్లు నిత్యావ‌స‌రం
మ‌రికొన్ని కాప్లిమెంట‌రీ పాస్‌లు
అత్య‌వ‌స‌రం

చెప్పుల్లేక‌పోయినా, అప్పుల్లేక‌పోయినా
న‌డ‌వ‌డం చాలా క‌ష్టంగా వుంది మాస్టారు
మీకు ``అప్పు``డే తెల్లారిందా? అంటాడు అశోక్‌
ఎనిమిదేళ్ల స్నేహంలో పంచుకున్న‌
టీక‌బుర్ల‌లో రుణానుబంధాల‌దే అగ్ర‌స్థానం

అప్పుల కోసం ఎక్కే మెట్ల
ముందు విడిచిన చెప్పులు
త‌ప్పులు చేసిన‌వాడెక్కిన కోర్టు మెట్లు
అడ‌గ‌డంలో నైపుణ్యం !
సారీ! అడుక్కోవ‌డంలో ఒక లావ‌ణ్య‌త
అల‌వాటుగా మారిపోతుంది

జీతం ఏంచేస్తున్నాడో?
పెళ్లి చేశాడా? ఇల్లుక‌ట్టాడా?
ఎప్పుడూ అప్పే అంటాడు
దాత మ‌దిలో అనుమానాలు.
సందేహం తీర్చేందుకు స‌మ‌యం చాల‌దు
గ‌డువు గ‌డ‌ప ముందు కుర్చీవేసుక్కూర్చుంది
వ‌డ్డీ అస‌లుతో క‌లిసి నిల‌దీసేందుకొచ్చింది

అప్పిచ్చువాడు ఇచ్చు స‌ల‌హాలు ఉచితం
అప‌ర‌చాణ‌క్యుడిలా అర్థ‌శాస్ర్త ప్ర‌ద‌ర్శ‌న చేస్తాడు
నువ్వు అప్పు ఇస్తే అదే ప‌దివేలు అంటే!
ఓ వెయ్యి తీసుకో తిరిగివ్వ‌క్క‌ర్లేద‌నే
మోడ్ర‌న్ ఎకాన‌మీని ముందుంచుతాడు

రుణానుబంధాలు
అనుబంధాల‌ను ప్ర‌శ్నిస్తాయి
స్నేహ‌సంబంధాలు, బంధువులను
అప్పుల ముప్పు ముట్ట‌డిస్తుంది

ఫోన్ రింగొస్తే వారికి బెంగ‌
రింగ్ టోన్‌ ``రుణ‌``గొణ‌ధ్వ‌నిలా
ఈ కాల్ ఇంత‌టితో శాశ్వ‌తంగా
క‌ట్ అయిపోతే బాగున్న‌నిపించేలా

మాయ‌మైన స్నేహితులు
దూర‌మైన బంధువులు
ప్ర‌త్య‌క్ష‌మైన‌ రుణాలు
ద‌గ్గ‌రైన అస‌లువ‌డ్డీలు
ప‌త్రాలా సాక్ష్యాలా నిను ఒంట‌రికాకుండా
కాపాడుకొచ్చే రుణానుబంధం
మాన‌వ‌సంబంధాల స్థానంలో
వ‌చ్చి కూర్చున్నాయి మ‌నీసంబంధాలు
..................................................................(భ‌య‌ద సౌంద‌ర్యం శీర్షిక‌తో కొప్ప‌ర్తిగారు రాసిన క‌వితాస్ఫూర్తితో)




శ్రీచ‌మ‌న్//the last picture అన‌బ‌డు చివ‌రి చిత్రం////
....................................
ముఖ క‌వ‌ళిక‌లో క‌ళ శూన్యం
కుంచె క‌ద‌లికలో నైరాశ్యం
బ‌హుభాషా కోవిదుడు
కానీ మూగ‌వాడు
ముభావ‌మే భావం
ఆల్ వాట‌ర్ క‌ల‌ర్స్

దేహాంత‌ర్వాహినిలో
చ‌ల‌నాలు..సంచ‌ల‌నాలు
జ్వ‌రాలు..జ్వ‌ల‌నాలు
కాలాతీత‌ సంకేతాలు

టెంప‌రేచ‌ర్ రీడింగ్‌
థ‌ర్మామీట‌ర్ ధ‌ర్మం
హృద‌యం ఉష్ర్ణ‌ప‌క్షి
ఈ రోజు న‌మోదైన క‌నిష్ట‌, గ‌రిష్ట‌
ఉష్ణోగ్ర‌త‌లు ఈ విధంగా ఉన్నాయి

ఓజోన్ తాటాకు చ‌ప్పుళ్ల‌కు
బెద‌ర‌ని నిప్పుల కుంప‌టి
ఆరోగ్య‌ప్ర‌దాత సౌజ‌న్యంతో
రోగుల‌కు ఓ వైద్య‌శిబిరం

దింపుడుక‌ళ్ల‌ము ద‌గ్గ‌ర‌
the last picture అన‌బ‌డు
చివ‌రి చిత్రం మ‌స‌క ..మ‌స‌క‌గా
ఎగిసిప‌డుతున్న మంట‌ల్లో
ఓ ద‌గ్ధ దృశ్యం
.......................................
శ్రీచ‌మ‌న్‌, 9490638222



No comments:

Post a Comment